ప్రముఖ నటి సమంత ప్రధాన పాత్రలో దర్శకుడు గుణ శేఖర్ తెరకెక్కించిన తాజా చిత్రం ‘శాకుంతలం’. ఏప్రిల్ 14న ప్రపంచ వ్యాప్తంగా పలు భాషల్లో ఈ చిత్రం విడుదల అయ్యింది. కాళిదాసు నాటకం ‘అభిజ్ఞాన శాకుంతలం’ నుంచి ప్రేరణ పొంది గుణశేఖర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీతో పాటు పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మలయాళ నటుడు దేవ్ మోహన్ దుశ్యంతుడి పాత్రలో నటించారు. అల్లు అర్జున్ ముద్దుల కూతురు అర్హ ఈ చిత్రంలో భరతుడి పాత్ర పోషించింది.  భారీ అంచనాల నడుమ విడుదలైన  హిస్టారికల్ ఫాంటసీ డ్రామా ‘శాకుంతలం’ అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది. తొలి షో నుంచే ప్రేక్షకులు, విమర్శకుల నుంచి నెగెటివ్ స్పందన లభించింది. ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో అంచనాలను అందుకోలేకపోయింది.  బాక్సాఫీస్ వద్ద బోల్తా పడిపోయింది.


కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో నాలుగు అవార్డులు దక్కించుకున్న ‘శాకుంతలం’


థియేటర్లలో అభిమానులను మెప్పించలేకపోయినా,  ‘శాకుంతలం’ చిత్రానికి అవార్డులు మాత్రం క్యూ కడుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు న్యూయార్క్ ఇంట‌ర్నేష‌న్ ఫిల్మ్స్ అవార్డ్స్- 2023లో బెస్ట్ ఫాంట‌సీ ఫిల్మ్‌, బెస్ట్ మ్యూజిక‌ల్ ఫిల్మ్‌ గా అవార్డులు దక్కించుకుంది. తాజాగా ఫ్రాన్స్‌ లో జరుగుతున్న కేన్స్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్‌ లోనూ దుమ్మురేపింది.  ఈ సినిమాకు ఏకంగా నాలుగు కేటగిరీల్లో అవార్డులు దక్కాయి. బెస్ట్ ఫారిన్ ఫిల్మ్, బెస్ట్ ఫాంటసీ ఫిల్మ్, బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్, బెస్ట్ ఇండియన్ ఫిల్మ్ విభాగాల్లో జయకేతనం ఎగురవేసింది. ఈ విషయాన్ని గుణటీమ్ వర్క్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.


ఈ సినిమాకు అవార్డులు రావడం ఏంటి?- నెటిజన్ల ట్రోలింగ్


కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ఈ సినిమాకు నాలుగు అవార్డులు రావడం పట్ల నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. కొంత మంది చిత్ర బృందానికి అభినందనలు చెప్తుంటే, మరికొంత మంది ఈ సినిమాకు అవార్డులు ఇవ్వడం ఏంటని ట్రోల్ చేస్తున్నారు.  కాగా థియేట‌ర్ల‌లో రిలీజై నెల రోజులు కూడా కాక‌ముందే ‘శాకుంత‌లం’ సినిమా ఓటీలోకి వచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన  అన్ని భాషలలో స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసింది. మే 12 నుండి స్ట్రీమింగ్ అవుతోంది.   






శాకుంతలం’ సినిమా గురించి..


‘శాకుంతలం’ సినిమాను దుశ్యంతుడు, శకుంతల కథ ఆధారంగా గుణశేఖర్ తెరకెక్కించారు. కాళిదాసు రచించిన ప్రసిద్ధ నాటకం ‘అభిజ్ఞాన శాకుంతలం’ ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ప్రముఖ నిర్మాత 'దిల్‌' రాజు స‌మ‌ర్ప‌ణ‌లో డిఆర్‌పి (దిల్ రాజు ప్రొడక్షన్స్) - గుణా టీమ్ వర్క్స్‌ ప‌తాకంపై గుణ‌శేఖ‌ర్ కుమార్తె నీలిమ గుణ 'శాకుంతలం' సినిమాను నిర్మించారు. ఇందులో దుర్వాస మహర్షిగా కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబు, ప్రియంవద పాత్రలో అనన్యా నాగళ్ళ, అదితి బాలన్ పాత్రలో అనసూయ నటించారు. ప్రకాష్ రాజ్, గౌతమి, జిష్షుసేన్ గుప్తా, మధుబాల, కబీర్ బేడీ, సచిన్ ఖేడేకర్, వర్షిణి తదితరులు నటించారు.  


Read Also: చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్