Abbas: సినీ హీరో అబ్బాస్ గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. ‘ప్రేమదేశం’ అబ్బాస్ అంటే ఇప్పటితరం కూడా గుర్తుపడతారు. ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరో అయిపోయాడు. తమిళ్ తెలుగులో మంచి క్రేజ్ సంపాదించాడు. తర్వాత వరుసగా అవకాశాలు వెల్లువెత్తాయి. ఓ వైపు హీరోగా చేస్తూనే మరోవైపు స్టార్ హీరోల సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ ఫుల్ బిజీ అయిపోయాడు. అప్పట్లో అబ్బాస్ కు అమ్మాయిల కలల రాజకుమారుడిగా పేరు ఉండేది. అంతేకాదు అబ్బాస్ కటింగ్ కు కూడా విపరీతమైన క్రేజ్ ఉండేది. యూత్ లో అంత క్రేజ్ సంపాదించుకున్న అబ్బాస్ కొన్నాళ్ల తర్వాత సినిమాల నుంచి దూరం అయ్యాడు. కుటుంబాన్ని పోషించుకోవడానికి మెకానిక్, డ్రైవర్ గా మారాడు. అతను ఎక్కడ ఉంటున్నాడు ఏం చేస్తున్నాడు అనేది చాలా రోజులు ఎవరికీ తెలియలేదు. ఇటీవలే ఇండియా వచ్చిన అబ్బాస్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన గతాన్ని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు అబ్బాస్ వ్యాఖ్యలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.  


అప్పుడే చనిపోవాలనుకున్నా: అబ్బాస్


చాలా రోజుల తర్వాత మీడియాతో మాట్లాడాడు అబ్బాస్. ఈ సందర్భంగా తన జీవిత విశేషాలను చెప్పుకొచ్చాడు. తనని తాను ప్రైవేట్ పర్సన్ గా చెప్పుకున్నాడు అబ్బాస్. ఎప్పుడూ సోషల్ మీడియాకు దూరంగా ఉంటానని, కానీ కోవిడ్ సమయంలో తన అభిమానులతో జూమ్ ద్వారా మాట్లాడానని అన్నాడు. ఆ సమయంలో సూసైడ్ చేసుకోవాలని అని అనుకునే వారికి మోటివేషన్ ఇచ్చే ప్రయత్నం చేశానని అన్నాడు. తాను కూడా పదో తరగతి ఫెయిల్ అయినపుడు ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని, అదే సమయంలో ఒక అమ్మాయి తనను మోసం చేయడంతో ఆ ఆలోచన మరింత బలపడిందని అన్నారు. తనకు ఆత్మహత్య చేసుకోవాలని అనిపించినపుడు ఓ రోజు రోడ్ మీద వెళ్తూ ఎదురుగా వస్తున్న లారి కిందపడదామని ప్రయత్నించానని చెప్పాడు అబ్బాస్. అయితే ఒక అడుగు ముందుకు వేయగానే ఆ లారీ వెనుక నుంచి ఓ వ్యక్తి బైక్ మీద వస్తున్నట్టు కనిపించాడు. తాను ఆ లారీ కింద పడితే ఆ బైక్ వచ్చి లారీను ఢీ కొడుతుంది. తన వల్ల ఇతరుల జీవితం ప్రభావం చూపుతుంది. అప్పుడే ఇతరుల శ్రేయస్సు కోరుకేనే మనస్తత్వాన్ని అవలరుచుకున్నానని చెప్పాడు. 


కుటుంబ పోషణ కోసం మెకానిక్ గా డ్రైవర్ గా చేశా: అబ్బాస్


తాను అనుకోకుండా నటుడ్ని అయ్యానని అన్నాడు అబ్బాస్. అయితే ‘ప్రేమదేశం’ సినిమా చేసినపుడు మొదటి రోజు సాధారణ ప్రేక్షకుడిలా వెళ్లి సినిమాలు చూశానని, కానీ తర్వాత రోజు నుంచి తన ఇంటి ముందు వేలాది మంది అభిమానులు రావడం చూసి ఆశ్చర్యపోయానన్నాడు. తనకి 19 ఏళ్ల వయసు ఉన్నపుడు డబ్బులు కోసం సినిమాలు చేశానని, అయితే కెరీర్ లో హిట్లతో పాటు ఫ్లాప్‌లు కూడా చూశానని అన్నాడు. క్రమేపీ కనీస అవసరాలకు కూడా డబ్బులు లేని పరిస్థితికి వచ్చానని చెప్పాడు. అవకాశాల కోసం చాలా మంది దగ్గరకు వెళ్లానని, కానీ చివరకు తను చేసే పని మీద ఇంట్రస్ట్ పోయిందని, అందుకే మెల్లగా సినిమాలకు దూరం అయ్యాయని చెప్పాడు. తర్వాత దేశం వదిలేసి ఫ్యామిలీతో న్యూజిలాండ్ వెళ్లిపోయానని, కుటుంబ పోషణ కోసం అక్కడ మెకానిక్ గా, డ్రైవర్ గా కూడా చేశానని తన జీవితంలో ఒడిదుడుకుల గురించి చెప్పుకొచ్చాడు అబ్బాస్. ఈ మధ్యనే ఇండియాకు తిరిగి వచ్చానని వెల్లడించాడు.


Also Read: 'జైలర్' స్టోరీ లీక్ - రజినీకాంత్‌కు ఈసారి హిట్ పక్కా!


Join Us on Telegram: https://t.me/abpdesamofficial