Rishabh Pant:


టీమ్‌ఇండియాకు అతిపెద్ద ఎదురుదెబ్బ! వికెట్‌ కీపర్‌ రిషభ్ పంత్‌ కనీసం రెండేళ్లు మైదానానికి దూరమవుతాడని తెలుస్తోంది. ఎంత లేదన్నా 18 నెలలు అతడిని స్టేడియాల్లో చూడటం కష్టమేనని సమాచారం. ఈ వ్యవధిలో అతడు రెండు ప్రపంచకప్‌లు, ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌, రెండు ఐపీఎల్‌ సీజన్లు మిస్సవుతాడని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు న్యూస్‌18 ఓ కథనం పోస్టు చేసింది.


ఫ్యూచర్‌ స్టార్‌ రిషభ్ పంత్‌ రూర్కీలో కారు ప్రమాదానికి గురయ్యాడు. తలపై గాట్లు, వీపుపై కాలిన గాయాలు, మోకాలి లిగమెంట్లలో చీలక, పాదాల్లో ఎముకల స్థానభ్రంశం జరిగింది. ప్రమాదంలో అతడి కారు పూర్తిగా దగ్ధమైంది. అదృష్టవశాత్తు అతడు కారులోంచి బయటకు దూకడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మొదట పంత్‌కు డెహ్రాడూన్‌లో చికిత్స అందించారు. ఆ తర్వాత ముంబయిలోని కోకిలాబెన్‌ ధీరూభాయ్‌ అంబానీ ఆస్పత్రికి ఎయిర్‌లిఫ్ట్‌ చేశారు. డాక్టర్‌ పార్ధీవాల నేతృత్వంలో మోకాలి లిగమెంట్లకు శస్త్రచికిత్స చేశారు. మరో సర్జరీ చేయాల్సి ఉంది.


వికెట్‌ కీపర్‌ కావడంతో రిషభ్ పంత్‌ కోలుకోవడానికి సుదీర్ఘ సమయం పట్టనుంది. ఎందుకంటే కీపింగ్‌ చేసేందుకు అతడు నిరంతరం మోకాళ్లు వంచి కూర్చోవాల్సి ఉంటుంది. బంతులు అందుకొనేందుకు కుడి, ఎడమ వైపు డైవ్స్‌ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ చేయాలంటే అతడి మోకాళ్ల కండరాలు, ఎముకలు బలంగా ఉండాలి. అందుకే శస్త్రచికిత్స తర్వాత బెంగళూరులోని ఎన్‌సీఏలో అతడు ఎక్కువ సమయం రిహబిలిటేషన్‌కు వెళ్లాల్సి ఉంటుంది.


'పంత్‌ కీపరన్న సంగతి మనం అర్థం చేసుకోవాలి. అతడు క్రమం తప్పకుండా స్క్వాటింగ్‌, సైడ్‌వే మూవ్‌మెంట్స్‌ చేయాల్సి ఉంటుంది. వీటి వల్ల అతడి మోకాళ్లపై ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. అందుకే మనం తొందరపడొద్దు. అతడు పూర్తిగా కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది' అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయని న్యూస్‌ 18 పేర్కొంది. ఈ నేపథ్యంలో పంత్ చాలా కీలక టోర్నీలకు దూరమవ్వాల్సి వస్తోంది.


ఈ ఏడాది ఐపీఎల్‌, వన్డే క్రికెట్‌ ప్రపంచకప్‌నకు పంత్‌ అందుబాటులో ఉండడు. వచ్చే ఏడాది ఐపీఎల్‌, జూన్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌ ఆడడు. సెప్టెంబర్లో ఆసియాకప్‌నకూ దూరమవుతాడు. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఎక్కువ భాగం ఆడడు. అందులో కీలకమైన బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫీ మరికొన్ని రోజుల్లోనే మొదలవుతోంది. ఒకవేళ టీమ్‌ఇండియా ఫైనల్‌ చేరుకుంటే ఇంగ్లాండ్‌లో అతడి సేవలు అత్యంత కీలకం.