ప్రముఖ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ (AB De Villiers) భారతీయులకు తెలుసు. సౌత్ ఆఫ్రికా క్రికెటర్ అయినప్పటికీ... ఐపీఎల్ ద్వారా ఇక్కడి జనాలకు దగ్గర అయ్యారు. ఓ తెలుగు సినిమా టీజర్ బావుందని ఆయన వీడియో విడుదల చేశారు. అందులో హీరో నీరోజ్ పుచ్చాకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. పూర్తి వివరాల్లోకి వెళితే...
గల్వాన్ ప్రతిఘటన నేపథ్యంలో 'భారతీయాన్స్'
'ప్రేమించుకుందాం రా', 'కలిసుందాం రా', 'లాహిరి లాహిరి లాహిరిలో' తదితర విజయవంతమైన చిత్రాలకు రచయితగా పని చేసిన దీన్ రాజ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం 'భారతీయాన్స్' (Bharateeyans Movie). తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కింది. ఇతర భాషల్లో అనువదిస్తున్నారు.
భారత్ - చైనా సరిహద్దుల్లో గల్వాన్ ఘటన ఆధారంగా, భారతీయ సైనికుల వీరోచిత పోరాట పటిమ స్ఫూర్తితో రూపొందిన చిత్రమిది. ఇందులో నీరోజ్ పుచ్చా (Nerroze Putcha), సోనమ్ టెండప్, సుభా రంజన్, మహేందర్ బర్గాస్ కథానాయకులు. ఈ సినిమాలో సమైరా సందు, రాజేశ్వరి చక్రవర్తి, పెడెన్ నాంగ్యాల్ హీరోయిన్లు. భారత్ అమెరికన్ క్రియేషన్స్ పతాకంపై డా. శంకర్ నాయుడు అడుసుమిల్లి నిర్మించారు. ఇటీవల సినిమా టీజర్ విడుదల చేశారు.
'భారతీయాన్స్' టీజర్ చూశానని, నీరోజ్ హీరోగా పరిచయం అవుతున్నందుకు చాలా ఎగ్జైటింగ్ గా ఉందని ఏబీ డివిలియర్స్ పేర్కొన్నారు. నీరోజ్ పుచ్చాకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. హార్డ్ వర్క్ చేయమని సలహా ఇచ్చారు. నీరోజ్ ట్యాలెంటెడ్ యాక్టర్ అని ఏబీ డివిలియర్స్ అన్నారు.
కోట్లాది క్రికెట్ ప్రేమికుల ఆదరాభిమానాలు కలిగిన డివిలియర్స్ తన సినిమా టీజర్ (Bharateeyans Teaser)ను మెచ్చుకోవడం, తనను అభినందించడం పట్ల నీరోజ్ పుచ్చా ఉబ్బితబ్బిబ్బు అవుతున్నారు. జీవితాంతం డివిలియర్స్ (AB De Villiers)ను గుర్తుంచుకుంటానని, ఆయన గర్వపడే స్థాయికి చేరుకోవడానికి కృషి చేస్తానని నీరోజ్ పేర్కొన్నారు. 'భారతీయన్స్'తో తనను కథానాయకుడిగా పరిచయం చేస్తున్న నిర్మాత శంకర్ నాయుడు, దర్శకుడు దీన్ రాజ్ లకు జీవితాంతం రుణపడి ఉంటానని నీరోజ్ తెలిపారు.
Also Read : హిందీలో 'మల్లేశం' దర్శకుడు తీసిన '8 ఎఎం మెట్రో' సినిమా రివ్యూ... మంచి ఫిల్టర్ కాఫీ తాగిన అనుభూతి
కొన్ని రోజుల క్రితం 'భారతీయాన్స్'ను గొప్ప నేత, మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు చూశారు. ప్రీమియర్ షో చూసిన అనంతరం ఆయన మాట్లాడుతూ ''దేశభక్తితో కూడిన చిత్రమిది. భారత దేశ సమైక్యత, భారతీయ సైనికుల వీరగాథ గురించి ఇటువంటి సినిమా తీయడం అభినందనీయం. దర్శక నిర్మాతలు యువతకు చక్కటి సినిమా అందిస్తున్నారు. నాకు అది చాలా సంతోషంగా అనిపించింది. ఈ చిత్రాన్ని యువత, ప్రేక్షకులు తప్పకుండా చూడాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.
త్వరలో విడుదలకు సన్నాహాలు!
తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సినిమాను విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామని నిర్మాత డా. శంకర్ నాయుడు అడుసుమిల్లి తెలిపారు. మంచి విడుదల తేదీ కోసం చూస్తున్నామని, అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు చిత్రాన్ని తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన వివరించారు. సినిమాకు పోరాటాలు : జూడో రాము, కూర్పు : శివ సర్వాణి, ఛాయాగ్రహణం : జయపాల్ రెడ్డి నిమ్మల, సంగీతం : సత్య కశ్యప్ & కపిల్ కుమార్.
Also Read : ఎన్టీఆర్ కాకుండా మరో హీరో అయితే 'టెంపర్' క్లైమాక్స్, 'కొమురం భీముడో' సాంగ్ చేసేవారా?