Russia Moon Mission: రష్యా దాదాపు 50 ఏళ్ల తర్వాత తొలిసారి లునార్ మిషన్ ప్రయోగం చేపట్టింది. మాస్కోకు తూర్పున 3,450 మైళ్ల దూరంలోని వోస్తోక్నీ కాస్మోడ్రోమ్‌ ప్రాంతం నుంచి శుక్రవారం తెల్లవారుజామున 2.10 గంటలకు '‘లునా - 25'’ నింగిలోకి దూసుకెళ్లింది. వొస్టోచ్నీ కాస్మోడ్రోమ్ నుంచి ఈ రాకెట్ ప్రయోగం నిర్వహించినట్లు రష్యన్ స్పేస్ ఏజెన్సీ (రొస్కోస్మోస్) ప్రకటించింది. 1976 తర్వాత రష్యా చేపట్టిన తొలి లూనార్‌ ల్యాండర్‌ ప్రయోగం ఇదే కావడం విశేషం.


చంద్రుడిపైకి చంద్రయాన్‌-3ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) పంపినట్టుగానే రష్యా కూడా దక్షిణ ధృవంపై ల్యాండింగే లక్ష్యంగా  ‘లూనా-25’ అనే స్పేస్‌క్రాఫ్ట్‌ను జాబిల్లిపైకి పంపింది. అయితే కేవలం 5 రోజుల్లోనే వ్యోమనౌక చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించనుంది. అనంతరం జాబిల్లి దక్షిణ ధృవంపై సురక్షిత ల్యాండింగ్ లక్ష్యంగా అందుకు అనువైన ప్రాంతం ఎంపిక కోసం 3-7 రోజులపాటు కక్ష్యలోనే భ్రమించనుంది. గతంలో ప్రయోగించిన లునార్ మిషన్‌లో చంద్రుడిపై  170గ్రాముల మట్టి నమూనాలను రష్యా సేకరించింది.


ప్రయోగంపై రెస్కోస్మోస్ సీనియర్ అధికారి అలెగ్జాండర్ బ్లాఖిన్ స్పందిస్తూ చరిత్రలో మొట్టమొదటిసారి చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండింగ్ చేయనున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు అందరూ చంద్రుడి మధ్యమండలానికి సమీపంలో ల్యాండింగ్ చేశారని అన్నారు. ఆగస్టు 21న లునా-25 వ్యోమనౌక చంద్రుడిపై ల్యాండవనుందని రొస్కోస్మోస్ వర్గాలు వెల్లడించాయి. అంతరిక్ష పరిశోధనలో రష్యా సత్తా చాటేందుకు ఈ ప్రయోగం చేపట్టినట్లు చెప్పారు. కాగా భారత్ ప్రయోగించిన చంద్రయాన్-3 చంద్రుడి దక్షిణ ధ్రువంపై ఆగస్టు 23న ల్యాండ్ కానుంది. 


చంద్రయాన్‌ కంటే ముందుగా రష్యా పంపిన లూనా-25 అక్కడే అడుగుపెట్టనుంది. ఈ ల్యాండర్ మిషన్ కేవలం 30 కేజీల పేలోడ్‌ను మోసుకెళ్తోంది. చంద్రుడిపై మట్టి ఆనవాళ్లను సేకరించేందుకు అవసరమయ్యే రోబోటిక్‌ చేతులు, డ్రిల్లింగ్‌ హార్డ్‌వేర్‌తో పాటు ఇతర శాస్త్రీయ పరికరాలు అందులో ఉన్నాయి. చంద్రుడి దక్షిణ దృవంలో  సేఫ్ ల్యాండింగ్ తర్వాత ఈ మిషన్​ ఏడాది కాలం పాటు జాబిల్లి ఉపరితలంపై పరిశోధనలు చేస్తుంది. 


లూనా 25 వ్యోమనౌక దాదాపు ఏడాదిపాటు చంద్రుడి మీదనే ఉండనుంది. చంద్రుడిపై నమూనాల సేకరణ, అక్కడి మట్టిని విశ్లేషించడం, దీర్ఘకాలంపాటు శాస్త్రీయ పరిశోధనలు చేపట్టనున్నట్టు రష్యన్ స్పేస్ ఏజెన్సీ తెలిపింది. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో పశ్చిమ దేశాలతో సంబంధాలు దెబ్బతిన్న తర్వాత రష్యా చేపట్టిన తొలి అంతరిక్ష ప్రయోగం ఇదే. నిజానికి లూనా 25  ప్రయోగం రష్యా-ఉక్రెయిన్ యుద్దం కారణంగా దాదాపు రెండేళ్లపాటు ఆలస్యమైంది. యూరోపియన్​ స్పేస్​ ఏజెన్సీ, ఇతర అంతర్జాతీయ సంస్థల సహకారం అందకపోవడంతో ఈ మిషన్‌ను రష్యా ఆపేసింది.


చంద్రయాన్-3కి ప్రమాదం?
ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం జులై 14న జరిగింది. తాజాగా రష్యా సైతం చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండింగ్ లక్ష్యంగా ప్రయోగం చేపట్టింది. అయితే చంద్రయాన్-3 వ్యోమనౌక కంటే ముందే లునా-25 చంద్రడిపై దిగనుంది. అయితే  రెండు స్పేస్ క్రాఫ్ట్‌లు చంద్రుడి దక్షిణ ధృవంపైనే ల్యాండింగ్ అవుతున్నా ఈ రెండు వ్యోమనౌకలు ఢీకొట్టుకునే అవకాశం లేదని రష్యా శాస్త్రవేత్తలు తెలిపారు. రెండు వేర్వేరు ల్యాండింగ్ ప్రాంతాలు కావడం ఇందుకు కారణమని చెబుతున్నారు.