'బిగ్ బాస్' (Bigg Boss Telugu) కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం కంటే ముందు సోహైల్ (Syed Sohel) హీరోగా సినిమాలు చేశారు. హౌస్‌లోకి వెళ్లి వచ్చిన తర్వాత కూడా హీరోగా సినిమాలు చేస్తున్నారు. అయితే... 'బిగ్ బాస్' ద్వారా ఆయన తెలుగు లోగిళ్లలో ఎక్కువ మంది చేరువ అయ్యారు. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'లక్కీ లక్ష్మణ్' (Lucky Lakshman Movie).
డిసెంబర్‌లో సినిమా రిలీజ్!
'లక్కీ లక్ష్మణ్' సినిమాను డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు ఈ రోజు వెల్లడించారు. థియేటర్లలో సినిమా విడుదల కానుంది. ఆల్రెడీ విడుదల చేసిన ఫస్ట్ లుక్, సాంగ్స్‌కు మంచి స్పందన లభించిందని చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేసింది. త్వరలో విడుదల తేదీ వెల్లడిస్తామని తెలిపింది.
శనివారం టీజర్ చూస్తారా?
Lucky Lakshman Teaser : 'లక్కీ లక్ష్మణ్' టీజర్‌ను ఈ శనివారం (డిసెంబర్ 3న) విడుదల చేయనున్నట్లు హీరో సోహైల్ తెలిపారు. ఆ రోజు ఉదయం తొమ్మిది గంటలకు టీజర్ యూట్యూబ్‌లో విడుదల కానుంది. ఆల్రెడీ విడుదల అయిన ఫస్ట్ లుక్‌లో ఆయన చాలా స్టైలిష్‌గా ఉన్నారని పేరు వచ్చింది. లుక్‌లో ఆయన చేతుల నిండా డబ్బే డబ్బు. బహుశా... సాంగ్ షూటింగ్‌లో స్టిల్ అయ్యి ఉండొచ్చు.
ఒక విధంగా ఈ సినిమా కూడా పాన్ ఇండియా రిలీజ్ అని చెప్పాలి. ఎందుకంటే... తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో టీజర్ విడుదల చేస్తున్నట్లు సోహైల్ తెలిపారు. మిగతా భాషల్లో ఈ సినిమాకు ఎటువంటి స్పందన వస్తుందో చూడాలి.
అన్ లక్కీ అని ఫీలయ్యే అబ్బాయి కథ!
''లక్ష్మణ్... తానొక అన్ లక్కీ ఫెలో అని ఫీలవుతాడు. అతడి చుట్టూ ఉన్న వారంతా లక్కీ ఫెలో అని చెబుతున్నా వినడు. తాను ఎప్పటికీ అన్ లక్కీ ఫెలోనే అని ఫీలయ్యే ఆ యువకుడి జీవితంలో జరిగిన ఆసక్తికర అంశాలతో అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రమిది'' అని దర్శక - నిర్మాతలు చెప్పారు. దత్తాత్రేయ మీడియా పతాకంపై ఎ.ఆర్. అభి దర్శకత్వంలో హరిత గోగినేని 'లక్కీ లక్ష్మణ్' చిత్రాన్ని నిర్మించారు. ఇందులో మోక్ష హీరోయిన్.
Also Read : లెజెండరీ దర్శక నిర్మాతలతో 'లెజెండ్' బాలకృష్ణ - ఈ వారం 'అన్‌స్టాపబుల్' మామూలుగా ఉండదు
'లక్కీ లక్ష్మణ్'తో పాటు 'మిస్టర్ ప్రెగ్నెంట్' అని సోహైల్ మరో సినిమా చేస్తున్నారు. పురుషుడు గర్భం దాలిస్తే? అనేది ఆ సినిమా కాన్సెప్ట్. ఇటీవల హిందీలో ఈ తరహా సినిమా 'మిస్టర్ మమ్మీ' వచ్చింది. అందులో రియల్ లైఫ్ కపుల్ రితేష్ దేశ్ ముఖ్, జెనీలియా నటించారు.
సోహెల్, మోక్ష జంటగా నటించిన 'లక్కీ లక్ష్మణ్' సినిమాలో దేవి ప్రసాద్, రాజా రవీంద్ర, సమీర్, కాదంబరి కిరణ్, షాని సాల్మన్, అనురాగ్, అమీన్, శ్రీదేవి కుమార్, మాస్టర్ రోషన్, మాస్టర్ అయాన్, మాస్టర్ సమీర్, మాస్టర్ కార్తికేయ, రచ్చ రవి , 'జబర్దస్త్' కార్తిక్, జబర్దస్త్ గీతూ రాయల్, 'కామెడీ స్టార్స్' ఫేమ్ యాదమ్మ రాజు తదితరులు ఇతర తారాగణం. ఈ చిత్రానికి నృత్యాలు : విశాల్, కూర్పు : ప్రవీణ్ పూడి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : విజయానంద్ కీత, ఛాయాగ్రహణం : ఐ. ఆండ్రూ, పాటలు : భాస్కరభట్ల రవికుమార్, సంగీతం : అనూప్ రూబెన్స్, కథ, కథనం, మాటలు, దర్శకత్వం : ఏఆర్ అభి.