Telugu Bigg Boss 7: బిగ్ బాస్ రియాలిటీ షో అనేది ప్రతీరోజు గంటపాటు ప్రసారం అవుతుంది. అయితే ఈ గంటలో ఎవరెవరు ఎంతసేపు కనిపిస్తారు? అసలు వాళ్లు ఇచ్చే కంటెంట్ ప్రేక్షకులకు రీచ్ అవుతుందా లేదా అని ప్రతీ కంటెస్టెంట్‌కు అనుమానం ఉంటుంది. ఇక బిగ్ బాస్ తాజాగా ఇచ్చిన టాస్క్ కూడా దానికి సంబంధించిందే. కంటెస్టెంట్స్ అంతా తమతో పాటు ఇతర కంటెస్టెంట్స్ కూడా గంట ఎపిసోడ్‌లో ఎంతసేపు కనిపిస్తారు అని డిసైడ్ చేసి, వారి మెడలో ఆ టైమ్ ట్యాగ్ వేసి దానికి తగిన కారణాలు చెప్పాలి. మామూలుగా ఈ టాస్క్ ముందు వారాల్లో ఇచ్చి ఉంటే కంటెస్టెంట్స్ అంతా తెగ గొడవపడేవారు. కానీ చివరివారం కావడంతో ఎక్కువగా గొడవపడకుండా సింపుల్‌గా ముగించేశారు. అయినా అమర్ మాత్రం ఇతర కంటెస్టెంట్స్ అభిప్రాయాన్ని ఒప్పుకోనని మొండిగా కూర్చున్నాడు.


అమర్‌కు పంచుల మీద పంచులు..
ముందుగా వచ్చిన అర్జున్.. తనకు తాను 10 మార్కులు ఇచ్చుకున్నాడు. ఇక అందరికంటే ఎక్కువగా 20 నిమిషాల బోర్డును అమర్‌దీప్ మెడలో వేశాడు. ఫౌల్స్ ఆడి, దొంగతనాలు చేస్తాడు కాబట్టి మెజారిటీ టైమింగ్ అమర్‌కే అని అన్నాడు. అందరితో కలిసి ఉండి, పంచాయతీలు చేస్తాడు కాబట్టి తరువాతి స్థానాన్ని శివాజీకి ఇచ్చాడు. అందరికంటే తక్కువగా 3 నిమిషాల బోర్డ్‌ను ప్రశాంత్ మెడలో వేయగా.. మరీ మూడు నిమిషాలేనా అని ప్రశాంత్ ఫీల్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన అమర్‌దీప్.. తనకు తాను 20 నిమిషాలు ఇచ్చుకున్న తర్వాత మరీ ఓవర్ అనిపిస్తుంది, నాకు తెలుసు అంటూ దానిని తీసేసి 15 నిమిషాల బోర్డ్ వేసుకున్నాడు. 20 నిమిషాలు తననే చూపిస్తారు అనుకోవడం మూర్ఖత్వం అని అన్నాడు. అర్జున్‌కు 3 నిమిషాల బోర్డ్ వేయబోయాడు అమర్. దాని వల్ల వారిద్దరి మధ్య కాసేపు ఫన్నీగా డిస్కషన్ కూడా జరిగింది. ఆ తర్వాత ప్రియాంకకు 7 మార్కుల బోర్డ్ వేశాడు. అది తాను ఒప్పుకోను అని వాదించింది. కాసేపు అలిగింది కూడా. యావర్‌కు 5 నిమిషాల బోర్డ్ వేసి కారణాలు చెప్తుండగా.. ‘‘నువ్వేమైనా ఎడిటింగ్ చేశావా ఎపిసోడ్‌ని’’ అని అర్జున్ కామెడీ చేశాడు. ‘‘ఇది కేవలం నా అంచనా’’ అని క్లారిటీ ఇచ్చాడు అమర్. 


