‘ది కేరళ స్టోరీ’ సినిమాతో కనీవినీ గుర్తింపు తెచ్చుకుంది ముంబై ముద్దుగుమ్మ ఆదా శర్మ. తెలుగు, కన్నడ సినిమా పరిశ్రమల్లో పలు సినిమాలు చేసినా అనుకున్న స్థాయిలో పాపులర్ కాలేదు. కేరళ స్టోరీ దెబ్బతో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ సినిమా ఆదా కెరీర్ కు టర్నింగ్ పాయింట్ గా మారిపోయింది. ఎన్నో సంచలనాలకు వేదిక అయిన ఈ సినిమా, అద్భుత విజయాన్ని అందుకుంది.  


‘ది కేరళ స్టోరీ’తో సంచలన విజయం


‘ది కేరళ స్టోరీ’ సినిమాలో షాలిని అనే పాత్రలో ఒదిగిపోయిన నటించింది ఆదాశర్మ. మతం మార్చి అరబ్ దేశాలకు తరలించే అమ్మాయిగా అద్భుత నటన కనబరిచింది. ఎన్ని వివాదాలు, విమర్శలు వచ్చినా, ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాను చక్కగా ఆదరించారు.  బాలీవుడ్ డైరెక్టర్ సుదీప్తో సేన్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు.  బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపించింది. కేవలం రూ.40 కోట్ల రూపాయలతో తెరకెక్కించిన ఈ చిత్రం ఏకంగా రూ. 300 కోట్లు వసూళు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సినిమా సక్సెస్ ఏ ఒక్కరిది కాదని అప్పట్లో ఆదాశర్మ చెప్పింది. ఎవరిని ఇబ్బంది పెట్టాలని ఈ సినిమా చేయలేదని చెప్పింది. వాస్తవ పరిస్థితులు ప్రజలకు తెలియాలనే ఈ సినిమా చేసినట్లు వెల్లడించింది.      


మావోయిస్టు పాత్రలో ఆదాశర్మ


ఇక తాజాగా కేరళ స్టోరీ మేకర్స్ మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టును రూపొందిస్తున్నారు. 'బ‌స్త‌ర్' అనే సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమాకు 'ది న‌క్స‌ల్స్ స్టోరీ' అనే ట్యాగ్ లైన్ పెట్టారు. ఈ సినిమాను కూడా దర్శకుడు సుదీప్తో సేన్ తెర‌కెక్కిస్తున్నారు. ‘ది కేరళ స్టోరీ’ నిర్మాత విపుల్ అమృత్ పాల్ షా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఆదాశర్మ మావోయిస్టు లీడర్ గా కనిపించబోతుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రారంభం అయ్యింది. ఈమేరకు కొన్ని ఫోటోలను చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది.






షాలినిలాగే ఆదరించండి- ఆదాశర్మ   


ఇక ఈ సందర్భంగా నటి ఆదాశర్మ కీలక విషయాలు వెల్లడించింది. “‘ది కేర‌ళ స్టోరీ’ చిత్రంలో నేను పోషించిన షాలిని పాత్ర‌ను దేశ వ్యాప్తంగా ప్రేక్షకులు ఎంత‌గానో ఆద‌రించారు. ఆపాత్ర‌తో నాకు ఇప్పటి వరకు దక్కని గుర్తింపు ద‌క్కింది. కొత్త త‌ర‌హా చిత్రాల‌కు ప్రేక్ష‌కులు ఆదరిస్తారు అనడానికి ‘ది కేరళ స్టోరీ’ ఒక ఉదాహారణగా చెప్పుకోవచ్చు. ఇలాంటి ప్రయత్నాలు మళ్లీ మళ్లీ జరగాలి. సమాజంలో లోలోపల జరుగుతున్న విషయాలు బయటకు రావాలి. ఆయా అంశాల మీద ప్రజల్లో అవగాహణ కలిగించే ప్రయత్నం జరగాలి. ‘బస్తర్’ సినిమాలో నీర్జా మాధ‌వన్ గా న‌టిస్తున్నాను. షాలిని పాత్ర‌ మాదిరిగానే ఈ పాత్ర‌ని ఆద‌రిస్తార‌ని భావిస్తున్నాను” అని ఆదాశర్మ చెప్పుకొచ్చింది.   


Read Also: మహేష్ మూవీలో ఛాన్స్ వచ్చినా చేయలేదు, ఎందుకో చెప్పి కాంట్రవర్సీ చేయలేను


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial