ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫిట్ నెస్ కి సంబంధించిన వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది బాలీవుడ్ ముద్దుగుమ్మ శిల్పాశెట్టి. ఇప్పుడు తన కాలు తానే విరగ్గొట్టుకుని వీల్ చైర్ లో కూర్చుంది. అదేంటి అలా ఎందుకు చేసింది అని అనుకుంటున్నారా? తన కాలు అయితే విరిగింది కానీ తను మాత్రం విరగ్గొట్టుకోలేదండోయ్. అసలు ఏం జరిగిందంటే..


శిల్పా శెట్టి ప్రస్తుతం ఒక వెబ్ సిరీస్ లో నటిస్తోంది. అందులో శిల్పా మీద యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్న టైం లో కాలు జారి కింద పడిపోయింది. దీంతో తన కాలుకి బాగా దెబ్బ తగిలింది. ఈ విషయాన్ని శిల్పా స్వయంగా చెప్తూ ఇన్ స్టా లో ఫోటోస్ పోస్ట్ చేశారు. "వాళ్ళు రోల్.. కెమెరా.. యాక్షన్.. బ్రేక్ ఏ లెగ్ అన్నారు. నేను అలాగే చేశాను. ఫలితంగా 6 వారాల పాటు రెస్ట్ తీసుకోమన్నారు. కానీ నేను ఇంతక ముందు కంటే మరింత బలంగా రెడీ అయి వచ్చేస్తాను. అప్పటి వరకు నన్ను గుర్తుంచుకోండి. ప్రార్థనలు ఎప్పుడూ మంచే చేస్తాయి. కృతజ్ఞలతో మీ శిల్పా శెట్టి కుంద్రా “ ఫోటో కింద రాసుకొచ్చారు. కాలుకి కట్టుతో నవ్వుతూ ఫోటోకి ఫోజు ఇచ్చారు.


అది చూసి శిల్పా స్నేహితులు, అభిమానులు కంగారు పడుతున్నారు. అంతా పెద్ద దెబ్బ తగిలినా క్యూట్ స్మైల్ తో కనిపిస్తున్నారు.. మీరు త్వరగా కోలుకోవాలంటూ తెగ కామెంట్లు పెడుతున్నారు. ఈ ఫోటో చూసి సోఫియా చౌదరి 'ఓ మై గాడ్! సూపర్ వుమెన్ నువ్వు త్వరగా కోలుకోవాలి' అని కామెంట్ పెట్టింది. శిల్పా ప్రస్తుతం రోహిత్ శెట్టి తెరకెక్కిస్తున్న ఇండియన్ పోలీస్ ఫోర్స్ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. సిద్ధార్థ్ మల్హోత్రా ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో శిల్పా శెట్టి దైర్య సాహసాలు గల పవర్ ఫుల్ పోలీసు ఆఫీసర్ పాత్రలో కనిపించనుంది. ఇదే వెబ్ సిరీస్ షూటింగ్ గతంలో సిద్ధార్థ్ కూడా గాయపడి కోలుకున్నాడు.