హీరో విష్ణు మంచు (Manchu Vishnu) కు గాయాలు అయ్యాయి. ప్రతి పనిలో 100 శాతం బెస్ట్ ఇవ్వాలని ఆయన కష్టపడతారు. అందువల్ల, ఇప్పుడు ఈ గాయం అయ్యింది. ఈ గాయానికి కారణం ప్రేమ్ రక్షిత్ అని విష్ణు తెలిపారు. అసలు, ఏమైంది? గాయానికి కారణం ఏంటి? అనే వివరాల్లోకి వెళితే...


సాంగ్ షూటింగ్‌లో గాయాలు...
ప్రస్తుతం విష్ణు మంచు కథానాయకుడిగా నటిస్తున్న సినిమా 'జిన్నా' (Ginna Movie). దీంతో పాన్ ఇండియా మార్కెట్ మీద ఆయన కన్నేశారు. అందుకని, ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కావడం లేదు. ఫైట్లు, పాటల మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. ముఖ్యంగా ఒక్కో పాటను ఒక్కో స్టార్ కొరియోగ్రాఫర్ చేత స్టెప్పులు కంపోజ్ చేయిస్తున్నారు. 'జిన్నా'లో ప్రభుదేవా ఒక సాంగ్ చేశారు. గణేష్ ఆచార్య మరో సాంగ్ చేశారు. ప్రేమ్ రక్షిత్ కూడా సాంగ్స్ చేస్తున్నారు. ఆయన నేతృత్వంలో పాట చేస్తున్నప్పుడు విష్ణుకు గాయం అయ్యింది.
 
''థాంక్యూ ప్రేమ్ రక్షిత్! డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఈ విధంగా గాయం అవుతుందని ఎప్పుడూ ఊహించలేదు. నా గాయాలకు కారణం నేనే అవుతానని అనుకోలేదు'' అని విష్ణు మంచు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అదీ సంగతి!


'జిన్నా'తో కుమార్తెలను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్న విష్ణు
'జిన్నా' సినిమాలో ఒక పాటను విష్ణు కుమార్తెలు, కవలలు అరియానా - వివియానా ఆలపించారు. ఆ సాంగ్ కొన్ని రోజుల క్రితం విడుదలైంది. అప్పుడు ''ఒక నటుడి ప్రయాణం కనిపించినంత  గ్లామర్‌గా ఉండదు. ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. అనుక్షణం నలువైపుల నుంచి వచ్చే అభిప్రాయాలతో డీల్ చేయాల్సి ఉంటుంది.  అయితే, నటుడిగా నేనుపొందే  పొందే ప్రేమాభిమానాల ముందు సవాళ్లతో కూడిన ప్రయాణం కష్టం అనిపించదు. ప్రతి తెలుగువాడు నా కుటుంబ సభ్యుడు. అందుకే, ఒక తండ్రిగా, నటుడిగా నా కుమార్తెలను గాయనీమణులుగా, నటీమణులుగా వాళ్ళ ముందుకు తీసుకొస్తున్నాను'' అని విష్ణు మంచు భావోద్వేగభరిత లేఖ రాశారు.


ఇద్దరు హీరోయిన్లతో...
'జిన్నా'లో స్వాతి పాత్రలో పాయల్ రాజ్‌పుత్‌ (Payal Rajput), రేణుకగా సన్నీ లియోన్ (Sunny Leone) నటిస్తున్న సంగతి తెలిసిందే. వాళ్ళిద్దరితో విష్ణు మంచు ఒక పాట చేశారు. అక్టోబర్ 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Also Read : పవన్ కళ్యాణ్ బర్త్ డే స్పెషల్... రీమేక్‌లందు పవన్ రీమేక్స్ వేరయా - పవర్ స్టార్‌ది సపరేట్ మేనియా


కలెక్షన్ కింగ్ డా. మంచు మోహన్ బాబు ఆశీస్సులతో అవ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఈ సినిమా తెరకెక్కుతోంది. దర్శకుడు జి. నాగేశ్వర రెడ్డి మూల కథ అందించగా... కోన వెంకట్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. క్రియేటివ్ ప్రొడ్యూసర్ కూడా ఆయనే. ఈషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. చోటా కె. నాయుడు ఛాయాగ్రహణం అందిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. 'వెన్నెల' కిశోర్, 'చమ్మక్' చంద్ర, రఘుబాబు తదితరులు నటిస్తున్నారు. 


Also Read : పవన్ కళ్యాణ్ బర్త్ డే స్పెషల్... 'బాహుబలి 2'లో ఆ సీన్ వెనుక ఉన్నది పవన్ కళ్యాణే