Akshay Kumar About Twinkle Khanna: ఒకప్పటి బాలీవుడ్ హీరోయిన్, అక్షయ్ కుమార్ సతీమణి ట్వింకిల్ ఖన్నా 50 ఏళ్ల వయసులో మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేసింది. లండన్‌ లోని గోల్డ్‌ స్మిత్స్‌ యూనివర్సిటీ నుంచి తాజాగా ఆమె మాస్టర్స్ డిగ్రీ పట్టా అందుకుంది. ఈ సందర్భంగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తన భార్యను అభినందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తనను ప్రశంసిస్తూ ఓ ఎమోషనల్ పోస్టు రాశారు. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట బాగా వైరల్ అవుతోంది.


భార్యను అభినందించిన అక్షయ్ కుమార్


ఇల్లు, పిల్లలు, తనను చూసుకుంటూ మాస్టర్స్ డిగ్రీ అందుకోవడం సంతోషంగా ఉందని అక్షయ్ కుమార్ తెలిపారు. “రెండు సంవత్సరాల క్రితం చదువుకోవాలని నువ్వు నాతో చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. కానీ, చాలా కష్టపడి అనుకున్నది సాధించావు. ఇల్లు, పిల్లలు, నన్ను, నీ కెరీర్ ను చూసుకుంటూ చదువుకున్నావు. నేను సూపర్ ఉమెన్ ను పెళ్లి చేసుకున్నాను. భర్తగా ఎంత గర్వపడుతున్నాను చెప్పేందుకు నేనూ ఇంకా చదువుకోవాలి అనుకుంటున్నాను. కంగ్రాట్స్ మై లవ్” రాసుకొచ్చారు. ఈ మేరకు ట్వింకిల్ పట్టా అందుకున్న అనంతరం ఆమెతో కలిసి దిగిన ఫోటోను అభిమానులతో పంచుకున్నారు. అక్షయ్ షేర్ చేసిన ఫోటోలో ట్వింకిల్ ఖన్నా ఆకుపచ్చ రంగు చీరలో చిరునవ్వుతో  అందంగా కనిపించింది. అక్షయ్ తన భార్యను అభినందిస్తూ పెట్టిన పోస్టుపై పలువురు సినీ సెలబ్రిటీలతో పాటు నెటిజన్లు శుభాకాంక్షలు చెప్తున్నారు. ఈ వయసులో కుటుంబ బాధ్యతలను మోస్తూ చదువుకోవడం పట్ల అభినందనలు తెలుపుతున్నారు. అటు తన  గ్రాడ్యుయేషన్ కు సంబంధించి ట్వింకిల్ ఖన్నా ఓ వీడియోను షేర్ చేసింది.  అక్షయ్ పోస్టుకు రిప్లై ఇచ్చింది. ఇంతగా ప్రోత్సహించే భర్త తనకు రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు వెల్లడించింది.






ఫిక్షన్ రైటింగ్ లో మాస్టర్స్ డిగ్రీని కంప్లీట్ చేసిన ట్వింకిల్ ఖన్నా


ప్రస్తుతం 50 ఏళ్ల వయసున్న ట్వింకిల్ ఖన్నా లండన్‌ లోని గోల్డ్ స్మిత్ యూనివర్సిటీ నుంచి ఫిక్షన్ రైటింగ్ లో మాస్టర్స్ డిగ్రీని కంప్లీట్ చేసింది. బాలీవుడ్ స్టార్ యాక్టర్లు డింపుల్‌ కపాడియా, రాజేశ్‌ ఖన్నా దంపతుల ముద్దుల కూతురిగా బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది ట్వింకిల్ ఖన్నా. 1995లో హిందీ మూవీ ‘బర్సాత్‌’తో వెండి తెరకు హీరోయిన్ గా పరిచయం అయ్యింది. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ‘జాన్‌’, ‘దిల్‌ తేరా దీవానా’, ‘ఇంటర్నేషనల్‌ ఖిలాడి’ సహా పలు సినిమాల్లో నటించింది. తెలుగు ప్రేక్షకులకూ ట్వింకిల్ ఖన్నా పరిచయమే. విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ‘శ్రీను’ చిత్రంలో ఆమె హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత అక్షయ్ కుమార్ ను పెళ్లి చేసుకుంది. వివాహం తర్వాత ఆమె సినీ పరిశ్రమకు దూరం అయ్యింది. ప్రస్తుం అక్షయ్ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమారుడు ఆరవ్ (21), కుమార్తె నితారా (11).


Read Also: 'హనుమాన్‌' డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మకి షాకిచ్చిన ట్విటర్‌ - అదే కారణమా?