బిగ్ బాస్ సీజన్ 7లో నామినేషన్స్ సెగ కాస్త తగ్గినట్టే అనిపిస్తోంది. నామినేషన్స్ తర్వాత ఆ కారణంతో ఎందుకు నామినేట్ చేశావ్, నన్ను ఎందుకు నామినేట్ చేశావ్ అంటూ గొడవలు పెట్టుకున్న కంటెస్టెంట్స్ మళ్లీ కలిసిపోయినట్టుగా నేడు (సెప్టెంబర్ 6) ప్రసారం అయిన ఎపిసోడ్‌లో కనిపించింది. చాలావరకు ఈరోజంతా హౌజ్‌మేట్స్ అంతా.. ఒకే దగ్గర కూర్చొని కబుర్లు చెప్పుకున్నారు. సరదాగా మాట్లాడుకున్నారు. ఇక బిగ్ బాస్ హౌజ్‌లో ఒకరితో ఒకరు కబుర్లు చెప్పుకోవడం తప్పా.. కంటెస్టెంట్స్‌కు వేరే టైమ్‌పాస్ అంటూ ఏమీ ఉండదు. అందుకే టేస్టీ తేజతో కలిసి అమ్మాయిలంతా ఒక ఫన్ యాక్టివిటీని చేశారు. 


ఇమ్యూనిటీ టాస్క్‌తో మొదలు..
బిగ్ బాస్ సీజన్ 7లోకి మూడోరోజు ప్రారంభంలోని కంటెస్టెంట్స్‌తో మాటలు కలిపారు బిగ్ బాస్. సీజన్ అంతా ఉల్టా పుల్టాగా సాగుతుందని కంటెస్టెంట్స్‌కు ఇప్పటికే క్లారిటీ వచ్చుంటుంది అని బిగ్ బాస్ క్లారిటీ ఇచ్చారు. అంతే కాకుండా ఈ ఉల్టా పుల్టా సీజన్‌లో మొదటి టాస్క్‌కు సిద్ధంగా ఉండాలంటూ ముందుగానే సమాచారమిచ్చారు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్న 14 మంది హౌజ్‌మేట్స్ కాదని, కంటెస్టెంట్స్ మాత్రమే అని మరోసారి గుర్తుచేశారు. ఇమ్యూనిటీ టాస్క్ గురించి అందరికీ వివరించారు. ఈ టాస్క్ గెలిచిన వారు అయిదు వారాల పాటు ఇమ్యూనిటీ పొందుతారని చెప్పడంతో కంటెస్టెంట్స్ అంతా ఈ టాస్క్ గెలవడం కోసం ఎవరి ప్లాన్స్ వారు వేసుకోవడం మొదలుపెట్టారు. ఇక ఆ టెన్షన్‌ను కాసేపు పక్కన పెట్టి టేస్టీ తేజతో కాసేపు ఫన్ క్రియేట్ చేశారు అమ్మాయిలు.


క్యూట్‌గా రెడీ చేశారు..
టేస్టీ తేజకు మేకప్ వేయాలని డిసైడ్ అయ్యింది శుభశ్రీ. అయితే అలా ఎందుకు డైరెక్ట్ లిప్ షేప్ వేసేయ్ అంటూ ఇన్‌డైరెక్ట్‌గా తనను ముద్దు అడిగాడు తేజ. ఇక తేజ, శుభశ్రీ కలిసి చేస్తున్న ఈ ఫన్ యాక్టివిటీలో రతిక, గౌతమ్ కృష్ణ కూడా జాయిన్ అయ్యారు. తేజను రెడీ చేస్తున్న రతిక.. ‘‘నువ్వు బాగుంటావని నీకు ఎవరైనా చెప్పారా’’ అంటూ సరదా ప్రశ్న వేసింది. దీంతో అందరూ నవ్వుకున్నారు. హార్ట్ కావాలి అని తేజ అడిగినందుకు తన బుగ్గపై హార్ట్ షేప్ గీసింది శుభశ్రీ. టేస్టీ తేజను పూర్తిగా రెడీ చేసిన తర్వాత ‘హీ ఈజ్ సో క్యూట్’ అంటూ పాట పాడారు అమ్మాయిలు. అదే సమయంలో షకీలా వచ్చింది.


తేజ బుగ్గపై షకీలా ముద్దు..
అలా రెడీ అయిన తర్వాత తేజ చాలా బాగున్నాడంటూ నుదుటిపై తనకు ముద్దుపెట్టింది షకీలా. అప్పుడు డైరెక్ట్ లిప్‌స్టిక్ ఇవ్వమను అని శుభశ్రీని ఉద్దేశిస్తూ షకీలాకు చెప్పాడు తేజ. లిప్‌స్టిక్‌తో గీస్తానని శుభశ్రీ లిప్‌స్టిక్ అందుకోబోతుండగా.. తేజ వద్దన్నాడు. ఈ సంభాషణ అంతా షకీలాకు కాసేపటి వరకు అర్థం కాలేదు. అసలు ఏంటో తనకు అర్థమయ్యేలా చెప్పాడు తేజ. దీంతో తనే స్వయంగా తేజ బుగ్గపై ముద్దుపెట్టి డైరెక్ట్ లిప్‌స్టిక్‌ను ఇచ్చింది. దీంతో అక్కడ ఉన్నవారంతా గోల చేస్తూ నవ్వారు. అయితే, తేజా.. తనకు దేవుడిచ్చిన కొడుకు అని షకీలా వెల్లడించింది. బిగ్ బాస్ సీజన్ 7లోకి ఎంటర్ అయినప్పటి నుండే నవ్వులు పూయిస్తున్న తేజ.. ఎవరు తన మీద జోకులు వేసినా.. సరదాగా తీసుకుంటూ తాను నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ప్రేక్షకుల దగ్గర కూడా మార్కులు కొట్టేస్తున్నాడు. కానీ తను అలా సరదాగా ఉండడం కూడా కొందరు కంటెస్టెంట్స్‌కు నచ్చడం లేదని వారి ప్రవర్తన చూస్తే తెలుస్తోంది.


Also Read: ‘బిగ్ బాస్‌’ కంటెస్టెంట్స్‌కు ఓటు ఎలా వేయాలి? ఈసారి రూల్ మారింది


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial