Telugu Bigg Boss 7: బిగ్ బాస్ సీజన్ 7లో ఓటు అప్పీల్ కోసం టాస్కుల ఆడడంలో హౌజ్‌మేట్స్ అంతా బిజీగా ఉన్నారు. వీటన్నింటికి ఫన్ టాస్కులు అంటూ బిగ్ బాస్ పేరు పెట్టినా కూడా కంటెస్టెంట్స్ మాత్రం వీటిని చాలా సీరియస్‌గా ఆడుతున్నారు. అంతే కాకుండా ఈ టాస్కులు ఆడే క్రమంలో గొడవలు పడుతున్నారు కూడా. ముఖ్యంగా ‘స్పా’ బ్యాచ్, ‘స్పై’ బ్యాచ్ మధ్య మనస్పర్థలు గొడవలు ఎక్కవయిపోతున్నాయి. ఇప్పటికే ప్రసారమయిన ఎపిసోడ్‌లో అమర్‌దీప్, ప్రశాంత్ తీవ్రంగా వాగ్వాదం చేసుకోగా.. ఇప్పుడు శోభా, శివాజీల టర్న్ వచ్చిందేమో అనిపిస్తోంది. తాజాగా విడుదలయిన ప్రోమోలో వీరి గొడవే హైలెట్ అవుతోంది.


ఇప్పుడు శోభా, శివాజీల వంతు..
ప్రస్తుతం ఓటు అప్పీల్ కోసం బాల్స్ టాస్కులో పాల్గొంటున్నారు కంటెస్టెంట్స్. ఇక ఈ టాస్క్ మొదలయిన తర్వాత ముందుగా శోభా, యావర్‌ల మధ్య వాగ్వాదం జరిగింది. ఇక శోభా వల్లే యావర్ కూడా గేమ్ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రెండో రౌండ్‌లో అమర్‌దీప్, ప్రశాంత్‌లకు వాగ్వాదం జరిగింది. ఇక మూడో రౌండ్‌లో శివాజీ, శోభాల వంతు వచ్చినట్టు తాజాగా విడుదలయిన ప్రోమో చూస్తుంటే అర్థమవుతోంది. మూడో రౌండ్‌లో ఆడడం కోసం ప్రియాంక, అర్జున్, శివాజీ మిగిలారు. శోభా సంచాలకురాలిగా ఉన్నా కూడా ప్రియాంకను ఎంకరేజ్ చేస్తూ సరిగా ఆడు ప్రియాంక, ప్రియాంక అంటూ పదేపదే అరిచింది. దీంతో శివాజీకి కోపం వచ్చింది.


గేమ్ నుంచి ఔట్..
‘‘నేను ఆడనయ్యా, వద్దయ్యా’’ అంటూ గేమ్ నుంచి బయటికి వెళ్లిపోయాడు. ఎందుకు అంటూ యావర్ అడగగా.. ‘‘ఎందుకేంటి ప్రతీసారి ఆమె ప్రియాంక, ప్రియాంక అంటుంది. మేము ఆడేవాళ్లం కాదా’’ అంటూ తన జాకెట్‌ను తీసేయబోయాడు. యావర్ వెళ్లి తనను ఆపబోతుండగా.. ‘‘నేను ఔట్, బయటికి వచ్చేశాను’’ అన్నాడు. ఇదంతా వింటున్న శోభా.. ‘‘అది నా ఇష్టం. నా సపోర్ట్ నేను ఎవరికైనా చేస్తా’’ అని సమాధానమిచ్చింది. ‘‘సంచాలకురాలిగా ఉన్నప్పుడా?’’ అని శివాజీ ప్రశ్నించాడు. ‘‘సంచాలకురాలిగా ఉన్నా, శోభా అయినా అది నా ఇష్టం’’ అని శోభా ఒకేమాటపై నిలబడి ఉంది. ‘‘అందుకే బయటికి వచ్చేశాను అంతే’’ అని శివాజీ సమాధానమిచ్చాడు. 


మంచిగా మాట్లాడు..
‘‘నేను బాల్ చేతికి ఇచ్చి కొట్టమన్నానా ఏంటి?’’ అని శోభా అడిగింది. ‘‘సంచాలకురాలు అంటే అందరికీ చేయాలి’’ అని శివాజీ అన్నాడు. ‘‘నా ఇష్టం నాకు ప్రియాంకకు సపోర్ట్ చేయాలని ఉంది. చేశాను’’ అని మళ్లీ అదే మాట చెప్పింది శోభా. ‘‘ఈ అయిదు నిమిషాల్లో నువ్వు ఎన్ని మార్చుకున్నావో చూసుకో’’ అని శివాజీ సీరియస్ అయ్యాడు. ‘‘మీరు కూర్చోండి నీళ్లు తాగండి. అరిచాం కదా’’ అని వ్యంగ్యంగా మాట్లాడడం మొదలుపెట్టింది శోభా. ‘‘కొంచెం మంచిగా మాట్లాడడం అలవాటు చేసుకో. ఆ వెటకారం మానుకో’’ అని సలహా ఇచ్చాడు శివాజీ. ఇక శివాజీ అన్న మాటలకు మరింత వెటకారంగా స్పందించడం మొదలుపెట్టింది శోభా. ‘‘మీలాగా అయితే నటించడం లేదు. వామ్మో.. 80 కెమెరాల్లో ఎక్కడా కనిపించడం లేదు’’ అని గట్టిగా అరిచింది. ‘‘ఆడపిల్ల అని అడ్వాంటేజ్ తీసుకోకు మంచిది కాదు. చాలా గొప్పదానివి తల్లి’’ అనగానే.. ‘‘మీరు కూడా సార్. అయ్యయో.. బాబోయ్’’ అని మళ్లీ వెటకారంగా స్పందించింది. ‘‘ఈ అయ్యయో.. బాబోయ్‌లే.. తెలుస్తాయి తర్వాత’’ అని శివాజీ చెప్పగానే.. ‘‘మీరు నాకంటే పెద్ద..’’ అంటూ శోభా వెళ్లిపోయింది. ఇక వాదించలేని శివాజీ.. ‘‘నేను హర్ట్. నాకొద్దు’’ అంటూ సెలెంట్‌గా కూర్చున్నాడు.



Also Read: టాస్కులో ఫిజికల్ అయిన శోభా, యావర్! ఛీ, తూ అంటూ ఒకరిపై ఒకరు వ్యాఖ్యలు