Telugu Bigg Boss 7: బిగ్ బాస్ రియాలిటీ షో అనేది రోజూ రాత్రి గంటసేపు ప్రసారం అవుతుంది. రోజు మొత్తంలో జరిగిన ఆసక్తికర విషయాలను గంట ఎపిసోడ్‌గా కట్ చేసి ప్రేక్షకుల ముందు పెడుతుంది టీమ్. అయితే ఈ గంట ఎపిసోడ్‌లో ఎవరెవరు ఎంతసేపు కనిపిస్తారు అనే విషయం కంటెస్టెంట్స్‌కు తెలియదు. అందుకే దానినే టాస్క్‌గా ఇచ్చారు బిగ్ బాస్. గంట ఎపిసోడ్‌లో ఎవరెవరు ఎంతసేపు కనిపిస్తారు అని తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేయాలి. ఇక బిగ్ బాస్ సీజన్ 7లో చివరి వారం కావడంతో టాస్కులో గొడవపడే ఛాన్స్ ఉన్నా.. ఎవరూ గొడవపడకుండా తమకు ఇచ్చిన టైమ్ కార్డ్స్‌ను సైలెంట్‌గా ధరించారు. ఇక ఈ టాస్క్‌కు సంబంధించిన ప్రోమో విడుదలయ్యింది.


ఎవరు ఎంతసేపు కనిపిస్తున్నారు..
‘‘మీ 14 వారాల జర్నీ తర్వాత మీ మొత్తం పర్ఫార్మెన్స్‌ ఆధారంగా 60 నిమిషాల ఒక ఎపిసోడ్‌లో మీరు ఎంతసేపు కనిపించడానికి అర్హులు అని భావిస్తారో వారికి ఆ టైమ్ కార్డ్ ఇచ్చి.. అందుకు తగిన కారణాల చెప్పాల్సి ఉంటుంది’’ అని బిగ్ బాస్ పంపిన సందేశాన్ని అర్జున్ చదవడంతో ఈ ప్రోమో మొదలయ్యింది. అది చదివిన వెంటనే మిగతా కంటెస్టెంట్స్‌కు టైమ్ కార్డ్స్ ఇవ్వకుండా ముందుగా తనకు తాను 10 నిమిషాల టైమ్ కార్డ్‌ను ఇచ్చుకున్నాడు. ‘‘ఓవరాల్ 60 నిమిషాల్లో 10 నిమిషాలు కనబడాలని కోరుకుంటున్నా’’ అని బయటపెట్టాడు.


ఫన్నీ టాస్కులో అమర్ సీరియస్..
ఆ తర్వాత వచ్చిన శివాజీ.. అమర్‌కు 3 నిమిషాలు ఇచ్చాడు. ‘‘3 నిమిషాలు అనే టైమింగ్ నేను అంగీకరించకలేకపోతున్నాను’’ అని రివర్స్ అయ్యాడు అమర్. ప్రియాంకకు మాత్రం 10 నిమిషాలు ఇచ్చాడు. ప్రియాంక వచ్చి ‘‘శివాజీ 20 నిమిషాలు కనిపిస్తున్నారని అనిపిస్తుంది’’ అంటూ నవ్వుతూ తనకు టైమ్ కార్డ్ ఇచ్చింది. శివాజీకి అంత ఎక్కువ టైమింగ్ ఇవ్వడంతో అమర్ ఆశ్చర్యపోయాడు. ప్రశాంత్ కూడా వచ్చి శివాజీకే 20 నిమిషాల టైమ్ కార్డ్ ఇచ్చాడు. ‘‘అది చూసి నేను ఇచ్చానని ఇస్తున్నావా’’ అని అడిగాడు. కాదని సమాధానమిచ్చాడు ప్రశాంత్. తర్వాత అమర్ వచ్చి ప్రియాంకకు 7 నిమిషాల టైమ్ కార్డ్ ఇచ్చాడు. పల్లవి ప్రశాంత్‌కు 3 నిమిషాలు ఇవ్వడంతో ‘‘ఇంత తక్కువా?’’ అని బాధగా అడిగాడు.


దొంగతనాలు, ఫౌల్ గేమ్స్..
అమర్.. తనకు తాను 15 నిమిషాలు ఇచ్చుకున్నాడు. ‘‘ఇలా ఉంటుందేమో అని నా అంచనా’’ అని దానికి కారణాన్ని చెప్పుకొచ్చాడు. శివాజీలాగానే యావర్ కూడా అమర్‌కు 3 నిమిషాలే ఇచ్చాడు. దీంతో తనతో కూడా వాగ్వాదానికి దిగాడు అమర్. కానీ మిగతావారిలాగా కాకుండా అర్జున్ మాత్రం అమర్‌కు అందరికంటే ఎక్కవ 20 నిమిషాల టైమ్ కార్డ్ ఇచ్చాడు. అది చూసి ‘‘నీకెందుకు 20 నిమిషాలు నాకు అర్థం కాలేదు ఇప్పటికీ కూడా’’ అని శివాజీ ఆశ్చర్యపోయాడు. దీంతో అసలు ఎందుకు ఇచ్చాడో అర్జున్ చెప్పుకొచ్చాడు. ‘‘వాడంటే దొంగతనాలు, ఫౌల్ గేమ్స్’’ అని చెప్తుండగానే.. అమర్ మధ్యలో జోక్యం చేసుకొని ఆపమన్నాడు. చెప్పనివ్వు అని శివాజీ తనను బెదిరించాడు. ‘‘గొప్పలు వద్దు మనకు’’ అని అమర్ అనగానే.. ‘‘గొప్పలు ఎవరు చెప్పట్లేదు. యెదవ అని చెప్తున్నాడు’’ అనడంతో కంటెస్టెంట్స్ అంతా నవ్వుకున్నారు.



Also Read: 'బిగ్ బాస్ 7' ఫినాలేకి గెస్ట్‌గా ఆ స్టార్ హీరో - ఇదే ఫస్ట్ టైమ్, ఫ్యాన్స్ పండగే!