Actor Mahesh Vitta About Big Boss: మ‌హేశ్ విట్ట‌.. క‌మెడియ‌న్ గా యూట్యూబ్ లో చిన్న చిన్న వీడియోలు చేస్తూ ఫేమ‌స్ అయ్యాడు. అలా సినిమా ఛాన్సులు కొట్టేసి, పెద్ద పెద్ద హీరోల‌తో సినిమాలు చేసి స‌క్సెస్ అయ్యాడు. ఇక అక్క‌డ నుంచి బిగ్ బాస్ సీజ‌న్ -3లోకి ఎంట్రీ ఇచ్చి దాదాపు 12 వారాలు త‌న ఆట‌తీరుతో అంద‌రి మెప్పు పొందాడు. అయితే, బిగ్ బాస్‌కు కేవ‌లం డ‌బ్బులు వ‌స్తాయ‌నే వెళ్లాన‌ని, ఓటీటీ కూడా డబ్బుల కోస‌మే వెళ్లాన‌ని చెప్పాడు. బిగ్ బాస్ హౌస్ లో వ‌రుణ్  సందేశ్‌తో గొడ‌వ‌పై కూడా క్లారిటీ ఇచ్చాడు మ‌హేశ్. 


బిగ్ బాస్ త‌ర్వాత ఆఫ‌ర్లు రాలేదా? 


‘‘బిగ్ బాస్ త‌ర్వాత ఆఫ‌ర్స్ పెరిగాయి. నిజానికి సీజన్ - 2కి న‌న్ను పిలిచారు. నానీ అన్న న‌న్నుపిల‌వ‌మ‌ని చెప్పారంట. కానీ, అప్ప‌టికే ఏడు సినిమాలు జ‌రుగుతున్నాయి నావి. డేట్స్ బ్లాక్ అయ్యాయి అని చెప్పాను. ఆ త‌ర్వాత సీజ‌న్‌కు ఆరు నెల‌ల ముందే ఫోన్ చేసి మీరు క‌న్ఫామ్ చేసుకున్నారు. అప్పుడు నాకు బ‌య‌ట చెప్పింది ఏంటంటే డ‌బ్బులు బాగా వ‌స్తాయి. బ‌య‌ట మూడేళ్లు నాలుగేళ్లు క‌ష్ట‌ప‌డితే వ‌చ్చేవి అక్క‌డ ఒక్కసారికే వ‌స్తాయి అని అన్నారు. హ్యాపీగా వెళ్లు.. అప్పులు అన్నీ తీరిపోతాయి, ఇల్లు కొనుక్కోవ‌చ్చు అని అన్నారు. దీంతో మంచిగ డ‌బ్బులు ఇస్తే వ‌స్తాను అని వెళ్లా. బిగ్ బాస్ త‌ర్వాత సినిమాల ఆఫ‌ర్స్ పెరిగాయి, రెమ్యున‌రేష‌న్ పెరిగింది’’ అని మహేష్ తెలిపాడు. 


వ‌రుణ్ సందేశ్‌తో గొడ‌వ ఏంటి? 


‘‘బిగ్ బాస్ మంచి ఫ్లాట్ ఫామ్. దాన్ని మ‌నం వాడుకోవాలి. మ‌న‌ల్ని అది వాడుకోకూడ‌దు. బిగ్ బాస్‌కు వెళ్లాను క‌దా అని గొడ‌వ‌లు పెట్టి, పెంట.. పెంట చేసి క‌ప్పులు తెచ్చుకున్నా లాభం ఏంటి? ఛాన్సులు రాకుండా అవ్వ‌డం త‌ప్ప‌. మంచి రీచ్ ఉన్న ప్రోగ్రామ్.. చూసేవాళ్లని ఇంప్రెస్ చేస్తే చాలు. అలా నేను లాస్ట్ వ‌ర‌కు ఉన్నా. అది కూడా చాలా పెద్ద కాంపిటీష‌న్. నేను, రాహుల్ సిప్లిగంజ్, వ‌రుణ్ సందేశ్. వ‌రుణ్ సందేశ్ గొడ‌వ పెట్టుకున్న‌ప్పుడు, నా మీదికి వ‌చ్చిన‌ప్పుడు.. ఆ ప్లేస్ లో వేరేవాళ్లు ఉంటే కొడ‌తం. కానీ, ఇతన్ని నేను చిన్న‌ప్ప‌టి నుంచి చూస్తున్నా, సినిమాలు చూశాను, హ్యాపీ డేస్ చూశాను. నువ్వు ఏంది బ్రో నా మీద‌కి వ‌స్తున్నావు, నేను నీ ఫ్యాన్ ని ఏమైంది బ్రో అని ఆలోచిస్తూ ఉండిపోయా. ఆ త‌ర్వాత ఆయ‌నే వ‌చ్చి మాట్లాడారు. అప్పుడు సెట్ అయిపోయింది’’ అని పేర్కొన్నాడు.


ఇప్పుడు కంటెస్టెంట్స్ తో బాండింగ్ ఎలా ఉంది? 


‘‘అస్స‌లు ఎవ్వ‌రూ పట్టించుకోలేదు. బ‌య‌టికి రాగానే ఎవ్వ‌రితో కాంటాక్ట్ కాలేదు. హౌస్ లో ఎవ్వ‌రిని క్లోజ్ చేసుకోలేదు. మ‌న‌సు విప్పి మాట్లాడుకుంటే దాని నుంచి పాయింట్స్ తీసి నామినేట్ చేసి ప‌డేస్తున్నారు. అందుకే ఎవ్వ‌రితో క్లోజ్ అవ్వ‌లేదు. అక్క‌డ నుంచి బ‌య‌టికి రాగానే మా త‌మ్ముడు ఫోన్ చేశాడు. సుకుమార్ గారు నిన్న క్యారెక్ట‌ర్ గా అనుకుంటున్నారంట‌. చాలాసార్లు ఫోన్ చేశారు అని చెప్పారు. వెంట‌నే ఆవాసాకి వెళ్లిపోయి ఆయ‌న్ని క‌లిసి అక్క‌డ నుంచి ఇంటికి వెళ్లాను. ఇంట్లో మా అమ్మ‌ని ఇష్ట‌మైన ఫుడ్ చేయ‌మ‌ని, అమ్మ‌తో సినిమా చూసి అక్క‌డ నుంచి చెన్నై, బెంగ‌ళూరు అన్ని తిరిగి ఫినాలే చూసుకున్నాను. ఆ త‌ర్వాత వ‌రుస సినిమాల‌తో బిజీ అయిపోయాను’’ అని తెలిపాడు.


ఓటీటీకి ఎందుకు వెళ్లారు మ‌ళ్లీ? 


‘‘ఓటీటీకి కూడా డ‌బ్బులు కోస‌మే వెళ్లాను. అక్క‌డ వీక్లి డ‌బ్బులు ఇస్తారు. లాక్ డౌన్ లో ఒక సినిమా మొద‌లుపెట్టా. నాకు వ‌చ్చిన డ‌బ్బులన్నీ దాంట్లో పెట్టేశా. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కి డ‌బ్బులు కావాలి. ఆ డ‌బ్బుల కోసం ఓటీటీకి వెళ్లా. ముందు బిగ్ బాస్ వాళ్లు ఫోన్ చేస్తే రాను అన్నాను. ఒక‌సారి రావ‌డ‌మే ఎక్కువ అన్నాను. ఈ ఇన్ఫర్మేష‌న్ మా అమ్మ‌కి వెళ్లింది. "ఏమిరా బిగ్ బాస్ వాళ్ల‌కు ఫోన్ చేస్తే వెళ్ల‌లేదంట అని అడిగింది. నీ య‌బ్బా సినిమా తీసిన‌వు డ‌బ్బులు అయిపోగొట్టిన‌వు నీ య‌బ్బ క‌డ‌తాదా? నోరు మూసుకుని వెళ్లి కూర్చుని తినిరా" అని తిట్టింది. దీంతో వెళ్లాను, ఓటీటీ బానే క‌లిసొచ్చింది. 


మ‌ళ్లీ వెళ్తారా?


అస‌లు బిగ్ బాస్ గురించి నాకేం తెలీదు. సినిమాలు మాత్ర‌మే చూస్తాను. క‌నీసం యూట్యూబ్ కూడా చూడ‌ను. నేను చేసిన వీడియోలు కూడా క‌నీసం చూసుకోను. నాకు, వ‌రుణ్ సందేశ్, రాహుల్ కి అస‌లు ఏం తెలీదు. టాస్క్ లు చ‌దివితే ఏందిరా ఇది అనుకునేవాళ్లం. మీరు చూస్తే టాస్కులు త‌క్కువ ఆడింది నేను, వ‌రుణ్ సందేశ్, రాహుల్ సిప్లిగంజ్. ఎందుకంటే మాకేం తెలీదు అక్క‌డ‌. మేబీ అదే జెన్యూనిటీ ఏమో. అదే మాకు ప్ల‌స్ అయ్యింది. జెన్యూన్ గా మాట్లాడినా దాన్ని నెగ‌టివ్ చేసేస్తారు లోప‌ల. నా విష‌యంలో అదే జ‌రిగింది. అందుకే, ఎవ్వ‌రితో క‌నెక్ట్ అవ్వ‌లేదు. ఇక మూడోసారి బిగ్ బాస్ కి పిలిస్తే హ్యాపీగా వెళ్తాను. ఫ‌స్ట్ టైం మాత్ర‌మే టెన్ష‌న్ గా ఉండేది. త‌ర్వాత ఇంకేం ఉండ‌దు. బిగ్ బాస్ రాక‌ముందు తెలుగు వ‌న్ వాళ్లు జీతం ఇచ్చేవాళ్లు. డ‌బ్బులు లేవు, సరిపోవు అనుకున్న‌ప్పుడు పార్ట్ టైమ్ జాబ్ చేసేవాడిని’’ అని తెలిపాడు.


Also Read: 'క‌ల్కీ' ఈవెంట్‌‌కు సీఎం చంద్ర‌బాబు, ప‌వ‌న్.. అమ‌రావ‌తిలో పెడితే రానంటున్న ప్ర‌భాస్?