సినీ నటి, మాజీ ఎంపీ జయప్రదకు తమిళనాడులోని ఎగ్మోర్‌ కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. కార్మికుల ఈఎస్ఐ సొమ్ము కాజేసిన కేసులో 6 నెలల జైలు శిక్ష విధించింది. రూ. 5 వేల జరిమానా కట్టాలని ఆదేశించింది. చెన్నైలోని రాయపేటలో జయప్రదకు ఓ సినిమా థియేటర్ ఉంది. అదే ప్రాంతానికి చెందిన రామ్ కుమార్, రాజబాబుతో పాటు జయప్రద ఈ థియేటర్‌ను నిర్వహించారు. తొలుత ఈ సినిమా థియేటర్ అద్భుతంగా నడిచింది. నెమ్మదిగా ప్రేక్షకులు తగ్గిపోయారు. లాభాల నుంచి నష్టాల బాటపట్టింది. చేసేది ఏమీ లేక థియేటర్ ను క్లోజ్ చేశారు నిర్వాహకులు.  


ఈఎస్ఐ సొమ్ము కాజేసిన యాజమాన్యం?


థియేటర్ లో పని చేసే కార్మికులకు ఈఎస్ఐ అందిస్తామని యాజమాన్యం చెప్పింది. థియేటర్ మూసివేయడంతో తమ ఈఎస్ఐ సొమ్ము ఇవ్వాలని కార్మికులు కోరారు. అయితే, కార్మికుల నుంచి వసూలు చేసిన డబ్బును థియేటర్ యాజమాన్యం లేబర్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌కు యాజమాన్యం చెల్లించలేదు. సొంత ఖర్చుల కోసం వాడుకున్నారు. ఈ విషయం థియేటర్ క్లోజ్ అయ్యాక బయటపడింది. జరిగిన మోసాన్ని కార్మికులు  కార్పొరేషన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న కార్పొరేషన్.. ఎగ్మూరు కోర్టును ఆశ్రయించింది. కార్మికులు కూడా న్యాయం కోసం కోర్టుకెక్కారు.


జయప్రదతో పాటు ముగ్గురికి జైలు శిక్ష


ఈ కేసు చాలా కాలంగా విచారణ కొనసాగుతోంది. కార్మికులకు చెల్లించాల్సిన డబ్బును బయట సెటిల్ చేసుకుంటామని, డబ్బును వారికి వెంటనే అందిస్తామని జయప్రద తరఫున న్యాయవాది కోర్టుకు వెళ్లడించారు. ఈ విషయాన్ని తెలుపుతూ పలు అఫిడవిట్లను దాఖలు చేశారు. అయితే, వీటిని పరిశీలించిన న్యాయస్థానం పరిగణలోకి తీసుకునేది లేదని వెల్లడించింది. లేబర్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్  న్యాయవాది వాదనతో ఏకీభవించిన కోర్టు ఆ అఫిడవిట్లను డిస్మిస్ చేసింది. చాలా కాలంగా కొనసాగిన విచారణకు ముగింపు పలుకుతూ తాజాగా తీర్పును వెలువరించింది. జయప్రదతో పాటు ముగ్గురికి 6 నెలల జైలు శిక్ష విధించింది. ఒక్కో నిందితుడికి రూ.5 వేల చొప్పున జరిమానా విధించింది.


ఇక జయప్రద గురించి భారతీయ సినీ అభిమానులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. 1980, 1990 కాలంలో తెలుగుతో పాటు హిందీలో ఎన్నో చిత్రాల్లో నటించింది. రెండు దశాబ్దాల పాటు రెండు భాషల్లో స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. తెలుగు రాష్ట్రంలో పుట్టినా హిందీ చిత్ర పరిశ్రమలో తిరుగులేని క్రేజ్ సంపాదించుకుంది. జితేంద్ర, రిషి కుమార్‌ లాంటి టాప్ హీరోలు సైతం ఆమె డేట్స్ కోసం ఎదురు చూసేవారు. తెలుగులో ఎన్టీఆర్‌, ఏఎన్‌ఆర్‌, కృష్ణ లాంటి దిగ్గజ నటులతో పలు సినిమాలు చేసింది. ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగు పెట్టి లోక్ సభ సభ్యురాలిగా ఎన్నికైంది. ప్రస్తుతం బీజేపీలో చేరింది. వచ్చే ఎన్నికల్లో ఏపీ నుంచి పోటీ చేయాలని ఆమె భావిస్తోంది.


Read Also: ఆ అమ్మాయి జీవితం నాశనం చేయకండి - లక్ష్మీ మీనన్‌తో పెళ్లి వార్తలపై విశాల్ ఆగ్రహం


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial