మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో మంచు విష్ణు విజయం.. టాలీవుడ్ సమీకరణాలే మార్చేసింది. ఇప్పటివరకు మెగా ఫ్యామిలీ మద్దతు ఉన్న అభ్యర్థి మాత్రమే ‘మా’లో పాగా వేస్తూ వచ్చారు. అయితే, ఈసారి మాత్రం చిరు పాచిక పారలేదు. ఇందుకు కారణం.. ఆయన ఎంచుకున్న అభ్యర్థి. వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా పేరున్న ప్రకాష్ రాజ్‌ను ‘మా’ ఎన్నికల్లో అభ్యర్థిగా ప్రోత్సాహించడం.. టాలీవుడ్‌లో చాలామందికి నచ్చలేదు. పైగా ఆయన స్థానిక నటుడు కాకపోవడంతో.. కొందరు తమ ఓట్లతోనే సమాధానం చెప్పాలని నిర్ణయించుకున్నారేమో అనిపిస్తోంది. ఫలితాలను చూస్తుంటే.. ఓడింది ప్రకాష్ రాజ్ కాదని, మెగా ఫ్యామిలీ అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ట్విట్టర్‌లో సైతం #EndOfMega అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ‘మా’ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ఓటమికి మెగా ఫ్యామిలీయే కారణమని అంటున్నారు.


‘మా’లోనూ కుల సమీకరణలు?: టాలీవుడ్‌లో ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి పెద్దగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. సినీ పరిశ్రమ ఎందుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడం, అవసరమైనవారికి సాయం చేస్తూ చిరు పెద్ద దిక్కుగా నిలిచారు. ఇండస్ట్రీలో తిరుగులేని స్టార్‌గా చిరంజీవి స్థానం సంపాదించారు. కానీ, ‘మా’ ఎన్నికల్లో మాత్రం ఫలితం వేరేలా ఉంది. ఆయన మద్దతు పొందిన ప్రకాష్ రాజ్ ఓటమి మెగా కుటుంబాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే, సభ్యుల్లో చాలామంది ప్రకాష్ రాజ్‌ను ఓడించాలనే ఉద్దేశంతో మాత్రమే విష్ణుకు ఓటేసినట్లు తెలిసింది. పైగా విష్ణుకు ‘కుల’బలం కూడా తోడైనట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రకాష్ రాజ్ కులాలు, పెద్దలను లెక్క చేయకపోవడం వల్ల సభ్యులకు నచ్చలేదని పలువురు విమర్శిస్తున్నారు. చిరు కుటుంబం ఈ సమీకరణాలు ఆలోచించకుండా సామాజిక భావాలు కలిగిన ప్రకాష్ రాజ్‌ తప్పకుండా కళాకారులకు మేలు చేస్తారనే ఆలోచనతో మద్దతు ప్రకటించినట్లు తెలుస్తోంది. దీన్ని మంచు వర్గం తెలివిగా ఉపయోగించుకుని గెలుపు సొంతం చేసుకుంది. 


ఏకగ్రీవానికి ఎందుకు ప్రయత్నించలేదు?: మేమిద్దరం మంచి స్నేహితులం అని బయటకు చెప్పుకొనే మోహన్ బాబు, చిరంజీవి.. ‘మా’ ఎన్నికల విషయంలో ఎందుకు తమ స్నేహాన్ని చూపించలేదు? మేం మంచి స్నేహితులమని మైకులో చెప్పుకుంటూ.. చెవిలో మాత్రం శత్రువులమని చెప్పుకుంటున్నారా అనే సందేహాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఒక వేళ వారి స్నేహం నిజమైతే.. ఎవరో ఒకరు రాజీపడేవారని, ఏకగ్రీవంతో ఒకరిని ఎంపిక చేసుకుని గొడవలు లేకుండా చేసేవారని టాలీవుడ్ వర్గాలు అనుకుంటున్నాయి. మంచు విష్ణు అధ్యక్షుడిగా ఆసక్తి చూపించినప్పుడు ‘మా’ పెద్దలంతా కూర్చొని మాట్లాడుకుంటే సరిపోయింది. కానీ, పెద్దరికాన్ని ‘మంచు’ ఫ్యామిలీకి ఇవ్వడం ఇష్టంలేకే ‘మెగా’ ఫ్యామిలీ ప్రకాష్ రాజ్‌ను రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. పైగా ఎన్నికలు నిర్వహించాలంటూ చిరంజీవి లేఖ రాసి డిమాండ్ చేసి.. మంచు ఆశలపై నీళ్లు చల్లారు. ప్రకాష్ రాజ్‌పై పోటీకి విష్ణు వర్గం కూడా ‘సై’ అనడం. ఆయనతో పోటీని నరేష్ సీరియస్‌గా తీసుకోవడం.. ‘నాన్ లోకల్’ ఆరోపణలు చేయడంతో ‘మా’ ఎన్నికలు పెద్దల నుంచి చేయి దాటిపోయాయి. చిరంజీవి సైతం ఏమీ చేయలేక చూస్తుండిపోవల్సి వచ్చింది. అగ్నికి ఆజ్యం పోసినట్లు చిరు.. సోదరులు పవన్ కళ్యాణ్, నాగబాబులు మోహన్ బాబు‌పై మాటలు విసరడంతో వ్యక్తిగత దూషణలకు దారి తీసింది. 


Also Read: మంచు Vs మోనార్క్.. వీరి ప్యానళ్లలో ఎవరు గెలిచారు? ఎవరు ఓడారు?


చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం..: ‘మా’లో జరిగేవన్నీ ఇంటి గొడవలని చెబుతూనే ఇరువర్గాల అభ్యర్థులు మీడియాకు ఎక్కారు. ‘మా’ కుటుంబాన్ని రచ్చకు ఈడ్చారు. ఎన్నికల తర్వాత.. మీడియానే ‘మా’ పరువును బజారుకు ఈడుస్తోంది అన్నట్లుగా మోహన్ బాబు, చిరంజీవి అన్నారు. ‘మా’లో నిప్పు రగిలింది కాబట్టే.. మీడియా దానిపై చలిమంట కాచుకుందనే విషయాన్ని మరిచిపోయారు. ఎన్నికల తర్వాత చిరంజీవి స్పందిస్తూ.. ‘‘పదవులు కేవలం తాత్కాలికం మాత్రమే. అందరం సినీ కళామతల్లి బిడ్డలమని గుర్తుంచుకోవాలి. అందరం కలిసి కట్టుగా ఉండాలి. పదవుల కోసం సినిమా ఇండస్ట్రీకి చెందిన మరొకర్ని దూషించడం, నిందించడం, దుష్ప్రచారం చేసుకోవడం సరైన పని కాదు. తాత్కాలిక పదవుల కోసం మనల్ని మనమే తిట్టుకోవడం అవసరమా? చిన్న చిన్న పదవుల కోసం ఈగోలు అవసరం లేదు. వాటిని పక్కన పెట్టి ముందుకు సాగాలి’’ అని అన్నారు. విష్ణు విజయం తర్వాత మోహన్ బాబు స్పందిస్తూ.. ‘‘ఇకపై ఏకగ్రీవంగానే ఎన్నికలు జరగాలని పెద్దలను కోరుకుంటున్నా. అధ్యక్షుడి అనుమతి లేకుండా సభ్యులెవరూ మీడియాతో మాట్లాడకూడదు’’ అని మోహన్ బాబు అన్నారు. దీని గురించి చిరు, మోహన్ బాబులు ముందే ఆలోచించి ఉంటే.. ఇంత రచ్చ జరిగేది కాదనే అభిప్రాయం టాలీవుడ్‌లో వ్యక్తమవుతోంది. చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏం లాభమని అంటున్నారు. నాగబాబు కూడా రాజీనామా చేయకుండా.. విష్ణు విజయాన్ని పాజిటివ్‌గా స్వీకరించి ఉంటే హూందాగా ఉండేదని పలువురు అంటున్నారు. ఇప్పటికైనా మెగా కుటుంబం విభేదాలు పక్కన పెట్టి.. మంచుతో కలిసి వెళ్తారా? ఇండస్ట్రీలో ఉన్న తమ ‘పెద్దరికం’ను కాపాడుకుంటారా లేదా అనేది చూడాలి. 


Also Read: ‘మా’లో మంచు తుఫాన్.. ప్రకాష్ రాజ్ ఆ మాట అనకపోయి ఉంటే..
Also Read: విష్ణు విజయంపై మంచు లక్ష్మి, మనోజ్ ఏమన్నారంటే.. 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి