సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది. సినిమా రంగంలో చాలామంది హీరోయిన్ లు క్యాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కొన్నారు. ఒకానొక సమయంలో క్యాస్టింగ్ కౌచ్ పై మీడియాలో విపరీతంగా చర్చలు జరిగాయి. ఇప్పటికీ దీనిపై వార్తలు వస్తూనే ఉన్నాయి. బాలీవుడ్ లో కూడా కొంత మంది హీరోయిన్లు దీని బారిన పడిన వారు ఉన్నారు. ఇప్పటికే చాలా మంది నటీమణులు దీనిపై బహిరంగంగా మాట్లాడిన సందర్బాలు కూడా ఉన్నాయి. తాజాగా బాలీవుడ్ బ్యూటీ విద్యాబాలన్ కూడా క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించింది. ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా తనకు ఎదురైన కొన్ని చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం విద్యాబాలన్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 


దక్షిణాది సినిమాల్లో పని చేయడానికి ప్రయత్నిస్తున్న రోజుల్లో ఆమెకు ఎదురైన చేదు అనుభవం విద్యాబాలన్ ఇలా వివరించింది.  ‘‘నేను సౌత్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టడానికి కష్టపడుతున్న రోజుల్లో జరిగింది. నేను ఓ యాడ్ ఫిల్మ్ కోసం డైరెక్టర్ ను కలవడానికి చెన్నై వెళ్లాం. అక్కడ ఓ కాఫీ షాప్ లో దర్శకుడితో కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పా. అయితే అతను నన్ను రూమ్ కి వెళ్లి మాట్లాడుకుందాం అని పదే పదే అడిగాడు. అప్పుడే అతని ఆలోచన ఏమిటనేది నాకు అర్థమైంది. నేను అప్పుడు తెలివిగా గది లాక్ వేయకుండా కొంచెం తెరిచి ఉంచా. అందుకే ఆ దర్శకుడు ఏమీ మాట్లాడకుండా ఐదు నిమిషాల తర్వాత అక్కడ నుంచి వెళ్లిపోయాడు’’ అని తెలిపింది.


తాను అప్పుడు సమయస్పూర్తిగా ప్రవర్తించడం వల్లే ఆ పరిస్థితి నుంచి తప్పించుకోగలిగానని చెప్పింది. అయితే ఆ సినిమా నుంచి తప్పుకున్నందుకు భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చిందని చెప్పింది.  అప్పుడు తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలిని అవ్వబోతున్నానని అర్థమైందని చెప్పుకొచ్చింది విద్యా. అయితే ఆ దర్శకుడు ఎవరు అనేది ఆమె వెల్లడించలేదు. 


ఇప్పటికీ తాను ఆ సంఘటనను మర్చిపోలేకపోతున్నానని చెప్పింది విద్యా. తర్వాత కూడా ఇలా భయపెట్టే ఘటనలు చాలానే ఎదురైయ్యాయని తెలిపింది. అంతేకాకుండా ఇలాంటి ఘటనల వలన తాను కొంత కాలం మానసికంగా కూడా డిస్ట్రబ్ అయ్యాయని తెలిపింది. దాని నుంచి బయట పడటం కోసం చాలా కష్టపడాల్సి వచ్చిందని పేర్కొంది. ఆ కాఫీ షాప్ ఘటన జరిగిన తర్వాత ఆ దర్శకుడు తనను సినిమా నుంచి తొలగిచడమే కాకుండా తనను బాడీ షేమింగ్ చేశారని వాపోయింది.   


ఇక ప్రస్తుతం విద్యాబాలన్ నాలుగు పదుల వయసు దాటినా కూడా తన గ్లామర్ తో వరుస సినిమాలు చేస్తోంది. 2005లో వచ్చిన ‘పరిణీత’ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. తర్వాత 2011 లో వచ్చిన ‘డర్టీ పిక్చర్’ సినిమాతో ఆమె సినిమా కెరీర్ మలుపు తిరిగింది. అప్పటి నుంచి వరుసగా సినిమాలు చేస్తోంది.