Vivek Agnohotri About Heermandi: బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన వెబ్ సిరీస్ ‘హీరామండి: ది డైమండ్ బజార్’.. ప్రస్తుతం బాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది. స్టార్ క్యాస్టింగ్‌తో, రిచ్ విజువల్స్‌తో హీరామండి అనే ఒక రెడ్ లైట్ ఏరియాను చాలా అందంగా చూపించాడు సంజయ్ లీలా భన్సాలీ. ఆయన ఫ్యాన్స్ మాత్రం ఎక్కువ ఆలోచించకుండా సిరీస్ బాగుందంటూ ప్రశంసిస్తున్నారు. కానీ కొందరు క్రిటిక్స్ మాత్రం ‘హీరామండి’లోని తప్పులను బయటపెడుతున్నారు. అదే క్రమంలో ‘కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి కూడా ఈ సిరీస్‌పై నెగిటివ్ కామెంట్స్ చేశారు.


అవన్నీ అనవసరం..


1940ల్లో స్వాతంత్ర్యం సమయంలో ‘హీరామండి’ అనే రెడ్ లైట్ ఏరియాలో ఉన్న పరిస్థితిలపై తెరకెక్కిన వెబ్ సిరీసే ‘హీరామండి’. అయితే నిజమైన సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ సిరీస్‌లో అసలు రియాలిటీ లేదంటూ ఒక నెటిజన్ విమర్శించారు. ‘‘ఇప్పుడే హీరామండి చూశాను. ఇందులో అన్నీ ఉన్నాయి హీరామండి తప్పా. మీరు 1940 లాహోర్‌లో ఈ సిరీస్‌ను సెట్ చేయకుండా ఉండాల్సింది. అలా సెట్ చేసినప్పుడు అందులో ఆగ్రాలోని ప్రదేశాలు, ఢిల్లీలో మాట్లాడే ఉర్దూ, లఖ్నవికి చెందిన బట్టలు, 1840 వైబ్ అంతా ఎందుకు ఉన్నాయి? నేను లాహోర్‌కు చెందిన వ్యక్తిగా దీనిని ఒప్పుకోలేకపోతున్నాను’’ అని తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు. దీనిపై ‘కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి స్పందించారు.


బాధాకరం..


‘‘ఆమె చేసిన విమర్శలో అర్థముంది. నేను ఈ వెబ్ సిరీస్ చూడలేదు. కానీ లాహోర్‌లోని హీరామండికి మాత్రం పలుమార్లు వెళ్లాను. వేశ్యలను, వేశ్యగృహాలను అందంగా మార్చి చూపించే అలవాటు బాలీవుడ్‌కు ఎప్పటినుండో ఉంది. అలా చేయడం బాధాకరం. ఎందుకంటే వ్యభిచార గృహాలు అనేవి ఎప్పుడూ అందానికి, ఐశ్వర్యానికి నిదర్శనంగా నిలవలేదు. ఇవి మనుషులపై జరుగుతున్న అన్యాయాలకు, వారు భరించే బాధలకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఎవరికైతే వీటి గురించి పూర్తిగా తెలుసుకోవాలని ఉందో వారు శ్యామ్ బెనెగల్ తెరకెక్కించిన మండీని చూడాలి’’ అంటూ ఆ నెటిజన్ చేసిన కామెంట్‌ను సమర్ధించారు వివేక్.






అలా చేయడం కరెక్టా?


‘‘ఇంకొక ప్రశ్న కూడా కచ్చితంగా అడగాలి. మనుషులు పడే ఆవేదనను అందంగే చూపించే స్వేచ్ఛను క్రియేటివిటీ మనకు ఇచ్చిందా? మురికివాడలోని జీవితాలను అందంగా చూపిస్తూ సినిమాలు చేయడం కరెక్టా? అక్కడ జీవించేవారు అంబానీ పెళ్లికి వెళ్తున్నట్టుగా బట్టలు వేసుకుంటున్నట్టు చూపించడం ఓకేనా? ఇది కచ్చితంగా చర్చించాల్సిందే’’ అంటూ ‘హీరామండి’ మేకర్స్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు వివేక్ అగ్నిహోత్రి. ఏ సినిమాను అయినా, ఏ కథను అయినా రిచ్‌గా చూపించడంలో సంజయ్ లీలా భన్సాలీ దిట్ట. అలా అని ఒక వేశ్యగృహాన్ని అలా చూపించడం కరెక్ట్ కాదంటూ వివేక్ అగ్నిహోత్రి వ్యాఖ్యలను సపోర్ట్ చేస్తున్నారు కొందరు నెటిజన్లు.



Also Read: ‘రోబో‘ ఫస్ట్ ఛాయిస్ రజనీకాంత్, ఐశ్వర్య రాయ్ కాదా? శంకర్ తన నిర్ణయాన్ని ఎందుకు మార్చుకున్నారు?