Actor Chinna About Mahesh Babu: సూపర్ స్టార్ మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా ‘మురారి’ సినిమా మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది. దాదాపు 22 ఏళ్లు పూర్తయిన తర్వాత ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుండడంతో దీని షూటింగ్ జ్ఞాపకాలను గుర్తుచేసుకుంది మూవీ టీమ్. దాదాపు ‘మురారి’లో భాగమయిన ప్రతీ టెక్నీషియన్, నటుడు.. తమ అనుభవాలను గుర్తుచేసుకున్నారు. అందులో యాక్టర్ చిన్న కూడా ఒకరు.


కృష్ణ ఫ్యామిలీతో క్లోజ్..


‘‘మురారి కోసం దాదాపు 50 రోజులు కాకినాడలోని రామచంద్రాపురంలో ఉన్నాం. నాకు బాగా ఇష్టమైన దర్శకుల్లో ముందు రామ్ గోపాల్ వర్మ ఉంటే ఆ తర్వాత కృష్ణవంశీనే. వీళ్లిద్దరి దగ్గర నటన తెలిసిన ఆర్టిస్టులు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. మురారిలో పెద్దపెద్ద ఆర్టిస్టులతో కలిసి పనిచేయడం ఒక మంచి ఎక్స్‌పీరియన్స్. ఒకరోజు కృష్ణాష్టమి సీన్ జరుగుతోంది. కృష్ణుడి పాదాలు వేయడానికి టీమ్ అంతా కష్టపడుతుంది. నాకు పాదాలు వేయడం బాగా తెలుసు. ఎలా వేయాలో చూపించాను అంతే ఇరుక్కుపోయాను. అన్ని పాదాలు వేసేసరికి మోకాళ్ల నొప్పులు వచ్చేశాయి. మహేశ్ బాబుతో నేను 2 రోజులకే క్లోజ్ అయ్యాను. తనవి వాళ్ల నాన్న పోలికలు’’ అని గుర్తుచేసుకున్నారు చిన్నా. కృష్ణ ఫ్యామిలీతో ప్రతీ ఒక్కరితో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని, అందరితో కలిసి వర్క్ చేశానని తెలిపారు.


కలిసి భోజనం చేశాం..


మరొక సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ.. ‘‘నాకు షూటింగ్ ఉన్నా ఇంటి నుండే భోజనం వస్తుంది. మురారి షూటింగ్ సమయంలో ఇంటి భోజనం లేదు కాబట్టి ఉన్నదాంట్లో సర్దుకుపోదాం అనుకున్నాను. అప్పుడు మహేశ్ బాబుకు ప్రత్యేకంగా నిర్మాత వాళ్ల చెల్లి ఇంట్లో నుండి భోజనం వస్తుందని నాకు తెలిసింది. నేను ఆయన దగ్గరకు వెళ్లి నాకు ఇంటి భోజనం తినడం అలవాటు, మొహమాటం, సిగ్గు లేకుండా అడుగుతున్నాను. మధ్యాహ్నం మీతో పాటు తింటాను అని అడిగాను. వారం రోజులు నేను, శివాజీ రాజా.. మహేశ్ బాబుతో కలిసి భోజనం చేశాం. తర్వాత ఆయనకు లంచ్ చేయడానికి సమయం పడుతుందని ఆయకు చెప్పి మేము వెళ్లి తినేవాళ్లం. కొన్నిరోజుల తర్వాత చెప్పకుండా వెళ్లి తినేసి, తిన్నాక చెప్పేవాళ్లం. అంత చనువు ఏర్పడింది’’ అని తెలిపారు చిన్నా.


నేచురల్‌గా వచ్చింది..


‘‘మురారి తర్వాత మహేశ్ బాబును కలిసింది తక్కువే. నాపై ఎప్పుడూ జోకులు వేస్తుండేవాడు. కృష్ణవంశీ, నేను అన్నదమ్ముల్లాగా ఉండేవాళ్లం. తను అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పటి నుండి నాకు తెలుసు. మురారిలో నాకు, మహేశ్ బాబుకు ప్రత్యేకంగా ఒక 5 నిమిషాల సీన్ ఉంటుంది. కృష్ణవంశీ నా దగ్గరకు వచ్చి ఆ సీన్‌కు సీన్ పేపర్ ఏం లేదు. మహేశ్ బాబు ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. నువ్వు సమాధానాలు ఇవ్వాలి అన్నాడు. అలాగే చేశాం. సీన్ బాగా హిట్ అయ్యింది, నేచురల్‌గా వచ్చింది. అప్పట్లో మురారి సినిమా విడుదలయిన మొదటిరోజు మహేశ్ బాబు, కృష్ణతో కలిసి ఈ సినిమా చూశాను. 22 ఏళ్ల తర్వాత కూడా అక్కడే చూస్తానని ఆశిస్తున్నాను’’ అంటూ ‘మురారి’ గురించి ప్రేక్షకులతో పంచుకున్నారు చిన్నా.



Also Read: మోహన్ బాబు నన్ను పిలిచి ఆ క్యారెక్టర్ చేయొద్దన్నారు, బాధగా అనిపించింది - సీరియల్ నటుడు కౌశిక్ కృష్ణ