పవన్ కళ్యాణ్ ఇటీవల వరుస సినిమాలతో అభిమానులను సర్‌ప్రైజ్ చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే 'హరి హర వీరమల్లు' సినిమా చిత్రీకరణ సగానికి పైగా పూర్తయిందనే సమాచారం అందుతోంది. ఒక వైపు ఆ సినిమా షూటింగ్ జరుగుతుండగానే మరోవైపు 'సాహో' సుజిత్ దర్శకత్వంలో ఒక సినిమాను మొదలు పెట్టారు. ఆ మధ్య ఒక షెడ్యూల్‌ చిత్రీకరణ జరిగిందనే వార్తలు వచ్చాయి. ఇటీవలే తమిళ సూపర్‌ హిట్ మూవీ 'వినోదయ సీతమ్‌' రీమేక్‌ ని కూడా పవన్ కళ్యాణ్‌ మొదలు పెట్టారు. సాయి ధరమ్‌ తేజ్ తో కలిసి ఆ సినిమా షూటింగ్ లో ఆయన పాల్గొన్నారు. ఒరిజినల్‌ వర్షన్‌ కి దర్శకత్వం వహించిన సముద్రఖని ఈ రీమేక్ కి దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా పవన్ కళ్యాణ్ మూడు సినిమాలు షూటింగ్ దశలో ఉండగా మరో సినిమా మొదలు పెట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 


హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్‌ కళ్యాణ్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌ లో సినిమా ప్రకటించి చాలా కాలం అయింది. ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే టైటిల్ ను తొలుత ప్రకటించిన యూనిట్‌ సభ్యులు.. ఇటీవలే ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్’గా పేరు మార్చినట్లు అధికారికంగా ప్రకటించారు. పవన్ కళ్యాణ్‌ డేట్ల కోసం హరీష్ శంకర్‌ చాలా నెలలుగా ఎదురు చూస్తున్నారనే విషయం తెల్సిందే. ఎట్టకేలకు పవన్ నుంచి గ్రీన్ సిగ్నల్‌ రావడంతో ప్రీ ప్రొడక్షన్ వర్క్ తో బిజీ అయ్యాడని సమాచారం. ప్రస్తుతం 'ఉస్తాద్‌ భగత్‌సింగ్‌' సినిమా కోసం ఒక భారీ సెట్‌ వేయిస్తున్నారు. ప్రముఖ ఆర్ట్‌ డైరెక్టర్‌, పవన్ కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న ఆనంద్ సాయి ఈ సెట్‌ నిర్మిస్తున్నాడు. డీవోపీ బోస్‌, ఆనంద్ సాయితో కలిసి సినిమా కోసం నిర్మాణం జరుగుతున్న సెట్‌ నిర్మాణాన్ని దర్శకుడు హరీష్ శంకర్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. మెగా అభిమానులతో పాటు తెలుగు సినీ ప్రేక్ష్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా కోసం సెట్‌ నిర్మాణం జరుగుతున్నట్లుగా మైత్రి మూవీ మేకర్స్ వారు అధికారికంగా ప్రకటిస్తూ...  అందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్‌ చేశారు.


మైత్రి మూవీ మేకర్స్‌ బ్యాక్ టు బ్యాక్...


పవన్ కళ్యాణ్‌, హరీష్ శంకర్ కాంబినేషన్ లో గతంలో ‘గబ్బర్‌సింగ్‌’ సినిమా వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఈ హిట్ కాంబో మరో సినిమాకు పదేళ్ల సమయం పట్టింది. ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్’ ఒక తమిళ సూపర్‌ హిట్‌ మూవీకి రీమేక్ అనే ప్రచారం జరుగుతోంది. ఆ విషయమై మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు కానీ దర్శకుడు హరీష్ శంకర్ కానీ క్లారిటీ ఇవ్వలేదు. రీమేక్ విషయమై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌ లో ఈమధ్య కాలంలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’, ‘వీర సింహారెడ్డి’ సినిమాలు బాక్సాఫీసు వద్ద భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. ఈ బ్యానర్ లో ప్రస్తుతం ‘పుష్ప 2’ తో పాటు పలు చిత్రాల నిర్మాణం జరుగుతోంది. ఈ క్రమంలోనే పవన్‌ కళ్యాణ్‌ తో వీరు నిర్మిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయని అనడంలో సందేహం లేదు. పవన్‌ కళ్యాణ్‌ అభిమానులతో పాటు సినీ ప్రేమికులు ఈ కాంబో మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కమిట్‌ అయిన సినిమాలన్నింటినీ వరుసగా పూర్తి చేసేందుకు పవన్‌ డేట్లు ఇస్తూ వస్తున్నారు. కాస్త అటు ఇటు అయినా.. కమిట్ అయిన సినిమాలన్నీ బ్యాక్ టు బ్యాక్‌ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.