Actor Pavithra Gowda seen wearing Make-up In Custody, Cop Gets Notice: కర్నాటకలో జరిగిన రేణుక స్వామి హత్య కేసులో ప్రధాన నిందుతురాల్లో ఒకరు పవిత్ర గౌడ. ప్రస్తుతం ఆమె పోలీసుల కస్టడిలో ఉంది. అయితే, విచారణ టైంలో ఆమె మేకప్ వేసుకుని ఉండటం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. దీనిపై ఒక లేడీ ఎస్సైకి నోటీసులు జారీ చేశారు అధికారులు. అసలు ఏం జరిగిందంటే?
లిప్ స్టిక్ తో నవ్వుతూ బయటికి..
రేణుక స్వామి హత్య కేసు విచారణలో భాగంగా పవిత్ర గౌడ ప్రియుడు, హీరో దర్శన్‌ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇక ఆ కేసుకు సంబంధించి పవిత్రను కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణలో భాగంగా సీన్ రి క్రియేట్ చేసేందుకు, వివరాలు సేకరించేందుకు ఆమెను తన ఫ్లాట్ కి తీసుకెళ్లారు. అయితే, అక్కడ నుంచి తిరిగి వస్తున్న పవిత్ర లిప్ స్టిక్, మేకప్ వేసుకున్నట్లు కనిపించారు. ఎర్రటి లిప్ స్టిక్ ని ఫ్రెష్ గా పెదాలకు రాసుకుని, నవ్వుతూ బయటికి వచ్చారు. దీంతో ఈ విషయంపై దుమారం రేగడంతో బెంగళూరు వెస్ట్ డీజీపీ ఎస్సైకి నోటీసులు ఇచ్చారు వివరణ ఇవ్వాలని ఆదేశించారు.
"పవిత్ర ప్రతి రోజు రాత్రి ఆమె ఇంట్లోనే ఉంటారు. తన ఇంట్లో మేకప్ కిట్ ఉంటుంది. లేడీ ఎస్సై వెళ్లి ఆమెను ప్రతి రోజు ఉదయం ఏపీ నగర్ పోలీస్ స్టేషన్ కి తీసుకురావాలి. ఆ టైంలో ఆమె ఈ విషయాన్ని గమనించాలి. ఆమె మేకప్ వేసుకోకుండా ఆపాలి. కానీ, అలా చేయలేదు. నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఆమెకు నోటీసులు ఇచ్చాం’’ అని బెంగళూరు పశ్చిమ డీజీపీ గిరీశ్ మీడియాతో చెప్పారు.
అసభ్యంగా మెసేజ్ లు పెట్టినందుకు..
పవిత్ర గౌడ, దర్శన్ ఇద్దరు కలిసి నటించారు. ఇద్దరు కలిసి ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే రేణుక స్వామి అనే ఒక అభిమాని పవిత్రకు అసభ్యంగా మెసేజ్ లు పెట్టిన కారణంగా.. పవిత్ర అతనిపై దర్శన్ కి చెప్పి చంపేందుకు ప్రేరేపించింది. దీంతో కోపం పెంచుకున్న దర్శన్ రేణుకస్వామిని పిలిపించి అతడిని టార్చర్ చేసి చంపేశారు. దీంతో ఈ కేసులో పవిత్ర గౌడ ప్రధాన నిందుతురాలు కాగా.. దర్శన్ ఏ2. రేణుక స్వామి కేసులో ఇప్పటికే 15 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెప్పారు. రేణుక స్వామిని టార్చర్ చేసి, ఇబ్బందులు, చిత్రహింసలు పెట్టి చంపేసినట్లు పోలీసులు చెప్తున్నారు. జూన్ 8న రేణుక స్వామిని చంపేసి, పక్కనే ఉన్న ఒక షడ్ దగ్గర పడేసినట్లు పోలీసులు చెప్పారు. చిత్ర దుర్గ్ లోని ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ద్వారా హీరోని కలవాలని చెప్పి రేణుక స్వామిని పిలిపించి అతి దారుణంగా చిత్రహింసలు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.
Also Read: వారం రోజుల వరకు నా గొంతు పనిచేయదు - ‘కల్కి 2898 AD’పై రేణు దేశాయ్ రివ్యూ