Telugu Bigg Boss 7: బిగ్ బాస్ సీజన్ 7లో ఫైనల్స్‌కు ఇంకా ఒకరోజే సమయం ఉంది. ఇంతకు ముందు జరిగిన బిగ్ బాస్ సీజన్స్‌లో ఈ సమయానికి మాజీ కంటెస్టెంట్స్ వచ్చి హౌజ్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌ను పలకరిస్తారు. కానీ ఈసారి అలా జరగలేదు. కంటెస్టెంట్స్‌కు కాసేపు ఫన్ ఇవ్వడం కోసం, తన తరువాతి షోను ప్రమోట్ చేయడం కోసం శ్రీముఖి.. బిగ్ బాస్ హౌజ్‌లోకి వచ్చింది. కాసేపు కంటెస్టెంట్స్‌తో ఆటలు ఆడించి, పాటలు పాడించి ప్రేక్షకులను నవ్వించింది. దానికి సంబంధించిన ప్రోమో విడుదల కాగా.. తాను అశ్వినిని పెళ్లి చేసుకుంటానని స్టేట్‌మెంట్ ఇచ్చి అందరినీ షాక్‌కు గురిచేశాడు యావర్.


బిగ్ బాస్ హౌజ్‌లో సింగింగ్ ఆడిషన్స్


శ్రీముఖి.. బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంటర్ అవ్వగానే కంటెస్టెంట్స్ అంతా తనకు హగ్ ఇచ్చి వెల్‌కమ్ చెప్పారు. లోపలికి రాగానే.. ‘‘వెల్‌కమ్ టు బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టా’’ అని చెప్పింది శ్రీముఖి. ‘‘బిగ్ బాస్ సీజన్ 7 పూర్తయిన వెంటనే వచ్చేవారమే సూపర్ సింగర్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేస్తున్నాం. మీలో ఒక చిన్న సింగింగ్ ఆడిషన్ చేద్దామని అనుకుంటున్నాను’’ అని చెప్పింది. ‘‘ప్రశాంత్ ప్లీజ్ ఇదొక ఫన్ టాస్క్.. ఓడిపోతే హగ్ ఇస్తా. గెలిస్తే గట్టి హగ్ ఇస్తా. ఓకేనా’’ అంటూ ఆఫర్ ఇచ్చింది. దీంతో ప్రశాంత్ తెగ సంబరపడిపోయాడు. ముందుగా సింగింగ్ ఆడిషన్స్‌ కోసం అమర్‌దీప్ ముందుకొచ్చాడు.


పాట మర్చిపోయిన అమర్


తన ఫేవరెట్ హీరో రవితేజ పాటను పాడడం మొదలుపెట్టాడు అమర్‌దీప్. ‘గోంగూర తోటకాడ కాపుకాసా’ అని మొదలుపెట్టి మధ్యలో లిరిక్స్ మర్చిపోయి ఏం చేయాలో తెలియక నిలబడ్డాడు. దీంతో కంటెస్టెంట్స్ అంతా నవ్వుకున్నాడు. ఇంతలోనే ‘‘నీ కోరికలన్నీ చెప్తున్నట్టు ఉంది కానీ పాట పడినట్టు లేదురా’’ అని మధ్యలో దూరి కౌంటర్ ఇచ్చాడు అర్జున్. ఆ తర్వాత తనే పాడడానికి ముందుకొచ్చాడు. ‘కెవ్వు కేక’ పాటను అర్జున్ పాడుతుండగా.. మిగతా కంటెస్టెంట్స్‌తో పాటు శ్రీముఖి కూడా కోరస్ ఇచ్చింది. పాటతో పాటు రెండు స్టెప్పులు కూడా వేశాడు అర్జున్. యావర్.. ప్రియాంకను ఎత్తుకొని తిప్పడం కూడా ఈ ప్రోమోలో చూపించారు.


నిజాన్ని బయటపెట్టిన యావర్


సింగింగ్ ఆడిషన్స్ పూర్తయిన తర్వాత కంటెస్టెంట్స్‌తో ‘ట్రూథ్ ఆర్ డేర్’ ఆడించింది శ్రీముఖి. బాటిల్ యావర్‌వైపు ఆగింది. దీంతో తనను ఒక ప్రశ్న అడిగింది. ‘‘ముగ్గురు నుంచి ఒకరిని డేట్, ఒకరిని కిల్, ఒకరిని పెళ్లి చేసుకోవాలంటే ఎవరి పేర్లు చెప్తావు’’ అని కొన్ని ఆప్షన్స్ ఇచ్చింది. దానికి సమాధానంగా అశ్వినిని పెళ్లిచేసుకుంటానని అన్నాడు యావర్. ఆ సమాధానం విని శ్రీముఖితో పాటు మిగతా కంటెస్టెంట్స్ కూడా ఆశ్చర్యపోవడంతో పాటు యావర్‌ను ఆటపట్టించారు. ఆ గేమ్ తర్వాత తానొక పాట వినిపిస్తానని, అదేంటో గెస్ చేయాలని మరో టాస్క్ ఆడించింది శ్రీముఖి. ముందుగా అమర్, పల్లవి ప్రశాంత్ పోటీలోకి దిగారు. తమకు వినిపించింది ‘పుష్ప’లోని ‘శ్రీవల్లి’ పాట అని కరెక్ట్‌గా గెస్ చేశాడు ప్రశాంత్. దీంతో అందరు కలిసి శ్రీవల్లి పాటకు స్టెప్పులేశారు. ఇక ఈ ప్రోమో చూస్తుంటే శ్రీముఖి వచ్చి బోరింగ్‌గా ఉన్న బిగ్ బాస్ హౌజ్‌లో కాస్త ఫన్ క్రియేట్ చేసిందని ప్రేక్షకులు అనుకుంటున్నారు.



Also Read: బిగ్ బాస్ సీజన్ 7 ఫైనల్స్‌కు గ్రాండ్‌గా ఏర్పాట్లు - ఎన్నో సర్ప్రైజ్‌లతో!