నటుడు విజయ్ సేతుపతి ఒక్క కోలీవుడ్ లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా నటిస్తున్నారు. ఆయనకు ఇప్పుడు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది. అన్ని భాషల్లోనూ ఆయనకు అభిమానులు ఉన్నారు. సినిమాల మీద ఇంట్రస్ట్ తో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన విజయ్ ‘పిజ్జా’ సినిమాతో హీరోగా మారారు. ఓ వైపు హీరోగా చేస్తూనే మరో వైపు విలన్ పాత్రల్లోనూ అదరగొడుతున్నారు. ఇక ఆయనకు ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సోషల్ మీడియాలోనూ విజయ్ ఫుల్ యాక్టీవ్ గా ఉంటారు. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ అప్డేట్స్ ను అభిమానులతో పంచుకుంటారాయన. ఇటీవల విజయ్ సేతుపతికి చెందిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసి సేతుపతి అభిమానులు తెగ మురిసిపోతున్నారట.
విజయ్ ను కలసిన ఓ బుల్లి అభిమాని..
చాలా మంది అభిమానులు తమ ఫేవరేట్ హీరోలను కలవడానికి ఎంతో ప్రయత్నిస్తుంటారు. వారితో ఒక్క ఫోటో అయినా తీసుకోవాలని కోరుకుంటారు. అయితే అలాంటి అవకాశం చాలా కొద్ది మందికి మాత్రమే వస్తుంది. ఇటీవలే విజయ్ సేతుపతిని ఓ అభిమాని కలిశాడు. ఆ అభిమాని వయసు మూడేళ్లు. ఆ బుల్లి అభిమానికి విజయ్ సేతుపతిని కలిసే అవకాశం లభించింది. నేరుగా ఆయన క్యారవ్యాన్ లోకి వెళ్లి విజయ్ తో ముచ్చట్లు పెట్టాడు ఆ బుడతడు. ఇదంతా పక్కన ఉన్నవాళ్లు వీడియో తీశారు. అయితే ఆ వీడియోను విజయ్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో కాస్తా వైరల్ అయింది.
అడిగి మరీ ముద్దు పెట్టించుకున్న విజయ్ సేతుపతి
తనను కలవడానికి వచ్చిన బుల్లి ఫ్యాన్ తో విజయ్ సేతుపతి కాసేపు ముచ్చటించారు. ఆ చిన్నారి ముద్దు ముద్దు మాటలకు మురిసిపోయారు. చిన్నారి కుటుంబం గురించి అడిగి తెలుసుకున్నారు. తన వయసు రెండేళ్లనీ, తన నాన్నమ్మ వయసు కూడా రెండేళ్లే అని ఆ బుడతడు చెప్పడంతో విజయ్ నవ్వుకున్నారు. ఆ పిల్లాడి మాటలను దీక్షణంగా విన్నారు. చాక్లెట్ తింటావా అని అడిగితే సరేన్నాడు ఆ బుడతడు. వెంటనే చాక్లెట్ ఇచ్చి పంపించారు. మళ్లీ వెంటనే ఆ బుడతడిని వెనక్కి పిలిచి ఓ ముద్దు ఇచ్చి వెళ్లరా అని అన్నారు. దీంతో ఆ చిన్నారి విజయ్ కు ఓ ముద్దు ఇచ్చి వెళ్లాడు. అందుకు సంబంధించిన వీడియోను విజయ్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసుకున్నారు. ఇది చూసిన విజయ్ ఫ్యాన్స్ ‘అన్నా నువ్ సూపర్, బుడ్డోడు లక్కీ’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇక విజయ్ సేతుపతి ప్రస్తుతం వరుస సినిమాల్లో బీజీగా ఉంటున్నారు. అటు సినిమాలు ఇటు వెబ్ సిరీస్ లలో నటిస్తూ మెప్పిస్తున్నారు. ఆయన రీసెంట్ గా తమిళ స్టార్ దర్శకుడు వెట్రిమారన్ దర్శకత్వంలో 'విడుతలై పార్ట్ 1' లో నటించారు. ఈ సినిమా అక్కడ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు మూవీను 'విడుదల పార్ట్ 1'గా తీసుకు వస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 15 న తెలుగులో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.
Also Read: బాబోయ్! ప్రేమ కోసం రాజశేఖర్‌ను జీవిత బ్రిడ్జి మీది నుంచి తోసేసిందా?