టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి సెన్సార్ బోర్డు భారీ షాక్ ఇచ్చింది. ఆయన తెరకెక్కించిన 'వ్యూహం' (Vyooham) మూవీకి తాజాగా సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు సినిమాలోని పాత్రలకు నిజ జీవితంలోని నేతల పేర్లను పెట్టడంపై సెన్సార్ బోర్డ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అలాగే జరుగుతున్న కాలానికి సంబంధించిన అంశాలనే కథగా తీసుకోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ‘వ్యూహం’ చిత్రానికి సెన్సార్ టీం సర్టిఫికెట్ ఇచ్చేది లేదంటూ వెల్లడించింది. వివరాల్లోకి వెళితే.. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవిత ఆధారంగా రాంగోపాల్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం 'వ్యూహం'(Vyooham).
ఈ సినిమాని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. ఎన్నికల నేపథ్యంలో ఈ సినిమాని విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఆసక్తిని పెంచింది. ముఖ్యంగా అందరూ ఊహించిన విధంగానే వైయస్ జగన్ ని హైలైట్ చేస్తూ వైఎస్సార్సీపీకి అనుకూలంగానే ఈ సినిమాని తెరకెక్కించినట్లు ట్రైలర్ ద్వారా స్పష్టమైపోయింది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్, చంద్రబాబులను టార్గెట్ చేస్తూ తనదైన శైలిలో సెటైరికల్ గా వారి పాత్రలను ఈ సినిమాలో చిత్రీకరించారు వర్మ. 'వ్యూహం'తో పాటు పార్ట్-2 ని 'శపథం' పేరుతో వర్మ రిలీజ్ చేయబోతున్నారు. ఈ రెండు సినిమాల విడుదల తేదీలను ముందుగానే ప్రకటించారు.
ఈ క్రమంలోనే 'వ్యూహం' సినిమాని నవంబర్ 10న, 'శపథం' మూవీని జనవరి 25న రిలీజ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. వైయస్ జగన్ జీవితంలోని కొన్ని ప్రత్యేక ఘటనలను ఈ రెండు సినిమాల్లో చూపెట్టబోతున్నారు ఆర్జీవి. వైయస్సార్ మరణం అనంతరం వైయస్ జగన్ జైలుకు వెళ్లడం, బయటికి రావడం, సొంత పార్టీ పెట్టి ఓదార్పు యాత్రలు, ఆ తర్వాత పాదయాత్ర చేపట్టి అధికారాన్ని తెచ్చుకోవడం, చంద్రబాబు అరెస్టు తదితర అంశాలన్నింటినీ ఈ సినిమాల్లో చూపించనున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీకి సెన్సార్ టీం భారీ షాక్ ఇచ్చింది. ‘వ్యూహం’ చిత్రానికి సర్టిఫికెట్ ఇచ్చేందుకు సెన్సార్ బోర్డు నిరాకరించింది.
సినిమాలోని కొన్ని సన్నివేశాలు, వ్యక్తిగత వ్యవహారాలు, మనోభావాలను కించపరిచే విధంగా ఉన్నాయని సెన్సార్ బోర్డ్ సభ్యులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆ కారణంగా సినిమాకు సర్టిఫికెట్ ఇచ్చేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. దీంతో సినిమాకు పర్మిషన్ పై రివైజింగ్ కమిటీ దరఖాస్తు చేయాలని నిర్ణయించారు మేకర్స్. ఇదే విషయంపై వ్యూహం నిర్మాత దాసరి కిరణ్ కుమార్ స్పందిస్తూ..' సెన్సార్ బోర్డ్ అభ్యంతరాలపై రీవైజింగ్ కమిటీ దరఖాస్తు చేసినట్లు' చెప్పారు. ఇక ఈ సినిమాలో వైయస్ జగన్మోహన్ రెడ్డి పాత్రను తమిళన నటుడు అజ్మల్ అమీర్ పోషిస్తుండగా.. జగన్ భార్య వైయస్ భారతి పాత్రలో మానస రామకృష్ణ కనిపించనుంది. రామదూత బ్యానర్ పై దాసరి కిరణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
Also Read : బాబోయ్ మాళవిక, కొండమల్లిగా వణుకు పుట్టిస్తోందిగా!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial