ది కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి తన తదుపరి సినిమా ‘ది వ్యాక్సిన్ వార్’ షూటింగ్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించారు. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, నానా పటేకర్, పల్లవి జోషి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈరోజు (జనవరి 16వ తేదీ) హైదరాబాద్‌లోని ది వ్యాక్సిన్ వార్ సెట్స్‌లో పల్లవి జోషి గాయపడింది.
వ్యాక్సిన్ వార్ సెట్స్‌లో షూటింగ్‌లో ఉన్న నటిని వాహనం అదుపు తప్పి ఢీకొట్టిందని సినిమా వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే ఆమె గాయపడినప్పటికీ తన షాట్‌ను పూర్తి చేశాకనే చికిత్సకు వెళ్లింది. అదృష్టవశాత్తూ, తీవ్రమైన గాయం ఏమీ అవ్వలేదు. పల్లవి ప్రస్తుతం స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. తన ఆరోగ్యం బాగానే ఉంది.
ఎవరీ పల్లవి జోషి?
పల్లవి జోషి భారతీయ చలన చిత్ర పరిశ్రమలో పేరు పొందిన నటి. ఆమె మరాఠీ, హిందీ చిత్రాలలో పనిచేసింది. ఇన్సాఫ్ కీ ఆవాజ్, అంధ యుద్ధ్, దాతా, సౌదాగర్, తలాష్, ఇన్సానియత్, ఇంతిహాన్ మొదలైన కొన్ని ప్రసిద్ధ చిత్రాలలో పల్లవి జోషి నటించింది. ఆమె చాలా సంవత్సరాల పాటు ప్రముఖ మరాఠీ సింగింగ్ రియాలిటీ షో, సరిగమప ని హోస్ట్ చేసింది.
ఆమె చివరిసారిగా ది కశ్మీర్ ఫైల్స్‌లో కనిపించింది. ఈ చిత్రంలో ఆమె నటనకు ప్రశంసలు అందుకుంది. తన వ్యక్తిగత జీవితం గురించి చెప్పాలంటే వివేక్ అగ్నిహోత్రిని పల్లవి జోషి 1997లో వివాహం చేసుకుంది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ది వాక్సిన్ వార్ లో అనుపమ్ ఖేర్, నానా పటేకర్, దివ్య సేథ్ తదితరులు నటిస్తున్నారు. ది కాశ్మీర్ ఫైల్స్ కోసం వివేక్ అగ్నిహోత్రితో కలిసి పనిచేసిన అభిషేక్ అగర్వాల్ తన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ ద్వారా దేశవ్యాప్తంగా 'ది వాక్సిన్ వార్'ని విడుదల చేయనున్నారు.
2023 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15వ తేదీన ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రం హిందీ, ఇంగ్లీష్, గుజరాతీ, పంజాబీ, భోజ్‌పురి, బెంగాలీ, మరాఠీ, తెలుగు, తమిళం, కన్నడ, ఉర్దూ, అస్సామీలతో సహా 10 భాషలకు పైగా విడుదల కానుంది.