మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ఆచార్య' సినిమా డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. రిలీజ్ కు ముందు ఈ సినిమా గురించి చిరు చాలా గొప్పగా మాట్లాడారు. కానీ ప్లాప్ తరువాత ఎక్కడా ఈ సినిమా గురించి స్పందించలేదు. ఓ సినిమా ఈవెంట్ లో మాత్రం దర్శకులపై సెటైర్లు వేశారు. సెట్ లోనే సీన్లు రాస్తున్నారని.. దాని వలన ఇబ్బందులు ఎదురవుతున్నాయని పరోక్షంగా కొరటాల శివాని టార్గెట్ చేశారు చిరు. 

 

ఇదిలా ఉండగా.. రీసెంట్ గా 'ఆచార్య' సినిమా ప్లాప్ ను కొరటాలపై తోసేశారు చిరు. 'గాడ్ ఫాదర్' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బాలీవుడ్ మీడియాకి ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు మెగాస్టార్. ఈ సందర్భంగా 'ఆచార్య' సినిమా ప్రస్తావన వచ్చింది. దానిపై స్పందించిన చిరు.. ఆ సినిమా ప్లాప్ విషయంలో బాధ పడడం లేదని.. దర్శకుడు చెప్పినట్లే చేశానని అన్నారు. అంటే ఈ ప్లాప్ బాధ్యత మొత్తం కొరటాలదే అన్నట్లుగా మాట్లాడారు. 

 

ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో హిట్, ప్లాప్ కి చాలా ప్రాధాన్యం ఇచ్చేవాడినని.. ప్లాప్ వస్తే బాధపడడం, హిట్ కొడితే ఆనందించడం కామన్ గా ఉండేదది.. కానీ ఆ తరువాత రెండింటికే ప్రాధాన్యం తగ్గిపోయిందని అన్నారు. అందుకే 'ఆచార్య' విషయంలో బాధ లేదని అన్నారు. కాకపోతే చరణ్ తో కలిసి నటించిన సినిమా అని.. ఫ్యూచర్ లో మరోసారి ఇద్దరం కలిసి నటించాలనుకుంటే అంత జోష్ ఉండకపోవచ్చని అన్నారు. 

 

ఇక 'గాడ్ ఫాదర్' సినిమా విషయానికొస్తే.. మలయాళ 'లూసిఫర్'కి రీమేక్ గా ఇది తెరకెక్కింది. ఇందులో నయనతార, సత్యదేవ్ లు కీలకపాత్రలు పోషించారు. అలానే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్(Salman Khan) ఇందులో క్యామియో రోల్ పోషిస్తున్నారు. చిరంజీవికి బాడీగార్డ్ లా కనిపించే రోల్ ఇది. కానీ సినిమా మొత్తం సల్మాన్ కనిపించరు. ఒక యాక్షన్ సీన్ లో ఆయన క్యారెక్టర్ ని హైలైట్ చేసి చూపించబోతున్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. మెగాస్టార్ సతీమణి  కొణిదెల సురేఖ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఆర్‌బి చౌదరి, ఎన్‌వి ప్రసాద్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇక చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. మెహర్ రమేష్ సినిమాలో ‘భోళా శంకర్’, బాబీ దర్శకత్వం మరో సినిమా చేస్తున్నారు.

 

'వాల్తేర్ వీరయ్య' అప్డేట్:
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయనున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. అలానే మరికొంతమంది స్టార్స్ ను తీసుకున్నారు. మాస్ మహారాజా రవితేజ కీలకపాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన కొత్త షెడ్యూల్ రాజమండ్రిలో మొదలుపెట్టారు. ఇప్పటికే వీరిద్దరిపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఇప్పుడు విలేజ్ సీక్వెన్స్ ను రాజమండ్రిలో చిత్రీకరిస్తున్నారు.

కథ ప్రకారం.. చిరు, రవితేజ సవతి సోదరులుగా కనిపించబోతున్నారు. గతంలో ఇలాంటి కాన్సెప్ట్ తో తెలుగులో కొన్ని సినిమాలు వచ్చాయి. కానీ వాటికి భిన్నంగా ఈ సినిమా ఉంటుందట. పూర్తి మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు. తెరపై చిరంజీవి, రవితేజ మధ్య వచ్చే క్లాష్ సన్నివేశాలు సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని చెబుతున్నారు.