Summer Effect On Tollywood: ప్రస్తుతం ఎవరి నోట విన్నా ఒకటే మాట.. ఏంట్రా బాబు ఎండలు ఇలా ఉన్నాయి.. అని. మునుపెన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో సాయంత్రం అయినా కూడా ఇళ్లలో నుండి బయటికి రావడానికి ఎవరూ పెద్దగా ఇష్టపడడం లేదు. ఈ ఎండ ఎఫెక్ట్.. టాలీవుడ్ బాక్సాఫీస్‌పై కూడా విపరీతంగా కనిపిస్తోంది. ఈ ఎండలను పట్టించుకోకుండా థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడాలి అనుకునేవారి సంఖ్య చాలా తగ్గిపోయింది. ఏప్రిల్ నుండే ఎండలు ఓ రేంజ్‌లో ఉన్నా కరెక్ట్‌గా మే ప్రారంభమయ్యే సమయానికి ఇవి ప్రేక్షకులపై ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. అందుకే మే మొదటి వారం టాలీవుడ్ బాక్సాఫీస్ చాలా డల్‌గా స్టార్ట్ అయ్యింది. సినిమాలకు మంచి టాక్ వస్తున్నా.. ఎవరూ ఎండల్లో థియేటర్‌కు వెళ్లి చూసేందుకు సిద్ధంగా లేరు. పోనీ, సాయంత్రం వెళ్లాలంటే.. ఐపీఎల్ మ్యాచ్‌లు ఉంటున్నాయి. ఈ ప్రభావం బాక్సాఫీస్ వసూళ్లపై తీవ్రంగా కనిపిస్తోంది.
అదే లాస్ట్..
ఎండలు మాత్రమే కాదు.. ఏపీలో ఎన్నికలు కూడా సినిమాలపై ప్రభావం చూపిస్తున్నాయి. ఐపీఎల్ ఫీవర్, ఎండలు, ఏపీ ఎన్నికలు.. ఇలా అన్నీ ఒకేసారి వచ్చేసరికి సినిమాల్లో కంటెంట్ బాగున్నా కూడా కలెక్షన్స్ విషయంలో మాత్రం హిట్స్‌ను అందుకోలేకపోతున్నాయి. మేలో చాలా సినిమాలు విడుదల అవుతున్నట్టుగానే మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు. అందుకే ముందుగా అనుకున్న విడుదల తేదీలను వాయిదా వేయడం ఇష్టం లేక మే మొదటి వారంలో.. అంటే మే 3న పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పోటీకి దిగాయి. కానీ అందులో ఒక్కటి కూడా గుర్తుండిపోయే హిట్‌ను సాధించలేదు. సిద్ధు జొన్నల్లగడ్డ, అనుపమ పరమేశ్వరన్ కాంబినేషన్‌లో వచ్చిన ‘టిల్లు స్క్వేర్’ తర్వాత ఏ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద ఆ రేంజ్‌లో సక్సెస్ సాధించలేదు.
ఓవైపు ఎండ.. మరోవైపు ఐపీఎల్..
మే 3న నాలుగు సినిమాలు బాక్సాఫీస్ బరిలో దిగాయి. అవే ‘ప్రసన్నవదనం’, ‘ఆ ఒక్కటీ అడక్కు’, ‘శబరి’, ‘బాక్’. థియేటర్లకు వెళ్లి ఈ సినిమాలు చేసినవారు వీటికి దాదాపుగా పాజిటివ్ రివ్యూలనే అందిస్తున్నారు. కానీ ఓవైపు ఎండ, మరోవైపు ఐపీఎల్ ఫీవర్ వల్ల ఈ చిత్రాలను యావరేజ్ హిట్లు కూడా అందుకోలేకపోతున్నాయి. రోజంతా ఎండ ఎఫెక్ట్ వల్ల ప్రేక్షకులు బయటికి రావడానికి ఇష్టపడడం లేదు. ఫస్ట్ షో, సెకండ్ షోలకు వెళ్దామన్నా కూడా అప్పటికే ఐపీఎల్ ప్రారంభమవుతోంది. దీంతో మే నెల మొత్తం సినిమాలపై గట్టి ఎఫెక్ట్ పడనుంది అని ఇండస్ట్రీ నిపుణులు చెప్తున్నారు. ప్రేక్షకులు కూడా మరో స్టార్ హీరో మూవీ రిలీజ్ అయ్యేవరకు మళ్లీ థియేటర్లకు రారేమో అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అన్నింటిపై ఎఫెక్ట్..
అల్లరి నరేశ్ ఎప్పటిలాగానే ‘ఆ ఒక్కటీ అడక్కు’ లాంటి కామెడీ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి వచ్చేశాడు. మొదటి రోజుతో పోలిస్తే సెకండ్ డే ఈ మూవీ బాక్సాఫీస్ కలెక్షన్స్ కాస్త పరవాలేదు అనిపించాయి. ఫేస్ బ్లైండ్‌నెస్ లాంటి కొత్త కాన్సెప్ట్‌తో ‘ప్రసన్నవదనం’ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సుహాస్. మామూలుగా కొత్త కాన్సెప్ట్స్‌ను ఇష్టపడే ప్రేక్షకులు.. ఈ సినిమాను ఇష్టంగా చూసేవారు కానీ అలా జరగడం లేదు. వరలక్ష్మి శరత్‌కుమార్ లీడ్ రోల్‌లో నటించిన ‘శబరి’కి ఎన్ని ప్రమోషన్స్ చేసినా ఎక్కువమంది ప్రేక్షకులకు రీచ్ అవ్వలేకపోయింది. తెలుగు సినిమాలే బాక్సాఫీస్ వద్ద కష్టపడుతుండగా.. ‘బాక్’ లాంటి డబ్బింగ్ చిత్రం కూడా విడుదలయ్యి నష్టాలను చవిచూస్తోంది.
Also Read: సమర్థించుకోవద్దు, నిరూపించుకోవద్దు - డిలీట్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీపై సమంత స్పందన