Telugu Bigg Boss 7: ప్రతీ బిగ్ బాస్ సీజన్‌లో టాప్ 5 కంటెస్టెంట్స్.. ఫైనల్స్‌కు, ట్రోఫీకి ఒక్క అడుగు దూరంలో ఉండగానే.. బిగ్ బాస్ తమకు ఒక సూట్‌కేసు పంపి అందులో కొంత డబ్బును పెట్టి.. ఆ డబ్బు తీసుకొని ఏ కంటెస్టెంట్ అయినా అప్పటికప్పుడు బిగ్ బాస్ హౌజ్‌ను వదిలి వెళ్లిపోవచ్చని ఆఫర్ ఇస్తాడు. ఇక బిగ్ బాస్ సీజన్ 7లో కూడా అదే జరిగింది. ప్రస్తుతం హౌజ్‌లో ఇంకా ఆరుగురు కంటెస్టెంట్స్ ఉండగా.. బిగ్ బాస్.. హౌజ్‌లోకి ఒక సూట్‌కేసును పంపించారు. అందులో అమౌంట్‌ను పెంచుతూ వెళ్తూ.. ఏ కంటెస్టెంట్ అయినా ఆ సూట్‌కేస్‌ను తీసుకొని తక్షణమే వెళ్లిపోవచ్చని ఆఫర్ ఇచ్చారు. దీంతో కంటెస్టెంట్స్ అంతా దాని గురించి చర్చించడం మొదలుపెట్టారు.


హౌజ్‌మేట్స్‌కు సూట్‌కేస్ ఆఫర్..
ముందుగా కంటెస్టెంట్స్ అందరినీ యాక్టివిటీ ఏరియాకు పిలిచి.. సూట్‌కేస్ గురించి వివరించాడు. ఆ తర్వాత గార్డెన్ ఏరియాలో వారికోసం సూట్‌కేస్‌ను ఏర్పాటు చేయించాడు. కంటెస్టెంట్స్ వచ్చి అక్కడ నిలబడిన తర్వాత ఆ సూట్‌కేస్ విలువ రూ.3 లక్షలు అని చెప్పాడు. ఇక సీజన్ మొదట్లో బిగ్ బాస్ హౌజ్‌లోకి సూట్‌కేస్‌తో ఎంటర్ అయిన ప్రియాంకకు ముందుగా ఆ సూట్‌కేస్‌ను అందజేశాడు. తనకు ఆ డబ్బులు కావాలా అని అడిగాడు. తనకు వద్దు అని చెప్పగానే.. పక్కన ఉన్న కంటెస్టెంట్‌కు ఇవ్వమన్నాడు. అలా ఒకరు తర్వాత ఒకరుగా అందరినీ ఆ సూట్‌కేస్ కావాలా అని అడుగుతూ వచ్చాడు బిగ్ బాస్. కానీ అందరి సమాధానం ఒక్కటే. అందరూ వద్దనే మాటపైనే నిలబడి ఉన్నారు. దీంతో సూట్‌కేస్ విలువను రూ.5 లక్షలకు పెంచాడు బిగ్ బాస్. అయినా కూడా దానిని తీసుకొని హౌజ్ వదిలి వెళ్లిపోవడానికి ఎవరూ రెడీగా లేరు. సూట్‌కేస్ గురించి బిగ్ బాస్ సీరియస్‌గా చెప్తున్న సమయంలో తానేదో దానిని తీసుకోబోతున్నట్టుగా శివాజీ కామెడీ చేశాడు కానీ తీసుకోలేదు. ఎవరూ దానిని తీసుకోకపోవడంతో హౌజ్‌మేట్స్ అందరినీ వెళ్లిపోమని చెప్పాడు బిగ్ బాస్.


అందరికీ టైటిలే కావాలి..
హౌజ్‌లోకి వెళ్లిపోయిన తర్వాత ఎంత డబ్బు ఇస్తే.. బిగ్ బాస్‌ను వదిలేసి వెళ్లిపోవడానికి రెడీగా ఉంటారని కంటెస్టెంట్స్ అందరినీ ఒక్కొక్కరిగా అడిగాడు శివాజీ. అయితే రూ.40 లక్షలు ఇస్తే వెళ్లిపోతాను అని అర్జున్ అన్నాడు. అమర్‌దీప్ మాత్రం ‘‘అన్ని డబ్బులు అందరికీ ఇచ్చేస్తే.. నాకేం మిగులుతుంది’’ అని తానే టైటిల్ విన్నర్ అన్నట్టుగా, ప్రైజ్ మనీ తనకు రావడం ఖాయం అన్నట్టుగా మాట్లాడాడు. అయితే ఎన్ని డబ్బులు ఇచ్చిన బిగ్ బాస్ వదిలి వెళ్లవా అని శివాజీ మళ్లీ అడిగాడు. సమస్యే లేదని సమాధానమిచ్చాడు అమర్. ‘‘రూ.30 లక్షలు ఇస్తే నువ్వు వెళ్లిపోతావు. నాకు తెలుసు. నువ్వే అన్నావు’’ అని గుర్తుచేశాడు శివాజీ. ‘‘అసలు వెళ్లను రాసిస్తాను. లక్ష అంటాం అన్ని చేస్తామా’’ అని అమర్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. అయితే వినేవాళ్లు వెధవలు అంటావా అని కౌంటర్ ఇచ్చాడు శివాజీ. హౌజ్‌మేట్స్ చర్చలు ముగిసిన తర్వాత మరోసారి అందరినీ గార్డెన్ ఏరియాలో పిలిచారు బిగ్ బాస్. ఈసారి సూట్‌కేసు విలువను రూ. 8 లక్షలకు పెంచి చూశాడు. అయినా ఎవరూ తీసుకోవడానికి సిద్ధంగా లేరు. రూ.10 లక్షలు అని చెప్పినా కూడా ఎవరూ తీసుకోవడానికి ముందుకు రాలేదు. అది చూసిన శివాజీ.. ‘‘ఇవన్నీ ముదురు కేసులు’’ అని కామెంట్ చేశాడు. దీంతో బిగ్ బాస్.. ఆ సూట్‌కేస్‌ను స్టోర్ రూమ్‌లో పెట్టేయమని ఆదేశించాడు.


Also Read: విన్నర్ రేసులో అమర్‌దీప్ - ప్లస్ మైనస్‌లు ఇవే, కలిసొచ్చిన అమాయకత్వం!