మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), కింగ్ అక్కినేని నాగార్జున (Nagarjuna) మధ్య మంచి మిత్రుత్వం ఉంది. వాళ్ళిద్దరూ పలు సందర్భాల్లో తమ మధ్య స్నేహాన్ని బయట పెట్టారు. ఈ ఇద్దరు మిత్రులు విజయ దశమికి థియేటర్లలో సందడి చేయనున్నారు.
 
చిరంజీవి 'గాడ్ ఫాదర్' (Godfather Movie), నాగార్జున 'ది ఘోస్ట్' (The Ghost Movie) సినిమాలు దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదల అవుతున్నాయి. హీరోలు ఇద్దరూ సొంత సినిమాతో పాటు స్నేహితుడి సినిమా కూడా విజయం సాధించాలని పబ్లిక్‌గా స్టేజి మీద చెప్పారు. హీరోలు ఎంత స్నేహితులు అయినప్పటికీ... థియేటర్ల దగ్గర పోటీ ఉండవచ్చని కొందరు అంచనా వేస్తున్నారు. పాజిటివ్ టాక్ ఏ సినిమాకు వస్తే ఆ సినిమాకు ఎక్కువ మంది ప్రేక్షకులు వచ్చే అవకాశాలు ఉంటాయనేది ట్రేడ్ వర్గాల అంచనా.


సంక్రాంతి, దసరా, దీపావళి వంటి పండగ సమయాల్లో రెండు మూడు సినిమాలు విజయాలు సాధించిన సందర్భాలు ఉన్నాయి. అందువల్ల, పోటీ అనేది ఏమీ ఉండదని చిత్ర పరిశ్రమలో కొందరు చెబుతుంటారు. 'ది ఘోస్ట్' చిత్ర దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఏమంటున్నారో తెలుసా?


'గాడ్ ఫాదర్', 'ది ఘోస్ట్' క్లాష్ గురించి ఆయన్ను ప్రశ్నించగా... ''రెండూ వేర్వేరు సినిమాలు. మా సినిమా వేరు, ఆ సినిమా వేరు. నేనొక వింత ఎగ్జాంపుల్‌ చెబుతా. మీరు, నేను... ఇద్దరం టమాటాలు అమ్ముతుంటే కాంపిటీషన్ ఉంటుంది. మీరు టమాటాలు, నేను ఉల్లిపాయలు అమ్ముతున్నప్పుడు కాంపిటీషన్ ఎందుకు ఉంటుంది? వాళ్ళది 'గాడ్ ఫాదర్', మాది 'ది ఘోస్ట్'... రెండూ వేర్వేరు సినిమాలు. ఆ సినిమా బావుంటే... ఆ సినిమాకు వెళతారు. మా సినిమా బావుంటే మా సినిమాకు వస్తారు. ఒక సినిమా చూశాక... డబ్బులు అయిపోయాయి కాబట్టి రెండో సినిమా చూడటం మానేస్తారని ఎక్కడా లేదు. సినిమాలు రెండూ బావుంటే రెండు సినిమాలు చేస్తారు'' అని చెప్పారు.  


'గాడ్ ఫాదర్' విషయానికి వస్తే... మలయాళ సినిమా 'లూసిఫర్'కు రీమేక్‌గా రూపొందింది. అక్కడ మోహన్ లాల్ చేసిన రోల్, ఇక్కడ చిరంజీవి చేశారు. అయితే, మలయాళ సినిమాతో పోలిస్తే కొన్ని మార్పులు చేసినట్లు ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. ఇందులో చిరంజీవి సోదరి పాత్రలో నయనతార, ఆమెకు భర్తగా సత్యదేవ్ నటించారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అతిథి పాత్ర పోషించారు.


Also Read : 'దర్శకుడు చెప్పినట్లే చేశా' - 'ఆచార్య' ప్లాప్ పై చిరు కామెంట్స్!
 
'ది ఘోస్ట్' విషయానికి వస్తే... స్టైలిష్ యాక్షన్ ఫిల్మ్‌గా రూపొందింది. ఇందులో నాగార్జున సరసన సోనాల్ చౌహాన్ నటించారు. తొలుత ఆ పాత్రకు కాజల్ అగర్వాల్‌ను ఎంపిక చేశారు. ఆమెకు పెళ్లి కావడం, ప్రెగ్నెంట్ అవ్వడంతో తర్వాత సినిమా నుంచి తప్పుకొన్నారు. ఆ తర్వాత పలువురు కథానాయికల పేర్లు పరిశీలించి సోనాల్ చౌహన్‌ను ఎంపిక చేశారు. 


Also Read : విజయవాడ వెళ్లనున్న బాలకృష్ణ - ఎవరూ ఊహించని విధంగా 'అన్‌స్టాప‌బుల్‌ 2' ట్రైలర్