Nani Recent Movies TRP Ratings: నేచురల్ స్టార్ నానికి ఫ్యామిలీ ఆడియెన్స్ లో ఎలాంటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కెరీర్ ప్రారంభం నుంచీ ఎక్కువగా పక్కంటి అబ్బాయి తరహా పాత్రలు పోషిస్తూ.. తన సహజమైన నటనతో ఆకట్టుకున్నారు.. క్లాస్ హీరో ఇమేజ్ తెచ్చుకున్నారు. మరోవైపు మాస్ రోల్స్ కూడా ట్రై చేస్తూ, మాస్ యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక నాని సినిమాలు బిగ్ స్క్రీన్ మీదనే కాదు, స్మాల్ స్క్రీన్ మీద కూడా విశేష ఆదరణ దక్కించుకుంటుంటాయి. అయితే ఈ మధ్య కాలంలో ఆయన సినిమాలకు ఆశించినంత టీఆర్పీ రావడం లేదు.


నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం 'హాయ్ నాన్న'. తండ్రీ కూతుళ్ళ సెంటిమెంట్‌ ప్రధానంగా సాగే ఈ సినిమాను డెబ్యూ డైరెక్టర్ శౌర్యువ్‌ తెరకెక్కించాడు. వైరా ఎంటెర్టైన్మెంట్స్ వారు నిర్మించారు. గతేడాది డిసెంబర్ లో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర మంచి విజయం సాధించింది. ఆ తర్వాత ఓటీటీలోనూ సత్తా చాటింది. ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ నెట్‌ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ చేయబడిన ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ బుల్లితెర మీద మాత్రం ఈ సినిమాని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదని తెలుస్తోంది.


'హాయ్ నాన్న' సినిమా మార్చి 17వ తేదీ ఆదివారం నాడు జెమిని టీవీలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారం చేయబడింది. ఈ చిత్రానికి 4.45 టీఆర్పీ రేటింగ్ మాత్రమే వచ్చింది. ఫ్యామిలీ ఆడియెన్స్ లో మంచి క్రేజ్ ఉన్న నాని సినిమాకు ఇది చాలా తక్కువ రేటింగ్ అనే చెప్పాలి. అందులోనూ ఇది ఫీల్‌ గుడ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. కుటుంబం అంతా కలిసి చూసే సినిమా. అయినప్పటికీ ఈ చిత్రానికి మొదటి టెలికాస్ట్ లో ఇలాంటి దారుణమైన టీఆర్పీ రావడం అందరినీ షాక్ కు గురి చేసింది.


నిజానికి ఇటీవల కాలంలో నాని సినిమాలు ఆశించిన స్థాయిలో టీఆర్పీ రాబట్టడం లేదు. థియేటర్లలో విజయం సాధించిన 'శ్యామ్ సింగరాయ్' మూవీకి 6.87 రేటింగ్ వస్తే.. 100 కోట్ల వసూళ్లతో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన 'దసరా' చిత్రానికి కేవలం 4.99 టీఆర్పీ వచ్చింది. ఇక 'అంటే సుందరానికీ' సినిమా 1.88 రేటింగ్ మాత్రమే రాబట్టింది. ఇప్పుడు 'హాయ్ నాన్న' మూవీ కూడా 4.45 టీఆర్పీతో సరిపెట్టుకుంది. మామూలుగా రెండంకెలు దాటితేనే దాన్ని మంచి టీఆర్పీగా పరిగణిస్తారు. కానీ నాని సినిమాలు చాలా దూరంలోనే ఆగిపోతున్నాయి.


అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన మరో విషయం ఏంటంటే.. థియేటర్లలో హిట్టయిన సినిమా ఓటీటీలో సక్సెస్ అవ్వాలని లేదు. అలానే ఓటీటీలో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న చిత్రం టీవీలలో ఆదరణ దక్కించుకోవాలని లేదు. ఎందుకంటే డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ హవా పెరిగిన తర్వాత, నెల రోజులు తిరక్కుండానే కొత్త కొత్త సినిమాలు మన మొబైల్ లోకి వచ్చేస్తున్నాయి. అందుకే ఈ మధ్య కాలంలో ఎంత పెద్ద సినిమాకైనా స్మాల్ స్క్రీన్ మీద పెద్దగా ఆదరణ దక్కడం లేదు. ఇప్పుడు నాని సినిమాలకు అందుకే తక్కువ టీఆర్పీ వచ్చిందని భావించవచ్చు. ఆల్రెడీ వాటిని ఓటీటీలలో చూసేసారు కాబట్టే, టీవీలలో ఎక్కువ రేటింగ్ రాలేదని అనుకోవచ్చనే కామెంట్లు వినిపిస్తున్నాయి.


ఇకపోతే నాని ప్రస్తుతం వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో 'సరిపోదా శనివారం' అనే సినిమాలో నటిస్తున్నారు. దీని తర్వాత సుజిత్ దర్శకత్వంలో తన 32వ చిత్రం చేయనున్నారు. ఇదే క్రమంలో Nani33 కోసం 'దసరా' దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో మరోసారి జత కట్టనున్నారు.


Also Read: టాలీవుడ్ 2024: చిన్న హీరోలకు పెద్ద హిట్లు, పెద్ద హీరోలకు పాట్లు!