‘బిగ్ బాస్’ విన్నర్ వీజే సన్నీ దొంగగా మారాడా? అంటూ గత కొద్ది రోజులుగా ఓ సీసీటీవీ కెమేరా వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఆ వీడియోలో సన్ని ఓ బిల్డింగ్ నుంచి డబ్బుల సంచితో బయటకు పరుగులు పెడుతూ కనిపించాడు. అయితే, ఆ దోపిడీ వెనుక మిస్టరీ ఏమిటనేది ఎట్టకేలకు రివీల్ అయ్యింది. అంతేకాదు, దాని వెనుక దర్శకుడు హరీష్ శంకర్ హస్తం కూడా ఉందని తేలింది. ఇంతకీ ఆ మిస్టరీ ఏమిటంటే.. ఆ వైరల్ వీడియో అసలే నిజమే కాదు. త్వరలో విడుదల కానున్న ‘ATM’ వెబ్ సీరిస్‌కు సంబంధించిన ప్రమోషన్‌లో భాగంగా ఈ వీడియోను సోషల్ మీడియాలోకి వదిలి ఆసక్తి కలిగించారు. తాజాగా ATM టీజర్ రిలీజ్ చేసి అనుమానాలకు తెర దింపారు. 


టాలీవుడ్ లో విలక్షణ దర్శకుల్లో డైరెక్టర్ హరీష్ శంకర్ ఒకరు. ఆయన తీసే సినిమాలు అన్నీ చాలా కొత్తగా కనిపిస్తుంటాయి. హరీష్ శంకర్ తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాను తెరకెక్కిస్తున్నారు ఆయన. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు కూడా ప్రారంభం అయిపోయాయి. ఈ సినిమాతో పాటు హరీష్ మరో వెబ్ సిరీస్ లోనూ భాగం అయ్యారు. ఆయన రాసిన కథతో ‘ఏటిఎం’ అనే వెబ్ సిరీస్ రూపొందింది. ఇది ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌లో విడుదల కానుంది. ఇందులో బిగ్ బాస్ ఫేమ్ వీజే సన్ని ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. దీనికి సి.చంద్ర మోహన్ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన టీజర్ ను విడుదల చేశాడు దర్శకుడు హరీష్. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


బిగ్‌బాస్‌ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు వీజే సన్ని. బిగ్ బాస్ తర్వాత వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి. కెరీర్ ప్రారంభంలో పలు సీరియల్స్, టీవీ షో ల తో ఆకట్టుకున్నాడు. బిగ్ బాస్ షో తో మంచి పాపులారిటీ తెచ్చుకున్నాడు సన్నీ. ఇప్పుడు ‘ఏటీఎం’ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 






ఇక ఈ టీజర్ విషయానికి వస్తే..  బస్తీలో ఉండే హీరో లగ్జరీ లైఫ్ గడపాలి అనుకుంటాడు. అందుకు ఏటీఎంలో దొంగతనాలకు అలవాటుపడతాడు. ఓసారి అనుకోకుండా పోలీసుల కంటపడతాడు. అయితే చివరికి పోలీసులకు చిక్కుతాడా లేదా అనే కథాంశంతో ఈ వెబ్ సిరీస్ రూపొందినట్లు తెసుస్తోంది. అంతేకాకుండా దొంగతనాన్ని అడ్డుపెట్టుకుని ఇంకా చాలా అక్రమాలకు పాల్పడుతున్నట్టు కూడా టీజర్ లో కనబడుతోంది. మొత్తంగా ఈ వెబ్ సిరీస్ టామ్ అండ్ జెర్రీ షోలా ఉంటూ యాక్షన్ సన్నివేశాలతో పాటే నవ్విస్తుందని అంటున్నారు. ఇక ఈ వెబ్ సిరీస్ జనవరి 20 నుంచి జీ5 ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కానుంది. దీనికి దర్శకుడు హరీష్ కథ అందించగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు కుమార్తె హన్షితా రెడ్డి నిర్మాణ బాధ్యతలు చేపట్టింది. ఇందులో సుబ్బరాజు, దివి ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఇక ఈ వెబ్‌ సిరీస్‌ తెలుగుతో పాటు తమిళ్ లోనూ స్ట్రీమింగ్‌ కానుంది. విహారి సంగీతం అందిస్తున్నాడు. టీజర్ కూడా ఆకట్టుకోవడంతో ఈ వెబ్ సిరీస్ పై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. మరి ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఎంత మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.