Priyanka Jain: బిగ్ బాస్ సీజన్ 7లో టైటిల్ విన్నర్‌గా రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ నిలిచాడు. రన్నర్‌ స్థానంలో అమర్‌దీప్ ఉన్నాడు. అయితే రన్నర్‌గా శివాజీ ఉండాలని, స్పై బ్యాచ్‌కు అన్యాయం జరిగిందని పలువురు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్‌కు కోపం వచ్చింది. అందుకే ఫైనల్స్ అయిపోయి బయటికి రాగానే అమర్‌దీప్ కారుపై దాడి చేయడం మొదలుపెట్టారు. అమర్‌దీప్ మాత్రమే కాదు.. అశ్విని, గీతూ కార్లపై కూడా దాడులు జరిగాయి. అంతే కాకుండా విచక్షణ కోల్పోయిన ఫ్యాన్స్.. ఆర్టీసీ బస్సులపై కూడా దాడిచేసి, అద్దాలను ధ్వంసం చేశారు. పల్లవి ప్రశాంత్‌ అరెస్టుకు ముందు తన చానెల్‌లో ఇచ్చిన ఇంటర్వ్యూలో అమర్ దీప్ ఘటనపై ప్రియాంక స్పందించింది. ఈ గొడవపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.


దాడులు చేయడం కరెక్ట్ కాదు


ఫ్యాన్స్ పేరుతో ఇలా గొడవలు చేయడం, దాడులు చేయడం కరెక్ట్ కాదని తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది ప్రియాంక. నచ్చకపోతే వ్యతిరేకించడంలో తప్పు లేదు. కానీ ఇలా దాడులు చేయడం మాత్రం చాలా తప్పని ఆ సంఘటనను ఖండించింది. ఎవరైనా కష్టపడి ఒక వస్తువును కొన్నప్పుడు, అది కొన్నిక్షణాల్లోనే వారికి దూరం చేయడం అస్సలు కరెక్ట్ కాదని చెప్పింది. కారుపై దాడి చేస్తున్నప్పుడు అందులో మహిళలు ఉన్నారనే విషయం కూడా మర్చిపోతే ఎలా అని అమర్ కారుపై దాడి జరిగిన సమయంలో తన కారులో తనతో పాటు తల్లి, భార్య కూడా ఉన్నారనే విషయాన్ని మర్చిపోతే ఎలా అని ప్రశ్నించింది ప్రియాంక.


టాస్క్ అయిపోగానే అందరం ఒక్కటే


బిగ్ బాస్ హౌజ్‌లో కంటెస్టెంట్స్ గొడవపడడమే ఆడియన్స్‌కు ఫన్. ఒక్కొక్కసారి ఆ గొడవల వల్ల కంటెస్టెంట్స్ హర్ట్ అవుతూ ఉంటారు. కానీ అదే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ కంటెస్టెంట్స్ ఫ్యాన్స్ వచ్చి మరో కంటెస్టెంట్‌పై దాడి చేస్తే ఎలా ఉంటుందో తెలియడానికి తాజాగా జరిగిన సంఘటనే ఉదాహరణ. ఇక హౌజ్‌లో జరిగే గొడవల గురించి కూడా బయటపెట్టింది ప్రియాంక. హౌజ్‌లో గేమ్ పరంగా తమలో తమకు చాలా గొడవలు అయ్యాయని గుర్తుచేసుకుంది. కానీ టాస్క్ అయిపోగానే ప్రశాంత్, శివాజీ, అమర్‌దీప్, యావర్.. ఇలా అందరూ కలిసే ఉండేవాళ్లని తెలిపింది. ముఖ్యంగా చివరి నాలుగు వారాల్లో తమ్ముడిగా పల్లవి ప్రశాంత్‌తో తన బాండింగ్ ఇంకా పెరిగిందని చెప్తూ.. నిజంగానే ప్రశాంత్ భూమిబిడ్డ అని స్టేట్‌మెంట్ ఇచ్చింది. ఫైనల్స్ అయిపోయిన వెంటనే ప్రియాంక పాల్గొన్న ఇంటర్వ్యూలో ఈ విధంగా మాట్లాడింది.


చంచల్‌గూడ జైలులో..


బిగ్ బాస్ సీజన్ 7 ఫైనల్స్ రోజు స్టూడియోస్ బయట జరిగిన గొడవకు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్సే కారణమని, అంతే కాకుండా తాము చెప్పినా వినకుండా ప్రశాంత్.. శాంతిభద్రతలకు భంగం కలిగించాడని సూమోటోగా పోలీసులు తనపై కేసు నమోదు చేసుకున్నారు. కేసు నమోదు చేసిన తర్వాత తను పరారీలో ఉన్నాడని ప్రచారం సాగింది. కానీ అలాంటిది ఏమీ లేదని తాను ఇంట్లోనే ఉన్నానని ఒక వీడియో విడుదల చేసి చెప్పాడు ప్రశాంత్. దీంతో పోలీసులు వెళ్లి తనను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం బెయిల్ రిజెక్ట్ అవ్వడంతో పల్లవి ప్రశాంత్.. చంచల్‌గూడ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు.


Also Read: శ్రీకాంత్ కజిన్‌ను పెళ్లి చేసుకున్నా, ఆ అర్హత నాకు లేదు - అనిత చౌదరి