అమర్‌కు క్లాస్ పీకిన శివాజీ..
ఆ తర్వాత వచ్చిన శివాజీ.. ఎవరూ బాధపడకూడదు అన్న ఉద్దేశ్యంతో తాను తక్కువ వేసుకుంటానని చెప్పి 10 నిమిషాల బోర్డ్ వేసుకున్నాడు. ముందుగా అమర్‌దీప్‌కు 3 నిమిషాలు ఇస్తున్నట్టు ప్రకటించాడు. ‘‘మనం ఎంతసేపు చూసినా కూడా మనం చేసిన పనులన్నీ పదేపదే చూస్తే బోర్ కొడుతుంది. గత రెండువారాలు తప్పా అంతకు ముందు నువ్వేం చేసినా కూడా ఏం చేయలేదు అనే ఫీలింగే వచ్చింది. ఎందుకింత టాలెంట్ పెట్టుకొని ఏం రోగం వచ్చింది వీడికి అని నాలో నేను చాలాసార్లు అనుకున్నాను. నువ్వు ఒక కంటెంట్ అనుకున్నావు. నేను నెగిటివ్ చేసినా అటెన్షన్ వస్తుంది అనే అభిప్రాయంలో ఉన్నావని నాకు అనిపించింది. అది నా అభిప్రాయం. నువ్వు ఒప్పుకో అని అనడం లేదు నేను’’ అని కారణం చెప్పాడు.


తనను తాను ఎంత సమర్ధించడానికి ప్రయత్నించినా.. శివాజీ మాత్రం అమర్ మాటలు ఒప్పుకోలేదు. 10వ వారం తర్వాతే ఆడడం మొదలుపెట్టావని అమర్‌తో గట్టిగా చెప్పాడు. నెగిటివ్ కంటెంట్‌ను ఎంటర్‌టైన్మెంట్ అనుకుంటున్నావని క్లాస్ పీకాడు. ఆ తర్వాత మనసు మార్చుకున్న శివాజీ.. తన మెడలో వేసుకున్న 10 నిమిషాల బోర్డ్ తీసి 5 నిమిషాల బోర్డ్ వేసుకున్నాడు. అయితే 10 నిమిషాలు తనకు ఇవ్వమని అమర్ అడిగాడు. ఇవ్వను అని తేల్చిచెప్పాడు శివాజీ. 10 నిమిషాల బోర్డ్ తీసుకొస్తుండగా.. తనకే అనుకొని అమర్ నిలబడ్డాడు. కూర్చోరా జఫ్ఫా అని ఆ బోర్డ్‌ను ప్రియాంక మెడలో వేశాడు. అది చూసిన అమర్.. ‘‘నాతోనే ఉంటుంది కదా 10 నిమిషాలు’’ అని అన్నాడు. ఆ తర్వాత యావర్, ప్రశాంత్‌లకు 15, 20 బోర్డ్స్ ఇచ్చి పంచుకోమన్నాడు. ఆ ఇద్దరు చాలామందికి ఇన్‌స్పిరేషన్ అని మరోసారి తన భజన మొదలుపెట్టాడు. అర్జున్‌కు 7 నిమిషాల బోర్డ్ వేసి అమర్‌కంటే ఎక్కువ ఎంటర్‌టైన్మెంట్ ఇవ్వగలవు అని స్టేట్‌మెంట్ ఇచ్చాడు శివాజీ. ఆ మాటకు అమర్ ఒక లుక్ ఇచ్చాడు. ‘‘నాతో క్లోజ్‌గా ఉంటే నేను ఇలాగే మాట్లాడతాను. వద్దంటే చెప్పు మాట్లడను’’ అని శివాజీ అనగానే.. ఏమైనా చేసుకో అన్నట్టుగా సైగ చేశాడు అమర్.


Also Read: ఆ పాట విని ఫ్యూజులు ఎగిరిపోయాయ్, 'నా పెట్టే తాళం' సాంగ్ పై సత్యశ్రీ షాకింగ్ కామెంట్స్