టాప్ గన్ నుంచి అవతార్ వరకు పలు సినిమాలు ఈ ఏడాది అద్భుత విజయాలను అందుకున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు సాధించడంలో సరికొత్త రికార్డులు సృష్టించాయి. గ్లోబల్ బక్సాఫీస్ దగ్గర భారీగా వసూళ్లు సాధించిన టాప్ 10 సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


1: టాప్ గన్: మావెరిక్ (2022)


IMDb రేటింగ్: 8.4


వరల్డ్ వైడ్ గ్రాస్: $1,486,657,763


ఇది 36 ఏళ్ళ క్రితం విడుదలైన 'టాప్ గన్'కి సీక్వెల్. 'టాప్ గన్'ను గుర్తు చేస్తూ ఈ సీక్వెల్ స్టార్ట్ చేశారు. ఉన్నత అధికారుల ఆదేశాలను ఏమాత్రం లెక్క చేయని పీట్ మావెరిక్ పాత్రను పరిచయం చేశారు. అప్పటికీ, ఇప్పటికీ... 36 ఏళ్ళ తర్వాత కూడా అతడిలో ఎటువంటి మార్పు లేదని చూపించారు. న్యూ ఏజ్ ఫైటర్ పైలట్స్, లక్ష్యాల గురించి వివరించారు. ఈ సీక్వెల్‌లో ప్రధాన తారల జీవితాలపై ఎక్కువ దృష్టి సారించారు. సెకండాఫ్‌లో యాక్షన్ మీద దృష్టి పెట్టారు. క్లైమాక్స్, చివరి అరగంట ఉత్కంఠభరితంగా నడిపారు. టామ్ క్రూజ్ ప్రత్యేకంగా కనిపిస్తారు. ఈ వయసులోనూ హుషారుగా కనిపించారు.


2: జురాసిక్ వరల్డ్: డొమినియన్ (2022)


IMDb రేటింగ్: 5.7


వరల్డ్ వైడ్ గ్రాస్: $1,001,136,080


జురాసిక్ పార్క్, జురాసిక్ వరల్డ్ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. హాలీవుడ్ మాస్టర్ మైండ్ స్టీఫెన్ స్పీల్‌బర్గ్ ప్రారంభించిన ఈ ఫ్రాంచైజీలో రెండు సిరీస్‌లు ఉన్నాయి.  జురాసిక్ సిరీస్ సినిమాలు అనగానే మనకు గుర్తొచ్చేది గూస్ బంప్స్ తెప్పించే యాక్షన్ సీక్వెన్స్‌లు, చూడగానే భయపెట్టే భారీ డైనోసార్‌లు. జురాసిక్ వరల్డ్ డొమినియన్‌లో కూడా ఈ రెండూ ఉంటాయి. ‘జురాసిక్ వరల్డ్ డొమినియన్’ మీద ఆడియన్స్‌కు ఆసక్తి పెరగడానికి మరో కారణం ఈ సిరీస్‌లో ఇంతకు ముందు వచ్చిన ఐదు సినిమాలు ఒకే థీమ్ పార్కు నేపథ్యంలో నడుస్తాయి. 


3: డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ది మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్‌నెస్ (2022)


IMDb రేటింగ్: 6.9


వరల్డ్ వైడ్ గ్రాస్: $955,775,804


మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో లేటెస్ట్‌గా వచ్చిన సినిమా ‘డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ది మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్‌నెస్’. ఈ యూనివర్స్‌లో ఇది 28వ సినిమా. స్పైడర్ మ్యాన్ చిత్రాల దర్శకుడు సామ్ రైమి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. సినిమాలో వాండా మాక్సిమాఫ్/స్కార్లెట్ విచ్, డాక్టర్ స్ట్రేంజ్‌తో ‘నువ్వు నియమాలను అతిక్రమించి హీరో అయ్యావు. అదే పని నేను చేసి విలన్ అయ్యాను. ఇది ఏమాత్రం న్యాయం కాదు.’ అని ఒక డైలాగ్ చెబుతుంది. ఈ సినిమా కథ మొత్తం ఈ డైలాగ్‌లోనే ఉంది. విశ్వానికి సంబంధించిన కొన్ని నియమాలు బ్రేక్ చేయడం, వాటికి చెల్లించే మూల్యం చుట్టూనే ఈ కథ మొత్తం తిరుగుతుంది. 


4: మినియన్స్: ది రైజ్ ఆఫ్ గ్రూ (2022)


IMDb రేటింగ్: 6.6


ప్రపంచవ్యాప్త గ్రాస్: $939,433,210


ప్రపంచంలోనే గొప్ప సూపర్‌ విలన్ కావాలనే ఒక పన్నెండేళ్ల చిన్నారి కల గురించి చెప్పడమే ఈ సినిమా.


