‘బిగ్ బాస్’ హౌస్‌లో ఇప్పుడు రెండు గ్రూపుల మధ్య పెద్ద వార్ జరుగుతోంది. ఒక వైపు సీరియల్ బ్యాచ్, మరోవైపు శివాజీ బ్యాచ్.. ఒకరిపై ఒకరు కారాలు, మిరియాలను నూరుకుంటున్నారు. సందీప్‌తో కలిసి శోభాశెట్టి, ప్రియాంక ప్లాన్స్ చేస్తుంటే.. శివాజీ తనను సపోర్ట్ చేస్తున్న గ్రూపు సభ్యులను మోటివేట్ చేసే పనిలో నిమగ్నమయ్యాడు. అయితే, ఈ వారం నామినేషన్‌లో ఉండటాన్ని మాత్రం తట్టుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే.. ఈసారి ఆయన గ్రూపు నుంచి భోలే షావలి, అశ్వినీశ్రీలు కూడా నామినేషన్‌లో ఉన్నారు. దీంతో ఆయన నామినేషన్‌లో ఉన్నప్పుడు.. ఆ ఓట్లు తన గ్రూపు సభ్యులకు పడే అవకాశం తక్కువని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే, తనని నామినేట్ చేయడానికి సీరియల్ బ్యాచ్ చెప్పిన కారణాలు కూడా నచ్చడం లేదనిపిస్తోంది. వారంతా ఒక స్ట్రాటజీతో హౌస్‌లో ఉంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. 


బుధవారం టెలికాస్ట్ అయిన తాజా ఎపిసోడ్‌లో శివాజీ.. మరోసారి సీరియల్ బ్యాచ్ మీద పరోక్షంగా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘‘నామినేషన్స్ అనేసరికి ఎవరినైనా తిడితే.. హీరో అవుతామనే ఫీలింగ్స్‌తో రకరకాలుగా బీహేవ్ చేస్తున్నారు. ఇలాంటి ఫీలింగ్స్‌తో.. ఏమీ లేకపోయినా ఎగిరిఎగిరి పడుతున్నాయి కొన్ని విస్తరాకులు. ఇది ఒక గొప్ప హౌస్. నామినేషన్ అనేది తెలివైన ప్రక్రియ. ఈ ప్రక్రియను అపహాస్యం చేస్తు్న్నారు ఇక్కడ. ఇది మాత్రం నిజం. ఒక స్ట్రాటజీతో వచ్చారని మొదటివారమే గమనించాను. దానికి నేను కట్టుబడి ఉన్నా. ఎవరు అడిగినా చెబుతా’’ అని పేర్కొన్నాడు. అయితే, ఇందుకు రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి కెప్టెన్సీ కంటెండర్‌షిప్ నుంచి అమర్ దీప్ ఆయన్ని తప్పించడం. రెండోది.. నామినేషన్స్‌లోకి లాగడం. ఇవి శివాజీకి నిద్రలేకుండా చేస్తున్నాయి. అందుకే, అలాంటి వ్యాఖ్యలతో ప్రేక్షకులను ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. 


శోభాను వెంటాడుతున్న నామినేషన్స్ భయం


మరోవైపు సీరియల్ బ్యాచ్‌కు చెందిన శోభాశెట్టి కూడా నామినేషన్స్‌పై ఆందోళన చెందుతోంది. ఈ సందర్భంగా తేజా దగ్గర తన బాధను వ్యక్తం చేసింది. ‘‘నేను శివాజీతో బాగానే మాట్లాడుతున్నా. ఆయన అంటే నాకు ఎప్పుడూ గౌవరమే. నేను రాంగ్‌గా బిహేవ్ చేస్తున్నానా?’’ అని తేజాను అడిగింది. ఇక్కడ సిల్లీ థింగ్స్‌కు స్పందించకూడదని అనుకున్నా. నాకు బయట చాలా గౌరవం ఉంది. కానీ, ఇక్కడ ఎవరో వచ్చిన వ్యక్తి.. నన్ను మెంటల్ అంటుంటే బాధేసింది. ఆ తర్వాత ‘‘నాకు ఇంక పెళ్లికాదు’’ అని సరదాగా అన్నది. దీంతో తేజా స్పందిస్తూ.. ‘‘మన ఈడు, జోడు బాగుంది’’ అని అన్నాడు. దీంతో శోభా.. ‘‘నీకు మనసు లేదు. మావాడికి ఉంది. మా వాడు ఇప్పటివరకు తిట్టలేదు. కొట్టలేదు’’ అని తెలిపింది. 


