‘జబర్దస్త్’ షో ద్వారా బుల్లితెర అభిమానులను సొంతం చేసుకున్న కమెడియన్ చమ్మక్ చంద్ర. ‘జబర్దస్త్’ నుంచి బయటకు వచ్చిన తర్వాత.. ఆయన పలు టీవీ చానెళ్లలో ప్రసారమైన కామెడీ షోస్‌లో పాల్గొన్నాడు. మరోవైపు సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. చమ్మక్ చంద్ర ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్‌ను కనెక్టయ్యే స్కిట్లు మాత్రమే చేసేవాడు. వాటిలో కొన్ని స్కిట్లు ఎప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి. అయితే, సినిమాల్లో మాత్రం చమ్మక్ చంద్ర ఎంచుకొనే పాత్రలు.. ఆయన అభిమానించే ప్రేక్షకులకు నచ్చకపోవచ్చు. ‘అఖండ’ సినిమాలో కూడా ఆయన పాత్రతో డబుల్ మీనింగ్ డైలాగులు చెప్పించారు. అది ఫ్యామిలీ ఆడియన్స్ కాస్త ఇబ్బందికరమే. అయితే, అలాంటి పాత్రలను చంద్రానే ఎంచుకుంటున్నాడా? లేదా అందుకు డైరెక్టర్లే చంద్రాను ఎంపిక చేసుకుంటున్నారా అనేది తెలియదుగానీ.. చంద్ర మాత్రం ఇటీవల డబుల్ మీనింగ్ డైలాగులతోనే రాణిస్తున్నాడు. 


తాజాగా చమ్మక్ చంద్ర నటించిన ‘షికారు’ సినిమా నుంచి ఓ పాట విడుదలైంది. ఇందులో కుర్రాళ్లకు ప్రేమ గురించి, అమ్మాయిల గురించి ఉపదేశిస్తూ.. కాస్త హద్దుమీరినట్లే అనిపిస్తోంది. అయితే, అలాంటి పాట రాసిన రచయితదే ఇందులో తప్పు. ‘‘పక్కింటి ఆంటిని ట్రై చేయ్’’ అంటూ సాగే ఈ పాటలో చంద్ర నటించడం ఆయన అభిమానులకు మాత్రం మింగుడుపడదు. ‘‘అమ్మాయిలంతా స్క్రాపు, ఆంటిలంతా తోపు’’ అంటూ ఉపదేశం కూడా ఇచ్చాడు.


Also Read: ఇదేం పాటండి బాబు, ‘బొంగు చికెన్’ను ఇలా కూడా వాడేస్తారా? ఛీ, అంతా బూతే!


వివాహిత మహిళలను కించపరిచేలా ఈ సాంగ్ ఉందని నెటిజనులు తిట్టిపోస్తున్నారు. వేరొక భార్యను లైన్లో పెట్టమని చెప్పడం ఏమిటని అడుగుతున్నారు. ఈ పాట యువతను చెడగొట్టేలా ఉందని పలువురు మండిపడుతున్నారు. ఇలాంటి పాటలతో టాలీవుడ్ పరువు తీయకండని కొందరు అంటున్నారు. లవ్ వద్దని చెప్పడానికి ఇంకా మంచి కారణాలు ఉంటాయి. కానీ, మరీ ఇలా ‘ఆంటీ’లు అంటూ సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారని పలువురు కామెంట్ల ద్వారా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ పాట చూసి.. మీరు కూడా మీ అభిప్రాయం చెప్పండి. 


Also Read: ఆది ప్రేమలో వర్షిణీ? నువ్వే నాకు తగినవాడివంటూ ఇన్‌స్టా పోస్ట్!