బిగ్ బాస్ సీజన్ 7లో అయిదు వారాల వరకు కంటెస్టెంట్స్ తామేంటో ప్రేక్షకులకు చూపించారు. అంతే కాకుండా తామేంటో తోటి కంటెస్టెంట్స్‌కు కూడా చూపించారు. అయితే బయట నుండి పరిచయం లేకపోయినా.. బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంటర్ అయిన తర్వాతే ఒకరినొకరు కలుసుకున్నారు. అప్పుడే ఒకరిపై ఒకరు అభిప్రాయాలు ఏర్పరుచుకున్నారు. అలాంటి సమయంలోనే కంటెస్టెంట్స్ మధ్య విబేధాలు, మనస్పర్థలు వచ్చాయి. అందుకే గొడవలు కూడా మొదలయ్యాయి. అయితే అయిదు వారాలు కలిసి ప్రయాణం చేసిన తర్వాత అసలు బిగ్ బాస్‌‌లో ఏ ముగ్గురు కంటెస్టెంట్స్‌ను అనర్హులు అని అనుకుంటున్నారో చెప్పమని ప్రతీ కంటెస్టెంట్‌ను అడిగారు నాగార్జున. దీంతో కంటెస్టెంట్స్ అంతా తమ తమ అభిప్రాయాలను బయటపెట్టారు.


ఆ ముగ్గురే అనర్హులు..
బిగ్ బాస్ హౌజ్‌లో ఎక్కువగా అనర్హులు అంటూ అమర్‌దీప్, గౌతమ్, టేస్టీ తేజకే ఓట్లు పడ్డాయి. చాలామంది కంటెస్టెంట్స్ ఈ ముగ్గురినే అనర్హులుగా ప్రకటించారు. అమర్‌దీప్ అయితే ఓటమిని ఒప్పుకోలేడని, ఎవరైనా తనను ఏదైనా అంటే వెంటనే రియాక్ట్ అవుతాడని ప్రేక్షకులు కూడా గమనిస్తూనే ఉన్నారు. మొదట్లో అమర్‌దీప్ ప్రవర్తనే అంతా అనుకున్న ప్రేక్షకులకు కూడా మెల్లగా తన వల్ల విసుగు వచ్చింది. ఇక తాజాగా జరిగిన కెప్టెన్సీ టాస్క్‌లో అయితే తన బడ్డీ సందీప్‌తో కలిసి ఎన్నో తప్పులు చేశాడు అమర్‌దీప్. తప్పు చేయడం మాత్రమే కాకుండా.. వాటిని సమర్ధించుకుంటూ ఇతర కంటెస్టెంట్స్‌పై అరిచాడు. నాగార్జున వచ్చి తన తప్పులను ఎత్తిచూపగా సారీ చెప్పాడు. చాలామంది అమర్ ప్రవర్తన నచ్చక తనను అనర్హుడు అని ప్రకటించారు.


విచక్షణ లేని కోపం..
ఒకప్పుడు గౌతమ్ అంటే కూల్ అనుకున్నారు కంటెస్టెంట్స్ అంతా. కంటెస్టెంట్స్ మాత్రమే కాదు.. ప్రేక్షకులు కూడా అలాగే అనుకున్నారు. కానీ మెల్లగా గౌతమ్‌లోని మరో కోణం బయటికొచ్చింది. విచక్షణ లేని కోపం చూపించడం మొదలుపెట్టాడు. మొదట్లో అసలు గౌతమ్‌కు కోపం ఉండేదా అన్నట్టు ఉండేది తన ప్రవర్తన. కానీ ఇప్పుడు గౌతమ్‌కు కోపం వస్తే.. ఏం చేస్తాడో, ఏం మాట్లాడతాడో అన్నట్టుగా అయిపోయింది పరిస్థితి. అంతే కాకుండా చాలా సందర్భాలు మాటలు మార్చడం, ఏమార్చడం లాంటివి చేసి అందరి ముందు దొరికిపోయాడు కూడా. ఇలా కోపంతో తన విచక్షణను కోల్పోతున్న కారణంగా గౌతమ్‌ను చాలామంది కంటెస్టెంట్స్ అనర్హుడిగా ప్రకటించారు.


ఎంటర్‌టైన్మెంట్ అంటేనే తేజ..
బిగ్ బాస్ సీజన్ 7లో అందరికంటే ఎక్కువగా ప్రేక్షకులను, ఇతర కంటెస్టెంట్స్‌ను ఎంటర్‌టైన్ చేసే కంటెస్టెంట్ ఎవరు అని టక్కున గుర్తొచ్చే పేరు టేస్టీ తేజ. తనను ఎవరు ఎన్ని మాటలు అంటున్నా కూడా తేజ కూల్‌గానే డీల్ చేస్తాడు. తనలో తప్పు అని ఎత్తు చూపడానికి పెద్దగా పాయింట్స్ లేవు. కానీ ఫిజికల్ టాస్కుల విషయంలో తేజ అసలు పూర్తిస్థాయి పర్ఫార్మెన్స్ ఇవ్వడం లేదు అనే కారణంతో ఇప్పటికే చాలాసార్లు నామినేట్ అయ్యాడు. ఇప్పుడు కూడా అదే కారణంతో తనను అనర్హుడిగా ప్రకటించారు కంటెస్టెంట్స్. ఆఖరికి కెప్టెన్సీ టాస్క్ మొత్తంతో తనకు బడ్డీగా ఉన్న యావర్ కూడా తేజ ఫిజికల్‌గా బలంగా లేడనే కారణంతోనే తనను అనర్హుడని ముద్రవేశాడు.


Also read: అక్షయ్ కుమార్ పరువు తీసిన 'మిషన్ రాణిగంజ్' - ఫస్ట్ డే మరీ అంత తక్కువా?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial