బిగ్ బాస్ సీజన్ 7లో ఈవారంలో జరిగిన ఎవిక్షన్ ఫ్రీ పాస్, కెప్టెన్సీ టాస్కులలో కంటెస్టెంట్స్ అంతా ఏమేమి తప్పులు చేశారని నాగార్జున గుర్తుచేశారు. బాగా ఆడని వారిని ఆడమంటూ ఎంకరేజ్ చేశారు. కంటెస్టెంట్స్ చేసిన తప్పులను గుర్తుచేశారు. ముఖ్యంగా ఎవిక్షన్ ఫ్రీ పాస్ గెలుచుకున్న యావర్ విషయంలో ప్రేక్షకుల అభిప్రాయాన్ని నాగార్జున బయటపెట్టారు. ముందుగా సంచాలకులుగా శోభా శెట్టి, పల్లవి ప్రశాంత్ తీసుకున్న నిర్ణయం కరెక్టే అని, యావరే విన్నర్ అని చెప్పిన నాగార్జున.. తర్వాత యావర్ చేసిన తప్పులను వీడియోలుగా చూపించారు. యావర్‌పై మాత్రమే కాకుండా శివాజీపై కూడా నాగ్ సీరియస్‌గానే రియాక్ట్ అయ్యారు.
శివాజీతో సీరియస్ డిస్కషన్..
ముందుగా శివాజీతో ఈవారం గేమ్ గురించి మాట్లాడడం మొదలుపెట్టారు నాగార్జున. తన కొడుకు వచ్చినప్పుడు ఏం సలహా ఇచ్చాడని అడిగారు నాగ్. ఇంట్లో మామూలుగా వాడే పదాలను హౌజ్‌లో వాడొద్దని చెప్పినట్టుగా గుర్తుచేశారు. పిచ్చి పోహా, ఎర్రి పోహా, పిచ్చినాయాల అంటూ అమర్‌దీప్‌ను సంబోధించిన సందర్భాల గురించి మాట్లాడారు. అమర్‌దీప్‌ను కూడా ఈ విషయం గురించి అడగగా.. తాను అదంతా సీరియస్‌గా తీసుకోలేదని చెప్పాడు. కానీ ప్రేక్షకులు మాత్రం అలా తీసుకోకపోవచ్చని, జాగ్రత్తగా మాట్లాడమని నాగార్జున.. శివాజీకి సలహా ఇచ్చారు. ఇక ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్కులో సంచాలకురాలిగా ఉన్న శోభా శెట్టి నిర్ణయం చెప్పకముందే శివాజీ అరవడం గురించి కూడా గుర్తుచేశారు. నిర్ణయం చెప్పిన తర్వాత డిఫెండ్ చేసుకోవచ్చు కానీ ముందే అరవడం అనేది వారి నిర్ణయంపై ప్రభావం చూపించినట్టు అవుతుందని అన్నారు.
నాగార్జున క్లారిటీ..
ఇక అందరినీ దాటుకుంటూ వెళ్లి యావర్.. ఎవిక్షన్ ఫ్రీ పాస్‌ను సొంతం చేసుకున్నాడు. సంచాలకురాలిగా శోభా, ప్రశాంత్‌లు తీసుకున్న నిర్ణయం ఆధారంగానే యావర్‌కు ఎవిక్షన్ ఫ్రీ పాస్ వచ్చింది. విల్లుపై బాల్స్‌ను బ్యాలెన్స్ చేసే గేమ్‌లో యావర్.. గెలవడం కరెక్టా కాదా అని ఇతర కంటెస్టెంట్స్‌ను అడగగా నియమాల ప్రకారం యావర్ సరిగా ఆడలేదని వారి అభిప్రాయాన్ని బయటపెట్టారు. ప్రత్యేకంగా అర్జున్‌ను ఈ విషయంలో తన అభిప్రాయం ఏంటి అని అడగగా.. యావర్.. బాల్స్ ఎక్కువసేపు చేతిలో పట్టుకొని ఉన్నాడని తెలిపాడు. ప్రియాంక నియమాల ప్రకారం కరెక్ట్‌గా ఆడిందని అన్నాడు. కానీ ప్రియాంక సరిగా ఆడినా కూడా ముందుగానే విల్లు వదిలేసింది కాబట్టి తను ఓడిపోయింది అని నాగార్జున క్లారిటీ ఇచ్చారు.
క్యారెక్టర్ ముఖ్యం..
అర్జున్‌తో తలపడి యావర్.. ఎవిక్షన్ ఫ్రీ పాసును గెలుచుకున్న తర్వాత అందరినీ ఓడించుకుంటూ ముందుకు వెళ్లి ఆ పాస్‌ను తను కాపాడుకోగలిగాడు. కానీ అర్జున్‌తో ఆడిన గేమ్‌తో పాటు విల్లుపై బాల్స్‌ను బ్యాలెన్స్ చేసే గేమ్‌లో కూడా యావర్ చేసిన తప్పులేంటి నాగార్జున వీడియోలు చూపించారు. దీంతో తన గేమ్ కరెక్ట్ లేదని ఎవిక్షన్ ఫ్రీ పాస్ తన దగ్గర ఉండడం కరెక్ట్ కాదని తిరిగి ఇచ్చేయడానికి యావర్ సిద్ధపడ్డాడు. యావర్ ఆ పాస్‌ను తిరిగి ఇచ్చేయడం ఎవరెవరికి కరెక్ట్ అనిపిస్తుంది అని అడగగా.. కేవలం అమర్‌దీప్, ప్రియాంక, శోభా మాత్రమే చేతులు ఎత్తారు. ఫైనల్‌గా ఆ పాస్‌ను తిరిగి ఇచ్చేస్తానని యావర్ చెప్పగా.. దానిని స్టోర్ రూమ్‌లో పెట్టమని ఆదేశించారు నాగార్జున. ఎవిక్షన్ ఫ్రీ పాస్‌కంటే క్యారెక్టర్ ముఖ్యమని యావర్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు.
ఇన్నిరోజులు ఫేక్..
కెప్టెన్సీ టాస్కులో అమర్‌దీప్ ఏడుపును కూడా నాగార్జున గుర్తుచేసుకున్నారు. తన ఎమోషన్స్‌ను కంట్రోల్‌లో పెట్టుకోమన్నారు. ప్రియాంక ఆడిన తీరుకు తనను ప్రశంసించారు. ఇక టాప్ 7గా తనను నిలబెట్టడం కరెక్ట్ కాదని, ఆ సమయంలో అర్జున్ అన్న మాటలు తనను హర్ట్ చేశాయని శోభా వాపోయింది. అర్జున్ అన్న మాటల్లో తప్పు లేదని, ఈవారం తన ఆట చూస్తే అలాగే అనిపించిందని నాగార్జున ముక్కుసూటిగా తెలిపారు. అర్జున్ సైతం ఇన్నిరోజులు ఫేక్‌గా ఉన్నాడని, ఇప్పుడిప్పుడే తనలోని కోపం బయటికి వస్తుందని, అది అలాగే ఉండనివ్వమని సలహా ఇచ్చారు నాగ్. రతికను కూడా సరిగా ఆడమంటూ మరీ మరీ గుర్తుచేశారు.
Also Read: ఆలియా భట్ కు వేధింపులు, ఎన్నోసార్లు ఏడ్చానన్న బాలీవుడ్ బ్యూటీ