Pallavi Prashanth: ‘బిగ్ బాస్ సీజన్ 7’లో వచ్చినవారంతా సీరియల్స్‌లో, సినిమాల్లో లేదా సోషల్ మీడియా, యూట్యూబ్ ద్వారా ప్రేక్షకులకు పరిచయమయినవారే. కానీ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అయినా.. ఒక కామన్ మ్యాన్‌గా, రైతుబిడ్డగా ‘బిగ్ బాస్ సీజన్ 7’లోకి అడుగుపెట్టాడు పల్లవి ప్రశాంత్. అసలు తను ఈ షోలోకి ఎంటర్ అయినప్పుడు తను ఎవరు, బ్యాక్‌గ్రౌండ్ ఏంటి, ఎలా ఆడతాడు అని ప్రేక్షకులంతా అనుకున్నారు. కానీ బరిలోకి దిగిన తర్వాత శారీరికంగానే కాదు.. మానసికంగా కూడా పల్లవి ప్రశాంత్ అంటే ఏంటో అందరికీ తెలిసింది. ఎవరికి తెలియని వ్యక్తి నుంచి ఇప్పుడు ‘బిగ్ బాస్ సీజన్ 7’ ట్రోఫీకి చేరువలో ఉన్నాడు ప్రశాంత్. ఇక తన గురువు శివాజీని దాటి టైటిల్ విన్నర్ అవ్వడం మాత్రమే మిగిలింది.


ఫోకస్ అంటే ప్రశాంత్


బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంటర్ అయిన తర్వాత అందరూ తనకంటే భిన్నంగా ఉన్నారని, తనతో ఎవరూ సరిగా మాట్లాడడం లేదని, కలిసిపోవడం లేదని ఫీల్ అయ్యేవాడు పల్లవి ప్రశాంత్. అదే సమయంలో తనకు శివాజీ దగ్గరయ్యాడు. ప్రతీ విషయంలో ప్రశాంత్‌ను ముందుండి నడిపిస్తూ ఉండేవాడు. ప్రశాంత్ ఏం చేసినా.. దాని వెనుక శివాజీ ప్రభావం ఉంటుందని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు.


కానీ ఎవరు ఎంత ఎంకరేజ్ చేసినా.. ఆట అనేది కంటెస్టెంట్ చేతిలోనే ఉంటుంది కదా.. అందుకే టాస్కుల విషయంలో అందరికీ గట్టి పోటీ ఇచ్చాడు పల్లవి ప్రశాంత్. పట్టుదలతో ఆడాలన్నా, గేమ్‌పై ఫోకస్ పెట్టాలన్న ప్రశాంత్ ముందుంటాడు అని అందరూ అనుకున్నారు. కంటెస్టెంట్స్ సైతం ప్రశాంత్‌కు గేమ్‌పై ఫోకస్ ఎక్కువ అని ప్రశంసించారు. అదే ఫోకస్‌తో ‘బిగ్ బాస్ సీజన్ 7’లో కెప్టెన్ అయ్యాడు, పవర్ అస్త్రా సాధించుకున్నాడు.


ఇక ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం జరిగిన పోటీలో కూడా తానే విన్ అయ్యాడు. పల్లవి ప్రశాంత్‌కు గేమ్ ఎలా ఆడాలో తెలుసు, ఎటూ డైవర్ట్ అవ్వకుండా ఎలా స్ట్రాంగ్‌గా ఉండాలో తెలుసు అని ప్రేక్షకులు అనుకునేలా చేశాడు. అందుకే తన పట్టుదల చూసి చాలామంది ఇంప్రెస్ అయ్యి.. తనకే ఓట్లు వేయడం మొదలుపెట్టారు. టాస్కుల్లో బలమైన గాయాలైనా సరే తగ్గేదేలే అంటూ ముందుకు సాగాడు ప్రశాంత్. మైండ్ గేమ్స్‌కు దూరంగా ఉంటూ తన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు.


రైతుబిడ్డ అంటూ రతికపై ఫోకస్


‘బిగ్ బాస్ సీజన్ 7’లో ముందుకు వెళ్లడానికి పల్లవి ప్రశాంత్.. ‘రైతుబిడ్డ’ అనే పదాన్ని ఉపయోగించినట్టు పలువురు ప్రేక్షకులు ఫీల్ అవుతూ ఉంటారు. తను హౌజ్‌లోకి ఎంటర్ అయినప్పటి నుండే తను రైతుబిడ్డ అని పదేపదే చెప్పడంతో పలువురు ప్రేక్షకులు తనకు కనెక్ట్ అయినా.. మరికొందరు మాత్రం సింపథీ కోసం ఆ పదాన్ని ఉపయోగిస్తున్నాడని అనుకున్నారు.


శివాజీ మంచి మాటలు చెప్తున్నాడని, గైడ్ చేస్తున్నాడని.. తన అడుగుజాడల్లో నడవడం కరెక్టే అయినా.. కొన్నిసార్లు శివాజీ ఏం చెప్పినా గుడ్డిగా ఫాలో అయిపోయాడు ప్రశాంత్. అదంతా తన ఫ్యాన్స్‌కు కూడా నచ్చలేదు. తన వరకు వస్తే గొడవలు పడడానికి ఎవరైనా సిద్ధంగా ఉంటారు. కానీ ప్రశాంత్ మాత్రం నామినేషన్స్‌లో తప్పా మిగతా సమయాల్లో ఎవరితో గొడవపడే కాదు.. అదే కారణంగా చెప్పి అమర్‌దీప్ తనను పలుమార్లు నామినేట్ చేశాడు కూడా.


ఇక హౌజ్‌లోకి ఎంటర్ అవ్వగానే రతికతో లవ్ ట్రాక్ వల్ల పల్లవి ప్రశాంత్‌పై ప్రేక్షకుల్లో నెగిటివ్ అభిప్రాయం ఏర్పడింది. రైతుబిడ్డ అని వచ్చి గేమ్‌పై ఫోకస్ పెట్టకుండా.. రతికపై ఫోకస్ పెట్టాడని అందరూ ట్రోల్స్ చేశారు. కానీ ప్రశాంత్.. తన తప్పును తాను త్వరగానే తెలుసుకున్నాడు. ఇప్పుడు పూర్తిగా గేమ్‌పైనే ఫోకస్ పెట్టి ‘బిగ్ బాస్ సీజన్ 7’ టైటిల్ విన్నర్ అవ్వడానికి ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. పల్లవి ప్రశాంత్ ట్రోపీ గెలుచుకున్నాడని తెలిసింది. అయితే, ఇది ఎంతవరకు నిజమేనేది రేపటి ఫినాలే ఎపిసోడ్‌లోనే తెలుస్తుంది.


Also Read: శేష్, శృతి... ఆ పరదాలు తొలగించేది ఎప్పుడంటే?