Accident At Devara Shooting Location: కొరటాల శివ, ఎన్‌టీఆర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘దేవర’. ప్రస్తుతం ఈ మూవీ అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఈ షూటింగ్ చేస్తున్న సమయంలో అనుకోకుండా జరిగిన ప్రమాదం వల్ల స్పాట్‌లో ఉన్న 20 మందికి పైగా జూనియర్ ఆర్టిస్టులు ఆసుసత్రిపాలయ్యారు. ఆ సమయంలో ‘దేవర’ షూటింగ్‌లో ఉన్న జూనియర్ ఆర్టిస్టులపై తేనెటీగలు దాడి చేసినట్లుగా చెప్తున్నారు. తేనెటీగల దాడి వల్ల వారికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తోంది. ఇంకా ఈ ఘటనపై ‘దేవర’ మేకర్స్ ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు.


ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు..


‘దేవర’ మూవీ షూటింగ్ స్పాట్‌లో ఉన్న ఒక తేనె తుట్ట కదలడంతో తేనెటీగలు దాడి జరిగినట్టు సమాచారం. ఆ సమయంలో అక్కడే ఉన్న జూనియర్ ఆర్టిస్టులపై తేనెటీగలు దాడి చేయడంతో వారిని దగ్గర్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మామూలుగా మూవీ షూటింగ్ స్పాట్‌లో ఎవరూ సెల్ ఫోన్లతో ఫోటోలు, వీడియోలు తీయకుండా జాగ్రత్త పడుతున్నారు మేకర్స్. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాల షూటింగ్ స్పాట్‌లో ఇలాంటి జాగ్రత్తలు మరింత ఎక్కువగా తీసుకుంటున్నారు. అందుకే ‘దేవర’ షూటింగ్ స్పాట్‌లో జూనియర్ ఆర్టిస్టులపై తేనెటీగల దాడి జరిగిన సమయంలో కూడా ఎవరూ ఫోటోలు, వీడియోలు తీయలేదని తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఆ సమయంలో ఎన్టీఆర్ అక్కడ ఉన్నారా లేదా అనే సమాచారం తెలియరాలేదు.


రెండేళ్లు అయిపోయింది..


కొరటాల శివ, ఎన్‌టీఆర్ కాంబినేషన్‌లో ఇప్పటికే ‘జనతా గ్యారేజ్’ లాంటి సూపర్ హిట్ సినిమా ఉంది. ఇలాంటి హిట్ కాంబినేషన్ మరోసారి కలుస్తున్నందుకు ‘దేవర’పై అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే ఈ సమ్మర్‌లోనే ‘దేవర’.. ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ షూటింగ్ లేట్ అవ్వడంతో ఏకంగా ఆరు నెలల పాటు దీని విడుదల వాయిదా పడింది. దీంతో ఎన్‌టీఆర్ ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. ఎన్‌టీఆర్ చివరిగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ విడుదలయ్యి రెండేళ్లు అయిపోయింది. అప్పటినుండి ఈ హీరోను స్క్రీన్ పై చూడలేదు అభిమానులు.


శరవేగంగా షూటింగ్..


ఇప్పటికైనా అనౌన్స్ చేసిన తేదీకి ‘దేవర’ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ అనుకుంటున్నారు. అందుకే షూటింగ్ విషయంలో స్పీడ్ పెంచారు. ఇటీవల గోవాలో ఈ మూవీకి సంబంధించిన ఒక షెడ్యూల్ పూర్తయ్యింది. ఇక టాకీ పార్ట్ పూర్తవ్వడానికి కూడా ఎక్కువ సమయం పట్టదని మేకర్స్ అప్డేట్‌ను అందించారు. ఇక ‘దేవర’తో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనుంది అతిలోక సుందరి వారసురాలు జాన్వీ కపూర్. ఇప్పటికే తంగం అనే పాత్రలో జాన్వీ కపూర్ నటిస్తున్నట్టుగా ఒకట్రెండు పోస్టర్లను విడుదల చేసింది మూవీ టీమ్. ‘దేవర’లో ఎన్‌టీఆర్, జాన్వీ కపూర్ కెమిస్ట్రీ ఎలా ఉంటుందో చూడాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.



Also Read: షర్మిల కంట్రోల్ తప్పింది - తోడేలు, గుంటనక్కల కథ చెప్పిన యాంకర్ శ్యామలా.. ఆమె టార్గెట్ వారేనా?