Getup Srinu About AP Politics: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్ హీట్ అనేది ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీ వరకు వచ్చేసింది. ఈసారి జరిగే ఎన్నికల్లో ఎలాగైనా తాను గెలవాలని బలంగా కోరుకుంటున్నారు పవన్ కళ్యాణ్. ఇక పవన్ కళ్యాణ్‌కు సినీ పరిశ్రమలోనే చాలామంది అభిమానులు ఉండడంతో వారంతా స్వచ్ఛందంగా ఆయన పొలిటికల్ ప్రచారంలో భాగమవుతున్నారు. అందులో మెగా ఫ్యామిలీతో పాటు చాలామంది ‘జబర్దస్త్’ ఆర్టిస్టులు కూడా ఉంటున్నారు. ఇలాంటి సమయంలోనే గెటప్ శ్రీను నటించిన ‘రాజు యాదవ్’ విడుదలకు సిద్ధమయ్యింది. ఈ మూవీ ప్రెస్ మీట్‌లో కూడా తనకు రాజకీయాలకు సంబంధించిన ప్రశ్నలే ఎదురవుతున్నాయి.


అదే సమాధానం..


మే 17న విడుదల కానున్న ‘రాజు యాదవ్’ ప్రమోషన్స్ కోసం మూవీ టీమ్ ఒక ప్రెస్ మీట్‌ను ఏర్పాటు చేసింది. అందులో తాను ఎంత మౌనంగా ఉండాలని చూసినా ఏపీ పాలిటిక్స్‌కు సంబంధించిన ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి. మెగా ఫ్యామిలీ, ‘జబర్దస్త్’ ఆర్టిస్టులు.. పవన్ కళ్యాణ్ తరపున ప్రచారానికి వెళ్తున్నారు కాబట్టి ఒకవేళ ఏపీలో మళ్లీ వైసీపీ పాలన వస్తే అందరికీ ఇబ్బందులు ఎదురవుతాయేమో అన్నట్టుగా గెటప్ శ్రీనుకు ప్రశ్న ఎదురయ్యింది. దీంతో ఆ ప్రశ్నకు సమాధానంగా.. ‘‘యాంకర్ శ్యామల ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో మీరు వైసీపీకి సపోర్ట్ చేయకపోవడం వల్ల మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఆడియో ఫంక్షన్స్‌ను మీకు ఇవ్వకపోవచ్చేమో అని ఆమెను అడిగారు. ఆమె అక్కడ చెప్పిన సమాధానమే ఇక్కడ కూడా వర్తిస్తుంది’’ అని మాట దాటేశాడు గెటప్ శ్రీను.


అది వేరు.. ఇది వేరు..


అలా కాకుండా తాము అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పమని గెటప్ శ్రీనుపై ఒత్తిడి తీసుకొచ్చారు. యూట్యూబ్‌లో ఆ ఇంటర్వ్యూ ఉంటుంది అని చెప్పినా వినకుండా తన సమాధానం ఏంటో చెప్పమన్నారు. దీంతో ఒక ఉదాహరణతో అందరికీ అర్థమయ్యేలా పరిస్థితిని వివరించాడు శ్రీను. ‘‘ఒక పార్టీని సపోర్ట్ చేశాడు కాబట్టి వీడిని ఆపేద్దాం, తొక్కేద్దాం అనుకోవడం పరిణితి చెందిన ఆలోచన కాదని నా అభిప్రాయం. ఒక ఊరు ఉంది. అందులో ఒక ఆటో డ్రైవర్ ఉంటాడు. కిరాణా షాప్ ఓనర్ ఉంటాడు. ఒక ఎరువుల కొట్టు ఉంటుంది. వీరంతా వృత్తిపరంగా వేర్వేరు వృత్తులు చేస్తుంటారు. కానీ వారంతా ఏదో ఒక పార్టీపై, రాజకీయ నాయకుడిపై అభిమానంతో సపోర్ట్ చేస్తుంటారు. అది వాళ్ల ఊళ్లో తెలిసిపోతుంది. అలా అని ఆటో డ్రైవర్ వెళ్లి కిరాణా షాప్‌లో కొనుక్కోక మానడు. కిరాణా షాప్ అన్న వచ్చి ఆటో ఎక్కకా మానడు’’ అని వివరించాడు గెటప్ శ్రీను.


అది బాగా నమ్ముతున్నాను..


‘‘మన సినిమా మంచిదయితే ప్రేక్షకులగానే థియేటర్లకు వెళ్లి చూస్తారు కానీ ఒక రాజకీయ పార్టీ సపోర్టర్‌గా ఎవరూ వెళ్లరు. తెలుగు ప్రేక్షకుల విషయంలో అది నేను బాగా నమ్ముతున్నాను’’ అంటూ రాజకీయాలకు, సినిమాలకు సంబంధం లేదని తన అభిప్రాయాన్ని బయటపెట్టాడు గెటప్ శ్రీను. ఇక శ్యామల వైసీపీకి సపోర్ట్ చేస్తున్నా కూడా తను ఒక పొలిటికల్ ఇంటర్వ్యూలో చెప్పిన వ్యాఖ్యలు కరెక్ట్ అని నమ్మి.. అందరి ముందు అదే విషయాన్ని ఒప్పుకున్నాడు గెటప్ శ్రీను.



Also Read: షర్మిల కంట్రోల్ తప్పింది - తోడేలు, గుంటనక్కల కథ చెప్పిన యాంకర్ శ్యామలా.. ఆమె టార్గెట్ వారేనా?