భోలే గురించే చర్చంతా


నామినేషన్స్‌లో భోలే షావలి తీరును సీరియల్ బ్యాచ్ ఇంకా మరిచిపోలేకపోతున్నారు. ఈ సందర్భంగా సందీప్ మాట్లాడుతూ.. ‘‘ఎదుటివారిని మాట్లాడనివ్వకుండా ఓవర్ ల్యాప్ చేయడం వారి ప్లాన్’’ అని అన్నాడు. శోభ మాట్లాడుతూ.. ‘‘భోలే ఒక వేస్ట్ క్యాండిడేట్’’ అని పేర్కొంది. ప్రియాంక మాట్లాడుతూ.. ‘‘భోలే అమర్ దీప్‌ మొదటి వారమే వెళ్లిపోవల్సినవాడు’’ అని అంటున్నాడు. దీంతో అమర్ దీప్ స్పందిస్తూ.. ‘‘నన్ను తీసి పక్కన పెట్టేయాలనేది వారి వ్యూహం’’ అని అన్నాడు. బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో ‘బిగ్ బాస్’ మారథన్ జరిగింది. ఇందులో మొదటి స్థానంలో నిలిచేవారు కెప్టెన్సీ టాస్క్‌కు అర్హులు అవుతారని ‘బిగ్ బాస్’ తెలిపాడు. ఈ సందర్భంగా నిర్వహించిన ఫ్లోటింగ్, సింకింగ్ టాస్క్‌లో ప్రియాంక విజేతగా నిలిచింది. శోభాశెట్టి, తేజ తర్వాతి స్థానాల్లో నిలిచారు. అమర్‌దీప్ ఓడిపోయాడు. దీంతో ఆ రాత్రంతా భోజనం చేయకుండా ఏడుస్తూ కూర్చున్నాడు. బిగ్ బాస్ కూడా అమర్‌ను ఓదార్చాడు. 


తేజా, ప్రియాంకలతో గొడవపడిన శోభశెట్టి 


బాక్సుల టాస్కులో ప్రశాంత్ విన్నర్‌గా నిలిచాడు. యావర్, గౌతమ్‌లు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు. రతికగా ఓడిపోయింది. ఓటమి బాధలో ఉన్న రతిక దగ్గరకు వెళ్లిన తేజా.. నువ్వు కూడా ఆహారం మానేసి బిగ్ బాస్‌తో మాట్లాడు అని జోక్ చేశాడు. ఆ మాటలు విన్న శోభాశెట్టి.. తేజాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అమర్ తాను ఓడిపోయాననే బాధలో ఉన్నప్పుడు.. అతడిపై ఇలా జోక్ చేయడం బాగోలేదంటూ తేజాతో గొడవపడింది. దీంతో తేజా.. శోభాశెట్టిపై అరిచాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసిపోయారు. కిచెన్‌లో గౌతమ్, ప్రియాంక, భోలే పాటలు పాడుకుంటున్న టైమ్‌లో శోభాశెట్టి వారిని పిలిచింది. ఎంత పిలిచినా పలకడం లేదంటూ ప్రియాంక, గౌతమ్‌లపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ప్రియాంక కూడా చిన్న విషయానికి ఎందుకంత కోపం పడుతున్నావంటూ శోభాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 


Also Read : అనసూయ ‘జబర్దస్త్’ను వదిలేయడానికి కారణం అది కాదు, అతనిపై స్కిట్ చేయడమే నా తప్పు: అదిరే అభి