సీనియర్ నటుడు, నిర్మాత చలపతి రావు అంత్యక్రియలు (Chalapathi Rao) ఈ రోజు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఫిల్మ్ నగర్‌లో గల మహాప్రస్థానంలో ముగిశాయి. ఆయన చితికి కుమారుడు, దర్శక - నటుడు రవిబాబు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కుటుంబ సభ్యులతో పాటు ప్రముఖ నిర్మాతలు డి. నిర్మాత సురేష్ బాబు, దామోదర ప్రసాద్, రచయిత పరుచూరి గోపాల కృష్ణ, దర్శకులు బోయపాటి శ్రీను, శ్రీవాస్, యువ కథానాయకుడు మంచు మనోజ్, నటుడు గౌతమ్ రాజుతో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. 


అమెరికా నుంచి అమ్మాయిల రాక కోసం...
చలపతి రావు ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. శనివారం రాత్రి  ఎనిమిదిన్నర గంటలకు చికెన్ బిర్యానీ, చికెన్ కూరతో భోజనం చేశారని, ఆ తర్వాత హ్యాపీగా నిద్రలోకి వెళ్ళారని, ఎటువంటి బాధ లేకుండా తుదిశ్వాస విడిచారని రవిబాబు తెలిపారు. 


చలపతి రావుకు ముగ్గురు సంతానం. రవిబాబుతో పాటు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళు అమెరికాలో సెటిల్ అయ్యారు. వాళ్ళ ఇండియా రావడం కోసం, వాళ్ళకు తండ్రి చివరి చూపు అందివ్వడం కోసం అంత్యక్రియలను ఈ రోజు నిర్వహించారు. ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల వరకు తెలుగు చలన చిత్ర పరిశ్రమ ప్రముఖులు, ప్రేక్షకుల సందర్శనార్థం రవిబాబు ఇంటి దగ్గర ఉంచారు. ఆ తర్వాత మహాప్రస్థానానికి తీసుకు వెళ్ళారు.


కుమారుడి దర్శకత్వంలో చివరి సినిమా!
ఎన్టీఆర్ 'కథానాయకుడు' సినిమాతో నటుడిగా చలపతి రావు కెరీర్ స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత సుమారు 1200ల సినిమాల్లో నటించారు. ఆయన చివరి సినిమా కన్న కుమారుడు రవిబాబు దర్శకత్వంలో కావడం విశేషం. ప్రస్తుతం తాను తీస్తున్న సినిమాలో నాన్నగారు నటించారని రవిబాబు తెలిపారు. చలపతి రావు మీద గత వారం కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు.


Also Read : మెగా, నందమూరి హీరోలు కలుస్తున్నారు - ఫ్యాన్స్ కలిసేది ఎప్పుడు? ఈ గొడవలేంట్రా బాబు?
 
పెళ్ళి తర్వాత సినిమాల్లోకి
చలపతి రావు 19 సంవత్సరాలకు వివాహమైంది. పెళ్ళైన మూడేళ్ళ తర్వాత సినీ ప్రయత్నాలు ప్రారంభించారు. సినిమాల్లోకి రావాలని అనుకోవడానికి కారణం చుట్టుపక్కల జనాలే. చిన్నతనం నుంచి చలపతి రావు చదువులో వీక్. చదువు కంటే నాటకాల మీద ఎక్కువ దృష్టి పెట్టారు. బాగా నటించే సరికి అందరూ 'నువ్వు మద్రాసు వెళితే హీరో అవుతావు' అని చెప్పడంతో ఇంట్లో లక్ష రూపాయలు తీసుకుని మద్రాస్ ట్రైన్ ఎక్కారు. 'కథానాయకుడు' తర్వాత ఎన్టీఆర్ దగ్గర ఎక్కువ ఉండటంతో ఆయన మనిషిగా ముద్ర పడి ఇతరులు అవకాశాలు ఇవ్వలేదు. ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించడంతో పాటు స్వీయ రచన, దర్శక నిర్మాణంలో రూపొందిన 'దాన వీర సూర కర్ణ'తో చలపతి రావుకు బ్రేక్ వచ్చింది. ఆ సినిమాలో ఎన్టీఆర్ మూడు వేషాలు వేస్తే... చలపతి రావు ఐదు వేషాలు వేశారు. ఆ తర్వాత ఇతర హీరోల సినిమాల్లో కూడా అవకాశాలు వచ్చాయి. 


'నిన్నే పెళ్ళాడతా'తో రూట్ చేంజ్
చలపతి రావు కెరీర్ గురించి చెప్పాల్సి వస్తే... ఒక విధంగా 'నిన్నే పెళ్ళాడతా'కు ముందు, తర్వాత అని చెప్పాలి. విలన్‌గా పాపులర్ అయిన ఆయన చేత ఆ సినిమాలో తండ్రి వేషం వేయించారు కృష్ణవంశీ. ఆ తర్వాత నుంచి చలపతి రావుకు తండ్రి, బాబాయ్ పాత్రలు, కామెడీ వేషాలు రావడం మొదలైంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'ఆది' తర్వాత ఎక్కువ బాబాయ్ క్యారెక్టర్లు వేశారు. 


Also Read : సాయి పల్లవికి శ్రీలీల రీప్లేస్‌మెంట్‌ అవుతోందా? - 'ఫిదా' బ్యూటీ కండిషన్స్ 'ధమాకా' భామకు ప్లస్సా?


మూడు తరాల నటులతో ఆయన పని చేశారు. 'యమగోల', 'యుగపురుషుడు', 'అక్బర్ సలీమ్ అనార్కలి', 'జస్టిస్ చౌదరి', 'దొంగ రాముడు', 'నిన్నే పెళ్ళాడతా', 'సింహాద్రి', 'ఆది', 'అరుంధతి', 'సింహా', 'దమ్ము', 'లెజెండ్' తదితర సినిమాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. ఆర్.సి. క్రియేషన్స్ నిర్మాణ సంస్థ స్థాపించి ఐదు సినిమాలు తీశారు.