మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన హీరోల్లో అల్లు అర్జున్ ఒకరు. అదిరిపోయే డ్యాన్సులు, అంతకు మించిన ఫైట్లతో ఆకట్టుకున్నారు. తన మార్క్ నటనతో సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న బన్నీ, సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టి 20 వసంతాలు పూర్తి చేస్తున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన ఆయన,  అందిరి ప్రేమ, ఆదరాభిమానాలతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. తాను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి ప్రేక్షకుల ప్రేమే కారణన్నారు.


బన్నీ, మరెన్నో ఉన్నత శిఖరాలకు చేరాలి- చిరంజీవి


తాజాగా మెగాస్టార్ చిరంజీవి బన్నీకి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఎంతో కష్టపడి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన అల్లు అర్జున్, మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. “ప్రియమైన బన్నీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ 20 ఏళ్లలో ఎన్నో చక్కటి సినిమాలు చేశారు. చాలా ఆనందంగా ఉంది. ప్రేక్షకుల మదిలో సముచిత స్థానాన్ని పొంది పాన్ ఇండియా స్టార్‌గా, ఐకాన్ స్టార్‌గా ఎదిగావు. రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నత శిఖరాలకు ఎదగాలి. మరెన్నో హృదయాలను గెల్చుకోవాలని కోరుకుంటున్నాను” అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.






చిరంజీవి ట్వీట్ పై స్పందించిన బన్నీ


చిరంజీవి ట్వీట్ పై బన్ని స్పందించారు. ఆయన అభినందనల పట్ల ధన్యవాదాలు తెలిపారు. ఆయన ఆశీర్వాదం అలాగే ఉండాలని ఆకాంక్షించారు. “మీ అద్భుతమైన ఆశీర్వాదం, శుభాకాంక్షలకు చాలా ధన్యవాదాలు. నా హృదయంలో ఎప్పటికీ మీపై కృతజ్ఞతా భావం కలిగి ఉంటుంది. థ్యాంక్యూ చికాబాబీ” అంటూ రీట్వీట్ చేశారు. చిరంజీవి వరుసకు మావయ్య అవుతారు. అయితే, బన్నీ మాత్రం ఆయన్ను చికాబాబీ అని పిలుస్తారు. దానికి అర్థం ఏమిటనేది మాత్రం తెలీదు.






బాలనటుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ


నిజానికి బన్నీ చిరంజీవి సినిమాతో బాల నటుడిగా పరిశ్రమలోకి అడుగు పెట్టారు. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో  చిరంజీవి హీరోగా నటించిన ‘విజేత’ సినిమాలో బాల నటుడిగా కనిపించారు. ఆ తర్వాత ‘స్వాతిముత్యం’ చిత్రంలోనూ నటించారు. చిరంజీవి ‘డాడీ’లోనూ నటించి మెప్పించారు. ‘గంగోత్రి’ సినిమాతో అల్లు అర్జున్ హీరోగా పరిచయం అయ్యారు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. అల్లు అరవింద్, అశ్వనీదత్ కలిసి ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. ‘ఆర్య’ సినిమాతో మరింతగా ఆకట్టుకున్నారు. తెలుగుతో పాటు కేరళలోనూ చాలా చోట్ల 100 రోజులు ఆడింది. ‘దేశముదురు’ సినిమాతో మాస్ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. తనదైన నటన, డ్యాన్స్, ఫైట్స్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. ‘రుద్రమదేవి’ సినిమాలో గోన గన్నారెడ్డి పాత్రలో అదిరిపోయే నటన కనబర్చారు. 20 ఏండ్లలో 20 సినిమాలు మాత్రమే చేశారు. ఏడాదికి ఒక సినిమా చొప్పున ఆయన నటించారు.  


పాన్ ఇండియన్ స్టార్ గా కొనసాగుతున్న బన్నీ


ఇక ప్రస్తుతం పాన్ ఇండియన్ హీరోగా వెలుగొందుతున్నారు బన్నీ. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప’ సినిమాతో దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘పుష్ప’ సినిమా మంచి విజయం సాధించడంతో ‘పుష్ప2’ను మరింత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు సుకుమార్. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. త్వరలో విడుదలకు రెడీ అవుతోంది.


Read Also: అల్లు అర్జున్ మొదటి జీతం రూ.3500 మాత్రమే - ఇప్పుడు ఆయన ఆస్తుల విలువెంతో తెలుసా?