90ల్లో నటించిన హీరోయిన్లు ఎంతోమంది చాలాకాలం వరకు వెండితెరకు దూరంగా ఉండి.. మళ్లీ సైడ్ క్యారెక్టర్స్‌తో రీ ఎంట్రీకి సిద్ధమవుతున్నారు. అలాంటి హీరోయిన్స్‌లో ఒకరు ఆమని. ఎక్కువగా ఫ్యామిలీ సినిమాల్లో నటిస్తూ ఆడియన్స్‌కు దగ్గరయ్యారు ఆమని. ఇప్పుడు ఎక్కువగా అమ్మ రోల్స్‌లో నటిస్తూ మరోసారి టాలీవుడ్‌లో బిజీ అయ్యారు. తాజాగా ఒక ఇంటర్వ్యూకు అటెండ్ అయిన ఆమని.. దర్శకుడు లోక్‌నాథ్ యాక్సిడెంట్ గురించి, సౌందర్య మరణం గురించి, తనకు వచ్చిన అవార్డులు, ఆ సందర్భంలో మోహన్ బాబు చేత తిన్న తిట్లు.. ఇలా తన సినీ జీవితంలో జరిగిన ఎన్నో అంశాల గురించి బయటపెట్టారు.


మంటల్లో కాలిపోయిన కెమెరామెన్..
ఒకప్పుడు చిరంజీవి లాంటి స్టార్ హీరోలకు సైతం కెమెరామెన్‌గా పనిచేసి తన సత్తా చాటుకొని, టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్నారు లోక్ సింగ్ అలియాస్ లోక్‌నాథ్. అయితే ఒకప్పుడు సినిమాల్లోని పాటలను జూబ్లీ హిల్స్ లాంటి ప్రాంతాల్లో ఉండే రాళ్ల మధ్య రాత్రి సమయాల్లో తెరకెక్కించేవారు. అలా ఆమని హీరోయిన్‌గా నటిస్తున్న ఒక సినిమాకు లోక్‌నాథ్.. కెమెరా వర్క్ చేస్తున్నారు. అప్పుడు ఆ రాళ్ల మీద పెట్రోల్ పోసి ఫైర్ ఎఫెక్ట్ క్రియేట్ చేసేవారు. ఆ ఫైర్ మధ్య ఆమని డ్యాన్స్ చేశారు. టేక్ కూడా ఓకే అయ్యిందని అనుకున్న తర్వాత.. లోక్‌నాథ్ ఫైర్ సరిపోలేదని ఫీల్ అయ్యారు. క్రేన్ దిగి వచ్చి మరీ.. అక్కడ పెట్రోల్ పోసి, ఫైర్‌ను ఎక్కువ చేయాలనుకున్నారు. అదే సమయంలో యాక్సిడెంట్‌కు గురయ్యి చనిపోయారు. ఈ ఘటనను నేరుగా చూసిన ఆమని.. అసలు ఏమైందో తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో బయటపెట్టారు.


మరణం పిలిచినట్టుగా వచ్చారు..
‘‘చలికాలంలో నైట్ షూటింగ్ చేస్తున్నాం. ఇంకొక టేక్ తీసుకుందాం అనేసరికి దుప్పటి కప్పుకొని పక్కకు వెళ్లి కూర్చున్నాను. లోక్‌నాథ్ వచ్చి చెంబులో ఉన్న పెట్రోల్‌ను ఒక రాయిపై పోసే ప్రయత్నం చేశారు. ఆ రాయిపై అప్పటికీ మంట లేదు. కానీ ఎలాగో దానిపై ఒక్కసారిగా మంటలు వచ్చాయి. ఆ సెగ లోక్‌నాథ్‌కు తగలడంతో చేతిలో ఉన్న చెంబు, అందులో ఉన్న పెట్రోల్ ఆయనపై తిరగబడ్డాయి. ఇదంతా నా కళ్ల ముందే జరిగింది. ఒక సెకనులో ఏమైందో అర్థం కాలేదు. 15 రోజులు ఆసుపత్రిలో ఉన్న తర్వాత ఆయన చనిపోయారు. ఫైటర్స్, మరికొందరు ధైర్యవంతులు ఆయనను చూడడానికి వెళ్లారు కానీ నేను చూసే ధైర్యం చేయలేకపోయాను. చూస్తే తట్టుకోలేవు అని నాతో చాలామంది చెప్పారు. అసలైతే ఆ సమయంలో ఆయన క్రేన్ దిగి రావాల్సిన అవసరం లేదు. కానీ మరణమే ఆయనను పిలిచినట్టుగా కిందకి వచ్చారు’’ అంటూ అక్కడ జరిగిన సంఘటనను స్పష్టంగా వివరించారు ఆమని.


అందుకే సౌందర్య అంత్యక్రియలకు వెళ్లలేదు..
లోక్‌నాథ్ మరణాన్ని చూసి డిస్టర్బ్ అయిన తర్వాత సౌందర్య అంత్యక్రియలకు కూడా వెళ్లలేకపోయానని ఆమని బయటపెట్టారు. ‘‘అప్పటికీ సౌందర్యకు పెళ్లయ్యి కేవలం సంవత్సరం మాత్రమే అయ్యింది. పిల్లలు కూడా లేరు. సుఖపడాల్సిన వయసులో కష్టపడింది. సంపాదించింది సుఖంగా ఖర్చుపెట్టాల్సిన వయసులో మరణించింది. దేవుడి దగ్గరకు వెళ్లి ఆ అమ్మాయి బదులుగా నన్ను తీసుకెళ్లి ఉండవచ్చు కదా అని వేడుకునేదాన్ని’’ అని ఆమని.. సౌందర్య మరణాన్ని గుర్తుచేసుకున్నారు. దీంతో పాటు తనకు నటిగా రెండు అవార్డులు వచ్చాయని తెలిపారు. వాటితో పాటు తను నటించిన ‘శుభలగ్నం’, ‘ఆ నలుగురు’ చిత్రాలకు కూడా అవార్డులు వచ్చాయని అన్నారు. ‘ఆ నలుగురు’కు నంది అవార్డ్ వచ్చినప్పుడు తను ఫంక్షన్‌కు వెళ్లలేదని, అలా చేసినందుకు మోహన్ బాబు ఫోన్ చేసి తిట్టారని గుర్తుచేసుకున్నారు ఆమని.


Also Read: హీరోయిన్ మృతికి ఆమె భర్తే కారణమా? మద్యానికి బానిసైన భర్త వేధింపుల వల్లే...


oin Us on Telegram: https://t.me/abpdesamofficial