Ram Temple Inauguration : అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం నేపథ్యంలో కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అన్ని కార్యాలయాలకు జనవరి 22న సగం రోజు సెలవును ప్రకటించింది. మధ్యాహ్నం 2.30 గంటల వరకే కార్యాలయాలను నడుస్తాయని వెల్లడించింది. ప్రజల విశ్వాసాలను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు.
ఇప్పటికే పలు రాష్ట్రాల్లో స్కూళ్లకు కూడా సెలవు ప్రకటించారు. ఈ నెల 22న అయోధ్యలోని రామాలయంలో బాలరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఈ వేడుకకు సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంపై దేశ వ్యాప్తంగా ఎంతో ఉత్సాహం నెలకొంది. ఆ రోజు పలు రాష్ట్రాల్లోని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. కొన్ని రాష్ట్రాల్లో ఆ రోజు మద్యం దుకాణాలను మూసివేయనున్నారు. ఉత్తరప్రదేశ్‌లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 22న పాఠశాలలకు సెలవుపై ఆదేశాలు జారీ చేశారు. జనవరి 22న రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలతో పాటు మద్యం దుకాణాలను కూడా మూసివేస్తున్నట్లు యోగి తెలిపారు. ఆ రోజున ఏ విద్యా సంస్థలనూ తెరవరు.
మధ్యప్రదేశ్‌లోనూ పాఠశాలలు, కళాశాలలకు 22న సెలవు ప్రకటించారు. ఈమేరకు ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం పెద్ద పండుగలాంటిదని సీఎం పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లో ఆ రోజు మద్యం దుకాణాలను మూసివేయనున్నారు. 22న అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా గోవా ప్రభుత్వం.. ప్రభుత్వ కార్యాలయాలకు, పాఠశాలకు, కళాశాలలకు సెలవు ప్రకటించింది.ఛత్తీస్‌గఢ్‌లో కూడా జనవరి 22న పాఠశాలలు, కళాశాలలు మూసివేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక ప్రకటన విడుదల చేసింది. హర్యానాలో కూడా రామ్‌లల్లా పవిత్రోత్సవంనాడు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు మూసివేయనున్నారు. ఆ రోజున మద్యం దుకాణాలను కూడా మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఏపీలోనూ సంక్రాంతి సెలవులు 21వ తేదీ వరకూ పొడిగించారు. అయిత 22న అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ట ఉందని తెలిసి కూడా 21వ తేదీ వరకే సెలవులు పొడిగించారని 22వ తేదీన కూడా సెవులు ప్రకటించాలని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నందున ఎలాంటి సెలవు ప్రకటించే అవకాశం లేదని అంచనా వేస్తున్నారు.