5: బ్లాక్ పాంథర్: వకాండ ఫరెవర్ (2022)


IMDb రేటింగ్: 7.2


ప్రపంచవ్యాప్త గ్రాస్: $787,135,551


2018లో వచ్చిన ’బ్లాక్ పాంథర్’ సినిమాకు సీక్వెల్‌గా దర్శకుడు ర్యాన్ కూగ్లర్ దీన్ని తెరకెక్కించారు. ‘బ్లాక్ పాంథర్’ సినిమా ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి సంచలన విజయం సాధించింది. మొదటి భాగంలో హీరోగా నటించిన చాడ్విక్ బోస్‌మన్ ఆ తర్వాత క్యాన్సర్‌తో మరణించారు. తనకు నివాళిగా ఈ సినిమాను మార్వెల్ రూపొందించింది. టి'చల్లా మరణంతో సినిమా ప్రారంభం అవుతుంది. తన మరణం వకాండాపై ఎంత ప్రభావం చూపించిందో తెలిపే సన్నివేశాలు ఎమోషనల్‌గా సాగుతాయి. 


6: ది బ్యాట్‌మాన్ (2022)


IMDb రేటింగ్: 7.8


ప్రపంచవ్యాప్త గ్రాస్: $770,836,163


క్రూరమైన సీరియల్ కిల్లర్ హత్యలను అడ్డుకునేందుకు బ్యాట్ మాన్ చేసే ప్రయత్నమే ఈ సినిమాలో చూపించారు.   


7: థోర్ - లవ్ అండ్ థండర్ (2022)


IMDb రేటింగ్: 6.3


ప్రపంచవ్యాప్త గ్రాస్: $760,672,134


థోర్ సిరీస్‌లో వచ్చిన నాలుగో సినిమా ‘థోర్: లవ్ అండ్ థండర్’. నోలాన్ బ్యాట్‌మ్యాన్ సినిమాల్లో టైటిల్ రోల్ పోషించిన విలక్షణ నటుడు క్రిస్టియన్ బేల్ ఇందులో విలన్ పాత్రలో నటించాడు. థోర్ సిరీస్‌లో ఇంతకు ముందు వచ్చిన మూడు సినిమాలకు, ఈ సినిమాకు ప్రధానమైన తేడా ఒకటి ఉంది. ఆ మూడు సినిమాలు పూర్తిగా థోర్ కథలు. థోర్ చుట్టూ తిరిగే కథల్లోకి విలన్స్ వస్తారు. వారిని థోర్ ఓడిస్తాడు, కథ సుఖాంతం అవుతుంది. కానీ ఈ సినిమా అలా కాదు. ఇది గోర్ కథ. గోర్‌తో ప్రారంభమై, గోర్‌తోనే ముగుస్తుంది.


8: వాటర్ గేట్ బ్రిడ్జ్ (2022)


IMDb రేటింగ్: 5.4


ప్రపంచవ్యాప్త గ్రాస్: $626,571,280


‘ది బ్యాటిల్ ఎట్ లేక్ చాంగ్జిన్’కి సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కింది.


9: మూన్ మ్యాన్ (2022)


IMDb రేటింగ్: 6.5


ప్రపంచవ్యాప్త గ్రాస్: $460,237,662


ఓ వ్యక్తి చంద్రుడిపై ఊహించని విధంగా చిక్కుకుంటాడు. ఆ తర్వాత ఒక గ్రహశకలం భూమిని నాశనం చేస్తుంది. దీంతో అతడు ప్రాణాలతో ఉన్న చివరి వ్యక్తిగా మిగిలిపోతారు. ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు జరిగాయి అనేది ఈ సినిమాలో చూపించారు.


10: అవతార్ - ది వే ఆఫ్ వాటర్ (2022)


IMDb రేటింగ్: 8


ప్రపంచవ్యాప్త గ్రాస్: $441,703,887


'అవతార్' 2009లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దానికి సీక్వెల్ 'అవతార్ 2' పదమూడేళ్ళ తర్వాత.. థియేటర్లలో విడుదలైంది. ఇప్పటి వరకు తెరపై చూడని ఓ అందమైన దృశ్య కావ్యాన్ని చూసిన అనుభూతి కలుగుతుంది. 'అవతార్'లో నావిగా మారిన మనిషి మరో గ్రహానికి వెళ్లడం, అక్కడ నావితో కలిసి ప్రేమలో పడటం, తమ ఉనికి కోసం పోరాటం చేయడం వంటివి కొత్తగా ఉన్నాయి.


Read Also: బాలీవుడ్ ఎంట్రీ బెడిసి కొట్టిందే - 2022లో ఈ తారలకు తప్పని చేదు అనుభవం