Murder in Bigg Boss House : మరోసారి బిగ్ బాస్ సీజన్ 7లో నామినేషన్స్.. రెండోరోజుకు చేరుకున్నాయి. గతవారం జరిగిన ఎవిక్షన్ ఫ్రీ పాస్, కెప్టెన్సీ టాస్కులపైనే ఈవారం నామినేషన్స్ ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి. దానివల్లే యావర్, గౌతమ్, ప్రశాంత్, అమర్‌దీప్‌ల మధ్య వాగ్వాదాలు కూడా జరిగాయి. అవన్నీ పూర్తవ్వకముందే ఎపిసోడ్ మాత్రం ముగిసింది. ఇక మిగిలినవారి నామినేషన్స్ నేడు ప్రసారం కానున్నాయి. అంతే కాకుండా తన కంటెస్టెంట్స్ కోసం బిగ్ బాస్ ఒక లంచ్ పార్టీని ఏర్పాటు చేశారు. కానీ అందులోనే ఒక ట్విస్ట్ పెట్టారు. దీంతో ఈవారం కెప్టెన్సీ టాస్కులో ఫుల్ ఫన్ ఉండబోతోందని అర్థమవుతోంది.


అదంతా నటన..


ముందుగా విడుదలయిన ప్రోమోలో నామినేషన్స్ ముగిసిన తర్వాత వాటి గురించి కంటెస్టెంట్స్ అంతా చర్చించడం మొదలుపెట్టారు. ‘‘ఏడుస్తారని చెప్పి నామినేట్ చేస్తారా?’’ అంటూ అమర్‌దీప్ వాపోయాడు. యావర్ సైతం అర్జున్‌తో మళ్లీ మామూలుగా ఉండడానికి ప్రయత్నం చేశాడు కానీ అర్జున్.. దానికి ఒప్పుకోలేదు. ప్రియాంక సైతం గొడవలు అన్నీ మర్చిపోయి.. శివాజీ దగ్గర కూర్చొని తన తప్పు ఏంటో చెప్పమంటుంది. ‘‘లేదమ్మా, మీరు మారలేరు, వయసుతో వచ్చే మెచ్యూరిటీ అవన్నీ’’ అంటూ శివాజీ సమాధానమిచ్చాడు. ఆ తర్వాత గౌతమ్.. అర్జున్‌తో కూర్చొని శివాజీ ప్రవర్తనపై చర్చించాడు. ‘‘ఆయన చేసింది తప్పు అయినా కూడా తప్పు అని చెప్తూ కోప్పడతాడు’’ అని అన్నాడు. ప్రశాంత్, శివాజీలు కూడా గౌతమ్ గురించి మాట్లాడుకున్నారు. మారాడు అనుకున్నా అని ప్రశాంత్ అనగా.. అదంతా నటన అని స్టేట్‌మెంట్ ఇచ్చాడు శివాజీ.


బూతులు వస్తాయి..


నామినేషన్స్ వల్ల తనకు ఫ్రస్ట్రేషన్ వస్తుందంటూ అశ్వినితో డిస్కషన్ మొదలుపెట్టాడు శివాజీ. ‘‘ఇప్పటినుండి నాకు స్టార్ట్ అవుతాయి బూతులు.. ఫ్రస్ట్రేషన్ వల్ల’’ అని శివాజీ అనగా.. ‘‘ఇప్పటినుండి రియల్ గేమ్ స్టార్ట్ అవుతుంది’’ అని అశ్విని కౌంటర్ ఇచ్చింది. ఇక నామినేషన్స్ గురించి సరిపడా చర్చలు జరిపిన తర్వాత కంటెస్టెంట్స్ అంతా ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్క్‌లో పాల్గొన్నారు. ఈసారి ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్క్ కోసం 10 మంది కంటెస్టెంట్స్ ఒకేసారి పోటీపడ్డారు. ఈ టాస్కులో కంటెస్టెంట్స్ అంతా ఒక చేతితో స్టాండ్‌ను పట్టుకొని మరో చేతితో గిన్నెలను బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ఆటలో బ్యాలెన్స్ చేయలేక కంటెస్టెంట్స్ అంతా ఒకరు తర్వాత ఒకరుగా ఓడిపోతూ ఉన్నారు. చివరిగా రేసులో ప్రియాంక, పల్లవి ప్రశాంత్ మాత్రమే మిగిలారు అని ప్రోమో చూస్తే తెలుస్తోంది.



బిగ్ బాస్ హౌజ్‌లో మర్డర్..


ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్క్ తర్వాత బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరినీ యాక్టివిటీ ఏరియాకు రమ్మన్నాడు. అది కూడా అర్జున్, అమర్‌దీప్‌లను వద్దన్నాడు. వారు యాక్టివిటీ ఏరియాలోకి వెళ్లకపోవడానికి ఒక కారణం ఉందని బిగ్ బాస్ రివీల్ చేశాడు. మరోవైపు యాక్టివిటీ ఏరియాలో కంటెస్టెంట్స్ కోసం మిసెస్ బిగ్ బాస్ లంచ్ ఏర్పాటు చేశారు. రతిక మాత్రం దీని వెనుక ఏదో ఉంది అని ఆలోచిస్తుండగా.. ‘‘మీరు ఇంకా ఓవర్ థింకింగ్ ఆపలేదా’’ అని బిగ్ బాస్ సరదాగా అడిగారు. అందరూ లంచ్ ఎంజాయ్ చేస్తుండగానే బయట నుండి ఒక అరుపు వినిపించింది. కంటెస్టెంట్స్ అంతా పార్టీలో ఉన్నప్పుడు బిగ్ బాస్‌లో ఒక హత్య జరిగిందని, చనిపోయింది మిసెస్ బిగ్ బాస్ అని బిగ్ బాస్.. కంటెస్టెంట్స్‌కు చెప్పాడు. కంటెస్టెంట్స్ అంతా కన్‌ఫ్యూజన్‌లో ఉండగా.. అమర్‌దీప్, అర్జున్.. పోలీస్ గెటప్స్‌లో వచ్చి అందరినీ మరింత ఆశ్చర్యపరిచారు.



Also Read: నీ కలర్స్ అన్నీ చూశా కాబట్టే మాట్లాడుతున్నా - ప్రియాంకపై శివాజీ ఫైర్