Pawar Not In Race : రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏకు మరో అడ్వాంటేజ్ లభించింది. ప్రతిపక్ష పార్టీల తరపున బలమైన అభ్యర్థిగా నిలబడతారనుకున్న ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తనకు ఆసక్తి లేదని ప్రకటించారు. తాను రాష్ట్రపతి పదవికి ప్రతిపక్షాల అభ్యర్థిని కానని పవార్ స్పష్టం చేశారు. జులై 18న జరగనున్న రాష్ట్రపతి ఎన్నికలకు ప్రతిపక్షాల అభ్యర్థిగా శరత్ పవార్‌కు మద్దతిస్తున్నట్లుగా ఆమ్ ఆద్మీ నేత కేజ్రీవాల్ ప్రకటించారు. మరో వైపు విపక్ష పార్టీలన్నింటితో మమతా బెనర్జీ బుధవారం సమావేశం కానున్నారు. ఆ సమావేశానికి ఏ ఏ పార్టీలు వస్తాయన్నదానిపై క్లారిటీలేదు.
ఓడిపోయే యుద్ధంలో పాల్గొనడం ఎందుకు?
ప్రతిపక్షాల్లో ఐక్యత లేకపోవడం ... ప్రతిపక్షాలు తమ అభ్యర్థికి మద్దతిచ్చేందుకు అవసరమైన సభ్యుల సంఖ్యా బలాన్ని కూడగట్టుకోగలరనే నమ్మకం లేనందునే పవార్ పోటీకి ఆసక్తిగా లేనట్లుగా తెలుస్తోంది. ఓటమి పాలయ్యే యుద్ధంలో పాల్గొనడం ఎందుకని ఎన్సీపీ వర్గాలు చెబుతున్నాయి. మహారాష్ట్రలో ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీనే అడ్వాంటేజ్ సాధించింది. ముఖ్యంగా మహారాష్ట్రలో శివసేనకు చెందిన సంజయ్ పవార్‌ను ఓడించి మరీ బిజెపి ఎంపి సీటును సాధించిందని తెలిపాయి. శివసేనకు మద్దతిస్తామని వాగ్దానం చేసిన పలువురు స్వతంత్ర అభ్యర్థులు బీజేపీకి ఓటు వేశారు.
విపక్షాల ఉమ్మడి అభ్యర్థి కోసం కాంగ్రెస్ ప్రయత్నాలు
రాష్ట్రపతి ఎన్నికకు సమయం దగ్గరపడుతోన్న వేళ.. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిని ఎంచుకునేందుకు కాంగ్రెస్ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా శరద్ పవార్‌ను సూచిస్తూ ఇప్పటికే ఇతర పార్టీలకు ప్రతిపాదనలు కూడా చేసింది. గత గురువారం కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే.. ఈ విషయమై పవార్‌తో చర్చలు జరిపారు. ఆప్ నేత సంజయ్ సింగ్ కూడా పవార్‌ను కలిశారు. ప్రతిపక్షాలను ఏకం చేసేందుకు తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ కూడా యత్నిస్తున్నారు.
రాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవం చేసే ప్రయత్నాల్లో ఎన్డీఏ
మరో వైపు భారతీయ ఎన్డీఏ కూడా రాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ అంశంపై చర్చలు జరిపేందుకు కమిటీని కూడా నియమించింది. బీజేపీ ప్రయత్నాలు ఫలిస్తే రాష్ట్రపతిగా ఈ సారి ఏకగ్రీవ ఎన్నిక జరిగే అవకాశం ఉంది. అయితే విపక్షాలు మాత్రం దర్యాప్తు సంస్థలతో వేధింపులకు పాల్పడుతున్న కేంద్రానికి అలాంటి అవకాశం ఇవ్వకూడదన్న ఆలోచనలో ఉన్నాయి.కానీ బలమైన అభ్యర్థి కోసం అన్వేషిస్తున్నట్లుగా తెలుస్తోంది.