బిగ్ బాస్ రియాలిటీ షోలో సమయానుసారం హౌజ్‌మేట్స్‌కు కొన్ని పవర్స్ వస్తూ ఉంటాయి. ఇక ప్రస్తుతం ప్రసారమవుతున్న సీజన్ 7లో హౌజ్‌మేట్స్‌‌కు కొత్తగా పవర్ అస్త్రా అనే పవర్‌ను కూడా ఇచ్చారు బిగ్ బాస్. ఇక తాజాగా ఎవిక్షన్ ఫ్రీ పాస్‌ కోసం కూడా పోటీపెట్టారు. ఆ పోటీలు అన్నీ గెలిచి యావర్.. పాస్‌ను సొంతం చేసుకున్నాడు కూడా. కానీ పలు ఆటల్లో తను ఫౌల్‌గా ఆడడం వల్ల ఎవిక్షన్ ఫ్రీ పాస్‌ను స్వచ్ఛందంగా వెనక్కి ఇచ్చేశాడు. ఆ పాస్‌ను తిరిగి తీసుకోవడానికి బిగ్ బాస్ అంగీకరించినా కూడా హౌజ్‌మేట్స్‌‌కు మరొక అవకాశం ఇవ్వాలని అనుకున్నాడు. అందుకే తాజాగా ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం హౌజ్‌మేట్స్‌ అంతా మరోసారి పోటీపడ్డారు. 


హౌజ్‌మేట్స్‌‌కు మరో అవకాశం..


ఎవిక్షన్ ఫ్రీ పాస్ పోటీ ముగిసిన తర్వాత కూడా అది ఇంకా ఎవరికీ సొంతం అవ్వకపోవడం బిగ్ బాస్ చరిత్రలో ఇదే మొదటిసారి అని బిగ్ బాస్ హౌజ్‌మేట్స్‌‌కు తెలిపారు. అందుకే అది గెలుచుకోవడం కోసం అందరికీ ఒక ఫైనల్ ఛాన్స్ ఇస్తున్నట్టు చెప్పారు. హౌజ్‌మేట్స్‌ అంతా ఎవిక్షన్ ఫ్రీ పాస్‌ను గెలుచుకోవడం కోసం ‘బ్యాలెన్స్ ది కట్లరీ’ టాస్క్‌లో పోటీపడాలని ఆ టాస్క్ గురించి వివరించారు. ఈ టాస్క్‌లో హౌజ్‌మేట్స్‌ అంతా ఒక చేతిలో బ్యాలెన్స్ స్టాండ్‌ను పట్టుకొని సమయానుసారం బిగ్ బాస్ చెప్పిన వస్తువులను దానిపై ఒకదానిపై మరొకటి బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. చివరివరకు ఎవరైతే అన్ని వస్తువులు బ్యాలెన్స్ చేస్తారో వారికే ఎవిక్షన్ ఫ్రీ పాస్ దక్కుతుందని బయటపెట్టారు బిగ్ బాస్.


ప్రియాంక వర్సెస్ ప్రశాంత్..


టాస్క్ ప్రారంభమయిన తర్వాత ముందుగా శోభా శెట్టి.. వస్తువులను బ్యాలెన్స్ చేయలేక స్టాండ్‌ను పడేసింది. శోభా తర్వాత శివాజీ కూడా తన చేయి నొప్పి కారణంగా స్టాండ్‌ను ఎక్కువసేపు పట్టుకోలేకపోయాడు. అందుకే దానిని వదిలేసి పక్కకు వెళ్లి కూర్చొని విశ్రాంతి తీసుకున్నాడు. అలా ఒకరు తర్వాత ఒకరు బ్యాలెన్స్ చేయలేక టాస్క్ నుండి తప్పుకున్నారు. ఇక అర్జున్, అమర్‌దీప్, గౌతమ్.. ముగ్గురు ఒకేసారి స్టాండ్‌‌ను బ్యాలెన్స్ చేయలేకపోవడంతో ఒకేసారి ఔట్ అయ్యారు. చివరిగా ప్రియాంక, పల్లవి ప్రశాంత్ ఆటలో మిగిలారు. అదే సమయంలో ప్రియాంక కూడా బ్యాలెన్స్ చేయలేక వస్తువులను పడేసింది. ఇప్పటివరకు చాలా టాస్కులలో జరిగినట్టుగానే ఈ టాస్కులో కూడా చివరి వరకు వచ్చి ఓడిపోయింది. ప్రశాంత్ ఒక్కడే మిగలడంతో తనను ఉడత ఉడత ఊచ్ పాట పడమన్నాడు బిగ్ బాస్. ఆ పాట పాడేవరకు కూడా వస్తువులను.. ప్రశాంత్ కరెక్ట్‌గా బ్యాలెన్స్ చేయడంతో ఎవిక్షన్ ఫ్రీ పాస్ తన సొంతమయ్యింది.


ప్రశాంత్ ఎమోషనల్..


ఎవిక్షన్ ఫ్రీ పాస్ ప్రశాంత్ చేతికి వచ్చినందుకు ప్రశాంత్ ఎమోషనల్ కాగా.. తనకంటే ఎక్కువ శివాజీనే ఆనందపడ్డాడు. ‘‘నా నమ్మకం నిలబడింది’’ అంటూ ప్రశాంత్‌ను ప్రశంసల్లో ముంచేశాడు. ‘‘అన్నీ ఉన్న ఆకు ఎప్పుడూ అనిగిమనిగి ఉంటుంది. ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది’’ అని పలువురు హౌజ్‌మేట్స్‌‌ను ఉద్దేశించి సామెతను కూడా చెప్పాడు. ‘‘ఎగిరిపడే వాళ్ల గురించి పట్టించుకోవద్దు’’ అని సలహా ఇచ్చాడు. అయితే అలాంటి బ్యాలెన్స్ టాస్కులలో ప్రశాంత్ బాగా ఆడతాడని, ఒకప్పుడు పవర్ అస్త్రా కూడా ఇలాగే గెలిచాడని శోభా గుర్తుచేసుకుంది. ప్రశాంత్, శివాజీ డిస్కషన్‌లో ఉండగా యావర్ వచ్చి ఎవిక్షన్ ఫ్రీ పాస్ కావాలంటే శివాజీని ఉపయోగించమని, తనకోసం ఎప్పుడూ ఉపయోగించొద్దని ప్రశాంత్‌తో అన్నాడు. 


Also Read: కూతరు పెళ్లి, ఎమోషనల్ అయిన సీనియర్ నటి - వైరల్​గా మారిన పోస్ట్!