Telugu Bigg Boss 7: బిగ్ బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్స్ అంతా ప్రస్తుతం ఫన్ మోడ్‌లో ఉన్నారు. హౌజ్‌లో కేవలం ఆరుగురు మాత్రమే ఉండడంతో అప్పుడప్పుడు ఎవరికి వారు కూర్చొని ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండిపోతున్నారు. ఇప్పటివరకు ఏ బిగ్ బాస్ ఫినాలే వీక్‌లో కూడా ఇలా జరగలేదు. హౌజ్‌లో కొందరే ఉండడంతో కంటెస్టెంట్స్ అంతా బోర్‌గా ఫీల్ అవ్వడంతో పాటు ప్రేక్షకులకు కూడా బోర్ కొట్టిస్తున్నారు. అందుకే బిగ్ బాస్.. కంటెస్టెంట్స్‌కు మోటివేషన్ ఇచ్చారు. లక్ష్యానికి చేరువ అవుతున్నప్పుడు రెట్టింపు ఉత్సాహం చూపించాలని అన్నారు. విన్నర్ అనేవాడు ఇలా ఉండడు అని చెప్పాడు. అంతే కాకుండా కంటెస్టెంట్స్ చేత ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయించడం కోసం వారికి వివిధ టాస్కులు ఇస్తున్నాడు. ఇక ఈ టాస్కుల మధ్య శివాజీ వైఖరీ ఏ మాత్రం మారడం లేదు. తనకు క్లోజ్ అయిన యావర్ గురించి కూడా వెనక మాట్లాడడం మొదలుపెట్టాడు.


అమర్‌పై నాన్‌స్టాప్ కౌంటర్లు..
ముందుగా బిగ్ బాస్.. కంటెస్టెంట్స్‌కు ఒక ఫన్నీ టాస్క్ ఇచ్చాడు. ఇందులో ముందుగా అమర్‌దీప్‌ను జ్యోతిష్యుడిగా వ్యవహరించమన్నాడు. హౌజ్‌మేట్స్ అంతా ఒకరు తర్వాత ఒకరు వచ్చి జాతకం చెప్పించుకోవాలని అన్నాడు. దీంతో కంటెస్టెంట్స్ అంతా అమర్‌దీప్‌ను ఒక ఆట ఆడేసుకున్నారు. తను ఏం చెప్పినా రివర్స్ కౌంటర్లు వేస్తూ.. జోకులు వేస్తూ.. అమర్‌ను టార్గెట్ చేశారు. ముఖ్యంగా శివాజీ, అర్జున్ అయితే అమర్‌పై ఉన్న చనువుతో కాస్త ఎక్కువగానే మాట్లాడారు. అమర్ జాతకమంతా తనకు తెలుసని అర్జున్ అన్నాడు. తొందరలో ఏది రివీల్ చేస్తాడో అని అమర్.. తనను ఆపుతూ ఉన్నాడు. ఇక అమర్‌తో ఫన్ పూర్తయ్యిందని.. శివాజీని జ్యోతిష్యుడిగా వ్యవహరించమన్నారు బిగ్ బాస్. అందరినీ వదిలేసి ముందుగా అమర్ జాతకమే చెప్పాలని నిర్ణయించుకున్నాడు శివాజీ. దానికి అమర్ సహకరించకపోవడంతో చెంప పగలగొట్టి మరీ తనను కుదురుగా కూర్చోబెట్టాడు.


యావర్ సేఫ్ గేమ్..
ఇక ఇంటి ఫుడ్ టాస్క్ అనేది సగం వరకు మాత్రమే పూర్తయ్యింది. దీంతో శుక్రవారం ప్రసారమయిన ఎపిసోడ్‌లో మిగతా సగం పూర్తిచేయాలని బిగ్ బాస్‌కు వచ్చిన గ్రహంతరవాసి హాచీ నిర్ణయించుకుంది. పల్లవి ప్రశాంత్, ప్రియాంక, యావర్‌లకు ఇంకా ఇంటి ఫుడ్ రాకపోవడంతో వారి తరపున అమర్‌దీప్, అర్జున్, శివాజీలను బాల్స్ పజిల్ ఆడమంది. ఇప్పటికే ఫినాలే అస్త్రా కోసం అర్జున్, అమర్ ఆ టాస్క్‌ను ఆడేశారు. అందుకే వారికి ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి టాస్క్ ప్రారంభమయిన వెంటనే వేగంగా ఆడడం మొదలుపెట్టారు. శివాజీ మాత్రం కన్ఫ్యూజ్ అయ్యాడు. అందరికంటే ముందుగా అమర్‌దీప్.. టాస్కును గెలిచి యావర్‌కు ఇంటి ఫుడ్ అందించమని కోరాడు. కానీ యావర్‌కు ఫుడ్ ఇవ్వడానికి హాచీ ఒక కండీషన్ పెట్టాడు. తను కేవలం ఒక్క హౌజ్‌మేట్‌తో మాత్రమే ఆ ఫుడ్‌ను షేర్ చేసుకోవచ్చని అన్నాడు. యావర్.. దానికి ఒప్పుకోలేదు, అందరితో పంచుకుంటున్నానని చెప్పాడు. హాచీ దానికి ఒప్పుకోలేదు. యావర్ కూడా మొండిగా తన మాటపై నిలబడ్డాడు. దీంతో ఇంటి ఫుడ్ తనకు దక్కదని హాచీ తేల్చిచెప్పాడు. తను చెప్పిన వినకుండా యావర్.. తన ఇంటి ఫుడ్‌ను పోగొట్టుకోవడంతో శివాజీకి కోపం వచ్చింది. ‘‘నాకొక విషయం అర్థమయ్యింది. ఇక్కడ ఎవరూ ఎవరి మాట వినరు. యావర్ సేఫ్ గేమ్ ఆడాడు. ఒకరిని సెలక్ట్ చేసుకుంటే మిగతావారు ఫీల్ అవుతారని అనుకున్నాడు’’ అని తన అభిప్రాయాన్ని బయటపెట్టాడు.


భార్యతో అమర్ వీడియో కాల్..
హాచీ ఇచ్చిన తరువాతి టాస్కులో అర్జున్ గెలిచాడు. దీంతో పల్లవి ప్రశాంత్‌కు ఇంటి ఫుడ్‌ను పంపమని కోరాడు. యావర్‌కు పెట్టినట్టుగానే ప్రశాంత్‌కు కూడా కండీషన్ పెట్టాడు హాచీ. తన ఫుడ్‌ను కేవలం ఒక్క హౌజ్‌మేట్‌తో మాత్రమే పంచుకోమని చెప్పాడు. దీంతో ప్రశాంత్.. అమర్ పేరు చెప్పాడు. ఇద్దరు కలిసి ఇంటి ఫుడ్‌ను ఆస్వాదించారు. ఇక ప్రస్తుతం హౌజ్‌లో ఆరుగురి మ్యూచువల్ ఫండ్స్ ఖాతాలో కొన్ని పాయింట్స్ ఉన్నాయి. అందరికంటే ఎక్కువ పాయింట్స్ అమర్ దగ్గరే ఉన్నాయి. ఆ పాయింట్స్ అన్నీ ఇచ్చేస్తే.. తమ ఫ్యామిలీలోని ఒకరితో వీడియో కాల్ మాట్లాడే అవకాశం ఉంటుందని బిగ్ బాస్ తెలిపారు. అలా అమర్‌కు తేజస్వినితో వీడియో కాల్ మాట్లాడే అవకాశం లభించింది. డిసెంబర్ 14న వారి మొదటి వెడ్డింగ్ యానివర్సిరీ కావడంతో ఒకరినొకరు విష్ చేసుకున్నారు. మరింత ధైర్యంగా ఆడమంటూ అమర్‌కు ధైర్యం చెప్పింది తేజస్విని.


Also Read: ప్రముఖ యూట్యూబర్ అరెస్ట్ - పెళ్లి పేరుతో యువతిని మోసం చేశాడంటూ ఆరోపణలు!