Boney Kapoor Wants To Remake Uppena in Hindi: మెగా హీరో వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంటగా నటించిన సినిమా ‘ఉప్పెన’. సాన బుచ్చిబాబు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. కరోనా సమయంలో విడుదలైన ఈ సినిమా అద్భుత విజయాన్ని అందుకుంది. ఎలాంటి అంచనాలు లేకుడా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేసింది. కొత్త వాళ్లతో తీసిన ఈ సినిమా ఏకంగా రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.


హిందీలో ‘ఉప్పెన’ రీమేక్


ఈ సినిమా చూసి పలువురు సినీ ప్రముఖులు సైతం అవాక్కయ్యారు. ఈ చిత్రంలో పని చేసిన వారందరికీ ఆ తర్వాత చక్కటి అవకాశాలు వచ్చాయి. హీరోయిన్ కృతి శెట్టి  ఏకంగా స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఇప్పుడు ఈ సినిమా హిందీలో తెరకెక్కబోతోంది. సౌత్ లో బ్లాక్ బస్టర్ సాధించిన ఈ సినిమా నార్త్ లోనూ ప్రేక్షకులను అలరించబోతోంది. తాజాగా రామ్ చరణ్ ‘RC 16’ సినిమా ఓపెనింగ్ కార్యక్రమంలో జాన్వీ కపూర్ తో పాటు బోనీ కపూర్ కూడా వచ్చారు. ఈ వేడుకలో ‘ఉప్పెన’ రీమేక్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.


‘ఉప్పెన’ రీమేక్ లో హీరోయిన్ గా ఖుషి కపూర్


‘ఉప్పెన’ సినిమా తనకు ఎంతో నచ్చిందని బోనీ కపూర్ తెలిపారు. ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. “బుచ్చిబాబు తెరకెక్కించిన ‘ఉప్పెన’ సినిమా చూశాను. ఈ మూవీ నాకు చాలా బాగా నచ్చింది. ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయడానికి ట్రై చేస్తున్నాం. నా చిన్న కూతురు ఖుషి కపూర్ ను ఈ సినిమా చూడాల్సిందిగా చెప్పాను” అని వెల్లడించారు. బోనీ కపూర్ వ్యాఖ్యల నేపథ్యంలో ఈ సినిమా కచ్చితంగా త్వరలో హిందీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. బోనీ కపూర్ నిర్మాతగా, ఖుషి కపూర్ హీరోయిన్ గా ఈ సినిమా రీమేక్ అయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రంలో హీరోగా ఎవరు నటిస్తారు? అనే విషయంపై త్వరలో ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.  


బాలీవుడ్ లో రెండు క్రేజీ ఆఫర్లు


బాలీవుడ్ లో ప్రస్తుతం ఖుషి కపూర్‌  రెండు ఆఫర్లను అందుకుంది. స్టార్ హీరోలు అమీర్ ఖాన్, సైఫ్ అలా ఖాన్ కుమారు హీరోలుగా నటిస్తున్న సినిమాల్లో హీరోయిన్ గా ఎంపిక అయ్యింది. కరణ్ జోహార్ నిర్మాతగా వ్యవహరిస్తున్న‘నాదనియాన్‌’ సినిమాలో సైఫ్‌ అలీఖాన్‌ కుమారుడు ఇబ్రహీం ఖాన్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. అటు తమిళంలో చక్కటి విజయాన్ని అందుకున్న ‘లవ్ టుడే’ సినిమా హిందీ రీమేక్ లో అమీర్ ఖాన్ కుమారుడు జువైద్ ఖాన్ నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాల్లో ఆమె హీరోయిన్ గా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.  


Read Also: ‘ఎర్త్ అవర్’ రోజు లైట్లు ఎందుకు ఆర్పేయాలి? హైదరాబాద్‌లో ఈ టైమ్‌లో లైట్స్ అన్నీ బంద్!